Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శుభకృతు' నామ సంవత్సరంలోకి మనం కాలుపెట్టి నేటికి మూడోరోజు. పాపం! పంచాంగకర్తలు, ప్రోక్తలు నాయకులకు ఇవ్వగలిగినంత ధైర్యం ఇచ్చారు. ''ఏరోటి కాడ ఆ పాట!'' అంటే కొందరు సకల విద్యా విశారదులకు కోపం రావచ్చు! ప్రగతిభవన్ పంచాగకర్త శుభకృతును ''ఉద్యోగ నామ సంవత్సరం'' అన్నారు. పైగా పార్టీలు మారే వారికి గడ్డుకాలం అంటూ జంప్ జిలానీలకు, ముఖ్యంగా టీఆర్ఎస్ వారికి ఒక వార్నింగ్ విసిరాడు. అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలానికి రేవంత్రెడ్డి తన పార్టీవారందర్నీ ఏకతాటిమీద నడపగలడని మరో వేదపండితుల వారు ఇందిరాభవన్లో పంచాంగం పఠించి ఠీకా, తాత్పర్యం వెల్లడించారు. ఇక బీజేపీ కార్యాలయం వెనక్కి తగ్గుతుందా?! అక్కడొక శర్మగారు 'మోడీనే మరోసారి ప్రధాని' అవుతారన్నారు. సి.బి.ఐ, ఇ.డి.లు కొన్ని సంచలన విషయాల్ని బయటికి తీస్తాయనేది వీరి ప్రవచనంలో కీలకాంశం. అది ఎవర్ని ఉద్దేశించి అన్న మాటలో తెలంగాణలోని చిన్న పిల్లలకు సైతం తెలిసిన విషయమే! అడిగితే చెప్పారో, అయాచితంగా చెప్పారో గాని ''ఈసారి అధికార పార్టీ మంచి వ్యక్తిని రాష్ట్రపతిని చేస్తుందన్నారు!! అంటే ఇప్పుడున్నాయన...! సమస్య రాజకీయ పార్టీలది కాదనే విషయం తెలంగాణ సమాజానికి తేలిగ్గానే అర్థమవుతుంది. కోట్ల మంది రైతులు తాము పండించిన ధాన్యాన్ని కేంద్రం కొంటుందో లేదో తెలియక సంధిగ్ధావస్థలో ఉన్నారు. ఈ విషయం కనీసం ప్రగతిభవన్లో సైతం ప్రవచించకపోవడం అశ్చర్యమేమరి! మన తెలంగాణతో సహా దేశ రైతాంగం ఎదుర్కొనే కీలక ప్రశ్న కనీస మద్దతు ధర (ఎంఎస్పి), రైతులు వాడే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, విద్యుత్ ఛార్జీలు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఆకాశంలోకి దూసుకెల్తున్నాయి. రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ మాట ఏమైందో, కనీసం 'శుభకృతు'లోనైనా రైతుల ఇళ్ళల్లో అశుభాలు జరగకుండా ఉంటాయేమోనని ఏ ప్రవచన కారుడైనా చెప్తారేమోనని ఎదురుచూసిన వారికి, ఏ పంచాంగంలోనైనా రాసుంటుందని ఆశపడ్డవారికి నిరాశే మిగిలింది. దేశంలో నిరుద్యోగ సమస్య గత 40ఏండ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. సాలుకి రెండుకోట్ల మందికి కొత్తగా ఉపాధి కల్పిస్తామన్న మోడీ వాగ్దానం ఆవిరైపోయింది. 'మేకిన్ ఇండియా' వల్ల 2022 నాటికి తయారీరంగంలో పదికోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని మోడీ 2014 సెప్టెంబర్ 25న చెప్పిన మాట కూడ గాలికి పేలపిండి కృష్ణార్పణం!' మొన్న యూపీ, బీహార్ల్లో లాగా ఉద్యోగాల కోసం అల్లర్లు (జాబ్ రియట్స్) దేశమంతా జరుగకుండా చూసుకోవాలేమోనని ఇటీవల ఔట్లుక్ పత్రిక రాసింది. వ్యవసాయం, ఫైనాన్షియల్ సర్వీస్లు మినహా మిగిలిన తయారీరంగంలో 2016-17 నుండి 2020-21 వరకు ఉపాధి తగ్గిపోయింది. ఎంఎస్ఎంఈలు, ఇతర చిన్న పరిశ్రమలు, నోట్లరద్దు, జీఎస్టీల దెబ్బనుండి ఇంకా కోలుకోకముందే కోవిడ్దెబ్బ, లాక్డౌన్ల దెబ్బలు తగిలాయి. వాటి సామర్థ్యం వినియోగం 60శాతం కంటే తగ్గిందని సి.ఎమ్.ఐ.ఇ. పేర్కొంది. దేశ జనాభాలో సగం జనాభా ఉన్న మహిళల ఉపాధి అవకాశాల గురించి పంచాంగ కర్తా పల్లెత్తుమాట చెప్పకపోవడం, కనీసం మనదేశంలో స్త్రీలు ఇంట్లోంచి కాలు బయటపెట్టేందుకు ఏ సమాజం ఎందుకు సహకరించడంలేదో చెప్పకపోవడం దారుణమేగా? పంచాంగం మనువాదంలో అంతర్భాగమని తెలియడం లేదా? యావత్ భారతదేశంలో, దాన్లో అంతర్భాగంగా ఉన్న మన తెలంగాణలో కోట్లాదిమంది ధరవరల కింద నలిగి చితికిపోతున్న సంగతి పంచాంగ కర్తలకు తెలిసే ఉంటుంది. దీని నుండి ఉపశమనం 'శుభకృతు'లో నైనా దొరుకుతుందోలేదో చెప్పి ఉంటే చాలామంది సంతోషించేవాళ్లు! ధరల పెరుగుదలకు మోడీ సర్కారే కారణమని అర్థమై ఉంటుంది. లేదంటే మోడీ జాతక చక్రంలో అద్భుత యోగముందని 2028వరకు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రజలు గౌరవిస్తారని బొంకాల్సిన అవసరమే ఉండేదికాదు. 2028 ఏం ఖర్మ, దానికి దశాబ్దం ముందే ప్రజలు గౌరవించలేదని రైతు ఉద్యమ సారాంశం.
దేశంలో నూటికి 99మందికి ఉగాదైనా, రంజానైనా, క్రిస్ట్మస్ అయినా ఒకటే! తెల్లారినప్పటి నుంచి ఐదువేళ్ళూ నోట్లోకెళ్ళే మార్గం కోసం అన్వేషణ. పంచాంగమంటే భవిష్యవాణి కాదని వాదించేవారూ ఉంటారు. నిజమే! మరి మోడీ మూడవసారి ప్రధాని అవుతాడని, సిబిఐ, ఈడీలు కొత్త విషయాల్ని బయటపెడతాయని బీజేపీ ఆఫీసులో చెప్పిన వారు, ప్రగతిభవన్లో '3వ కన్ను' గురించి హెచ్చరించిన వారికి సామాన్యుల సంగతులు తెలియదా? అవి పంచాంగంలో ఉండే విషయాలు కాదు, పండితులు వ్యాఖ్యానాలేనంటారా? అప్పుడు వీరి పాండిత్యమంతా ప్రాయోజిత కార్యక్రమాల కోసమేనా?