Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాంద్రాయణగుట్టకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఇటీవల మత్తుమందుకు అలవాటు పడ్డాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు పాకెట్ మనీ కట్ చేశారు. డ్రగ్స్ కొనడానికి డబ్బుల్లేకపోవడం, తల్లిదండ్రులను అడిగినా ఇవ్వకపోవడంతో ఏకంగా తండ్రినే హత్య చేసేందుకు సిద్ధపడ్డాడు.
మలక్‌పేటకు చెందిన ఓ యువకుడు డ్రగ్స్‌కు ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి తల్లిదండ్రులు కొనిచ్చిన టూ వీలర్‌ను అమ్మడమే కాదు.. వీధుల్లో పార్క్ చేసిన వాహనాలనూ దొంగిలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. మాదక ద్రవ్యాల కోసం యువత చిన్నచిన్న చోరీల నుంచి హత్యలు చేయడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవల నగరంలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బంజారాహిల్స్ రాడిసన్‌బ్లూ హౌటల్లో దొరికిన 150 మందిలో 80శాతం మంది 35ఏండ్లలోపు వారే కావడం గమనార్హం. సరైన అనుమతులు కూడా లేకుండా రాష్ట్ర నడిబొడ్డున యదేచ్ఛగా నడుపుతున్న ఫుడింగ్ మింగ్ హబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేస్తే.. అందులో పట్టుబడిన వారంతా యువకులే కావడం పోలీసులనే కాదు సమాజాన్నీ షాక్‌కు గురి చేస్తోంది.
డ్రగ్స్ రాకెట్లో సామాన్యుడు.. సంపన్నుడు.. విద్యార్థులు.. ఉద్యోగులనే తేడా లేదు. పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు మాత్రమే కాకుండా అపార్ట్మెంట్స్, విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలను కూడా తమ విక్రయకేంద్రాలుగా మలుచుకుంటోంది డ్రగ్స్ మాఫియా. సాంకేతిక పరిజ్ఞానం, రవాణా సౌకర్యాలు అనుకూలంగా మారడంతో సాధారణ విద్యార్థి నుంచి కార్పొరేట్ ఉద్యోగి వరకూ అవి సులభంగా చేరుతున్నాయి. ఏటా రూ.లక్షలు సంపాదిస్తున్న ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు కూడా తేలికగా డబ్బు సంపాదించాలనే కోరికతో ఈ మాఫియా చట్రంలో ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు ఈ మాఫియా తన ఆగడాలకు హైదరాబాద్‌ను కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలో ఈ మాఫియా మహమ్మారిని నివారించేందుకు వెయ్యిమంది సిబ్బందితో ప్రత్యేక విభాగాన్ని కొలువుతీర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల్ని గతంలోనే ఆదేశించారు. డ్రగ్స్‌ఫ్రీ రాష్ట్రంగా మార్చాలంటూ స్వయంగా సీఎం ఆదేశించినా.. మత్తు పదార్థాల వినియోగాన్ని కట్టడి చేయడంలో పోలీసు, ఎక్సైజ్ శాఖలు పూర్తిగా విఫలమవుతున్నాయి. పోలీసు శాఖలో కొందరు పబ్‌లు, క్లబ్‌ల నిర్వాహకులతో అంటకాగుతుండటంతో డ్రగ్స్‌పై తనిఖీల ఊసే ఉండడం లేదని విమర్శలొస్తున్నాయి. వారి కనుసన్నల్లోనే ఈ పబ్‌ల బాగోతం నడుస్తున్నదని ఆరోపణలూ వినపడుతున్నాయి. ఏదైనా సంఘటన వెలుగులోకి వచ్చినప్పుడు హడావుడి చేయడం తప్ప, ప్రభుత్వాలు ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇప్పుడు కూడా రాజకీయ నేతలు, అధికారులు వారి పిల్లల పాత్రలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కేసూ గత కేసుల లాగానే నీరుకారిపోయే ప్రమాదం లేకపోలేదు.
'ఇంతలంతలవుతున్న డ్రగ్స్ వినియోగం కారణంగా దేశంలో అంధకారం, విధ్వంసం, వినాశం దాపురిస్తున్నాయి' అని ఆవేదన చెందిన ప్రధాని మోడీ గారు... వాటి నివారణకు కానీ, నియంత్రణకు కానీ ఎలాంటి చర్యలు చేపట్టింది లేదు. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్ర నిఘాసంస్థల మధ్య సమన్వయం అవసరాన్ని హౌంమంత్రి అమిత్ షా గతంలో ప్రస్తావించారు. కానీ, ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో)లో సిబ్బంది కొరత మూలాన ఉత్పన్నమవుతున్న సమస్యల గురించి అమాత్యులు ఎక్కడా ఊసెత్తనేలేదు! మౌలికాంశాల్ని గాలికొదిలేస్తూ పెద్దలు మాటలకే పరిమితం అయితే 'చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టు' తరువాత ఎలాంటి చర్యలు తీసుకున్నా ఉపయోగం ఉండదు. ఇలాంటి ఏలినవారి నిర్లక్ష్యాలు ఈ డ్రగ్స్ మాఫియాకు అందివచ్చిన అవకాశాలుగా మారుతున్నాయి. ప్రజల ఆలోచనా శక్తినీ, వివేకాన్నీ నశింపజేస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే రేపటి మన దేశ పౌరుల జీవితాలు బుగ్గిపాలవుతాయి. ఈ సంక్షోభ తీవ్రతకు తగ్గట్టు మాదకశక్తుల్ని వేటాడే కసరత్తు లేదు. అడపాదడపా దిగువస్థాయి పాత్రధారులు కొంతమంది వలలో చిక్కుతున్నా, సూత్రధారులు ఒడుపుగా తప్పించుకుంటున్నారు. దేశ భవితవ్యమే ఛిన్నాభిన్నమవుతున్నా నిఘా, పర్యవేక్షక విభాగాలు ఏకోన్ముఖ కార్యాచరణకు సన్నద్ధం కాకపోవడం ఇలాంటి శక్తులకు కోరులు మొలిపిస్తోంది. పరస్పర సమన్వయంతో కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా చిత్తశుద్దితో కృషి చేస్తేనే ఈ మహౌత్పాతాన్ని నియంత్రించగలిగేది!