Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం చివరికి రాజ్యాంగ సంక్షోభంగా మారింది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ కానీ, ఓటింగ్ కానీ ఏమీ లేకుండానే డిప్యూటీ స్పీకర్ ఖాసిం విదేశీ కుట్రలో భాగమంటూ దీనిని కొట్టివేశారు. ఆ వెంటనే పార్లమెంటును రద్దు చేసి, తిరిగి తాజా ఎన్నికలకు అధ్యక్షుడు ఆదేశించడం అందరినీ ఆశ్చర్యపరచింది. పాలక పాక్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ప్రధాన మిత్రపక్షం ఎంక్యుఎం కూటమి నుంచి బయటకు వెళ్లిపోవడం, సొంత పార్టీలోనే డజను మందికిపైగా ఎంపీలు తిరుగుబాటు చేయడంతో ఇమ్రాన్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అవిశ్వాస తీర్మానాన్ని ఓటింగ్‌కు పెడితే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఇంటికి వెళ్లడం ఖాయమని తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇమ్రాన్ ముందు మూడే మూడు మార్గాలున్నాయి. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందే రాజీనామా చేయడం, లేదా అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం, లేదా జాతీయ అసెంబ్లీని రద్దు చేసి తిరిగి తాజాగా ఎన్నికలకు వెళ్లడం. వీటిలో చివరిది అత్యంత సురక్షితమైన మార్గంగా ఇమ్రాన్ ఎంచుకున్నారు. చివరి బంతి దాకా ఆడతానని చెప్పి ఇంతలోనే ప్లేటు ఫిరాయించారు.
న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకుంటే పార్లమెంటుకు మూడు మాసాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ప్రతిపక్షాలు విదేశీ శక్తులతో చేతులు కలిపి తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నాయని ప్రచారం చేసుకోవచ్చని రాజకీయ అవతారమెత్తిన ఈ మాజీ క్రికెటర్ భావించారు. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఏ ప్రభుత్వమూ ఐదేండ్ల పదవీ కాలపరిమితి పూర్తి చేసిన దాఖలాలు లేవు. కారణం అక్కడ సైన్యమే సుప్రీం. తాజా ఉదంతంలోనూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విదేశాంగ విధానం వంటి అంశాల్లో స్వతంత్ర వైఖరి తీసుకోవడం ఒక ముఖ్య కారణమని తెలుస్తుంది. మధ్య ఆసియా, దక్షిణ ఆసియా ప్రాంతంలో అమెరికా పెత్తనాన్ని సవాల్ చేస్తున్న చైనా, రష్యాలకు పాకిస్థాన్ సన్నిహితంగా మెలగడం అమెరికాకు అసలు నచ్చదు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు ఉపక్రమించినప్పుడు ఇమ్రాన్ మాస్కోలో పుతిన్‌ను కలవడం దానికి కోపం తెప్చించింది. ఆ తరువాతే అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపులు వంటివి చోటుచేసుకున్నాయి. దీనిని బట్టి తాజా పరిణామాల వెనుక అమెరికా పాత్రను కొట్టిపారేయలేం. అయితే, ఆ సాకుతో ఇమ్రాన్ తన వైఫల్యాలను కప్పిపెట్టుకోవచ్చని అనుకుంటే పొరపాటు. తన మీద కుట్ర వెనుక విదేశీ హస్తం ఉందన్న వాదనే వాస్తవమైతే అందుకు సహకరించిన తన సొంత పార్టీకి చెందిన ఎంపీలపై ముందు చర్య తీసుకోవాలి. ఆ పని ఎందుకు చేయలేదు?
అందువల్ల సైన్యంతో విభేదాలను కప్పిపుచ్చి ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడంలో అర్థంలేదు. పౌరసమాజం, ప్రభుత్వాలు స్వతంత్రంగా వ్యవహరిం చేందుకు ప్రయత్నించినప్పుడల్లా సైన్యం ఆ ప్రభుత్వాన్ని కూల్చివేస్తుంది. పాకిస్థాన్‌లో రెండు పార్టీల వ్యవస్థను బ్రేక్ చేయడానికి 2018లో ఇమ్రాన్‌ఖాన్‌ను సైన్యమే ప్రోత్సహించింది. ఆ ఎన్నికల్లో ఇమ్రాన్‌ను గెలిపించడంలోనూ సైన్యం పోషించిన పాత్ర అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత సైన్యం ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించారు. కొంత కాలం తరువాత ఇమ్రాన్ తన స్వతంత్రతను చాటుకోడానికి ప్రయత్నించారు. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ చీఫ్ నియామకం విషయంలో ఇమ్రాన్‌కు, సైన్యానికి మధ్య విభేదాలు తలెత్తడానికి ఇదే కారణం. ఇమ్రాన్ ఖాన్ మాస్కో పర్యటన తరువాత ఈ విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. పాక్ సైన్యం దేనినైనా సహిస్తుంది. కానీ, తన మాట జవదాటితే అసలు క్షమించదు. పాకిస్థాన్ చరిత్రలో సగం కాలం సైనిక పాలన కిందే మగ్గింది. ఇప్పటికీ ప్రజాస్వామ్యం అక్కడ పూర్తిగా బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు.
ప్రజాదరణ కలిగిన జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని సైన్యం తిరుగుబాటు ద్వారా కూల్చివేసి, ఉరితీసి చంపేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు సైన్యాన్ని ఎదిరించి నిలిచినవారు లేరు. పాక్ సైన్యానికి అమెరికా వత్తాసు ఎప్పుడూ ఉంటుంది. అవినీతి పరులైన సైనిక అధికారులకు అమెరికా డాలర్ మూటలు అందిస్తూ తన చెప్పుచేతల్లో ఉంచుకుంటుంది. కాబట్టి అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా పాక్ సైన్యం ఎన్నడూ వ్యవహరిం చదు. ఇమ్రాన్‌ఖాన్ అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకోవడం సైన్యానికి ఏమాత్రం రుచించలేదు. దీనికి ఇమ్రాన్ స్వయంకృతాపరాధాలు కూడా తోడయ్యాయి. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడడానికి ప్రభుత్వ అసమర్థతే కారణమన్న భావన సర్వత్రా నెలకొంది. ప్రతిపక్షాలను విశ్వాసంలో తీసుకోకుండా నిరంకుశంగా వ్యవహరించడం, ఇస్లామిక్ మత ఛాందసవాదాన్ని బుజ్జగించే వైఖరి తీసుకోవడం ఇవన్నీ ఇమ్రాన్ ప్రభుత్వం ప్రజలకు దూరం కావడానికి దారి తీశాయి. పొరుగుదేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల భారత్ జాగ్రత్తగా వ్యవహరించాలి.