Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిజాబ్ చిచ్చు చల్లారనేలేదు, హలాల్ మంటలు చెలరేగుతున్నాయి. పరిస్థితులు చూస్తుంటే దక్షిణాదిన పట్టుకోసం కర్నాటకను ఒక ప్రయోగశాలగా మారుస్తున్నారా అనిపించకమానదు. సంఫ్‌ుపరివార్ శక్తులు ఒకదాని తరువాత మరొకటిగా వివిధ సున్నిత అంశాలపై విద్వేషాలను తెరమీదికి తెస్తున్నాయి. గత ఫిబ్రవరిలో రగిల్చిన హిజాబ్ వివాదాన్ని మరువకముందే, తాజాగా హలాల్, అజాన్, పండ్ల అమ్మకం వంటి అంశాలు వరస కట్టాయి. మతోన్మాదం ఆధారంగా లబ్ధి పొందాలని చూస్తున్న కాషాయ రాజకీయ శక్తులు తమ ఈ ఉన్మత్త, ఉద్వేగపూరిత ఎజెండాను ప్రజలపై రుద్దుతున్నాయి. ఇప్పటివరకూ కర్నాటకలో హిజాబ్ వివాదం వెనుక ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో లబ్ధిపొందే ఆలోచన ఉన్నదన్న విమర్శలు విన్నాము. ఇప్పుడు హలాల్, అజాన్ అంశాలు వచ్చే ఏడాది జరగవలసిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే వివాదంగా మారాయన్నది కనిపిస్తూనే ఉన్నది.
విద్య, వైద్యం, కనీస వసతులు, ధరలు, ఉపాధి వంటి అంశాలు ప్రజల రోజువారీ జీవనాన్ని కులమతాలకు అతీతంగా ప్రభావితం చేస్తాయి. వాటికి సంబంధించి తలెత్తే సమస్యలు ప్రజలను ఏకం చేస్తాయి. ప్రభుత్వాలను నిలేసి, నిలదీసేలా ప్రేరేపిస్తాయి. ఈ అంశాలన్నిటిలోనూ బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆ వైఫల్యాలపై ప్రజల నుంచి ప్రతిఘటన ఏర్పడకుండా, వారి దృష్టిని మళ్లించటానికి బీజేపీ మతతత్వ ఎజెండాను ముందుకు తెస్తోంది. ప్రజలు నిత్య జీవితంలో అంతగా పట్టించుకోని మతపరమైన ఉద్వేగాలను రెచ్చగొడుతోంది. వాటిని చర్చనీయాంశం చేసి, ఆ చుట్టూ జనాన్ని చేరేలా ప్రేరేపిస్తుంది. ఇలాంటి చౌకబారు ఉన్మత్త పాచికతోనే మొన్నటి ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో లబ్ధి పొందింది. అదే వ్యూహాన్ని ఇప్పుడు వచ్చే ఏడాది మే నెలలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో అమలు చేయాలని చూస్తోంది.
ఏ కులమతాలకు చెందినవారికైనా, ఏ ప్రాంతం వారికైనా ఆహార, ఆహార్య అలవాట్లు పూర్తిగా వారి వారి ఇష్టం. ఏం తినాలి, ఎక్కడ కొనాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి వంటి విషయాల్లో ఆంక్షలు విధించటం పచ్చి నియంతృత్వమే! కానీ, మతోన్మాద సంఫ్‌ుపరివారం బలవంతంగా ఈ విషయాల్లో జోక్యం చేసుకుంటోంది. ప్రజల వ్యక్తిగత జీవితాల పట్ల తనకు తానే ఆపాదించుకున్న అధికారంతో కర్ర పెత్తనం చేస్తోంది. మాంసం కోసం దుకాణానికి వెళ్లినప్పుడు కొనుగోలుదారులు అది ఏ మాంసం? తాజాదా, కాదా? అన్నది చూస్తారు తప్ప ఆ జీవి ఏ విధంగా వధించబడిందో చూడరు. కానీ, బీజేపీ, దాని పరివారమూ దాన్ని మత కోణంలో చూపించి, హలాల్ చేసిన మాంసాన్ని హిందువులు కొనరాదంటూ ముస్లిముల పట్ల ద్వేషభావాన్ని పెంచుతున్నాయి. అనేక సామాజిక, సాంస్కృతిక ఉద్యమాల కొనసాగింపుగా ప్రజల్లో నెలకొని ఉన్న సామరస్య, సౌభ్రాతృత్వ భావనలను ధ్వంసంచేసే ప్రయత్నం చేస్తోంది. హిందూ దేవాలయాల బయట ముస్లిమ్ వ్యాపారులను అనుమతించకూడదంటూ మరో వివాదానికీ తెరతీసారు. తీరప్రాంత కర్నాటకలో అయితే, ముస్లిమ్ వ్యాపారులపై బహిష్కరణ కొనసాగుతున్నది. ముస్లిం వ్యాపారుల వద్ద పండ్లు కూడా కొనరాదంటూ మైనారిటీల జీవనోపాధుల మీద ప్రభావం వేసే నిర్ణయాలు జరుగుతున్నాయి.
ఇక మసీదులో ప్రార్థనల వేళ వినిపించే అజాన్ శబ్దకాలుష్యం సృష్టిస్తుందని, దానిని ఆపకపోతే పోటీగా భజనలు వినిపిస్తామని హిందూత్వ మూకలు కొన్ని హెచ్చరికలు జారీచేస్తున్నాయి. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. మతం పేరిట ప్రజలను మైనారిటీ, మెజారిటీ గ్రూపులుగా విభజించి, రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్న కాషాయ పరివారపు పన్నాగం దేశ సమైక్యతకు మహా ప్రమాదం. మన రాజ్యాంగస్ఫూర్తికే పూర్తి విరుద్ధం. మైకులు హౌరెత్తితే, ప్రశాంతతకు భంగం కలిగిస్తే - చట్టపరంగా ఏఏ నియంత్రణ చర్యలు తీసుకోవాలో ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిని అమలు చేసే ప్రభుత్వ శాఖలూ ఉన్నాయి. ఆ పనిని ఆ పరిధికి వదలాలి. కానీ, మతకోణంతో సమస్యను రగిలించటం, ప్రచారం చేయడం ఎంతమాత్రం ఉపేక్షణీయం కాదు. ఇప్పుడు నడుస్తున్నది రంజాను మాసం. ఇప్పుడే కర్నాటక బీజేపీ ప్రభుత్వం లౌడ్ స్పీకర్లపై ఉత్తర్వులివ్వడం, సమాంతరంగా ఉన్మాద శక్తులు పేట్రేగిపోవడం.. ప్రజల్లో మత విద్వేషాలను రగిల్చే దురుద్దేశంతోనే తప్ప మరొకటి కాదు.
మనుషుల మంచి చర్యలనే మహౌన్నతంగా చూడాలని, శ్రమనే దైవంగా భావించాలని, కులమతాలకు అతీతంగా మనుషులు మసలాలని ప్రబోధించిన సంఘ సంస్కర్త బసవన్న నడయాడిన నేల కర్నాటక. అలాంటి చోట మనుషులను మతాల పేరిట వేరు చేసే విష జాఢ్యం దాపురించటం విచారకరం. కాంగ్రెస్, జనతాదళ్ వంటి పార్టీలు కాషాయ మూకల విద్వేష చేష్టల పట్ల ఉదాసీనంగా ఉండడం మానుకోవాలి. దేశ సమైక్య సాంస్కృతిక భిన్నత్వపు వారసత్వాన్ని నిలుపుకోవటానికి దృఢమైన వైఖరిని తీసుకోవాలి. లౌకికత్వమే తమ విధానమని స్పష్టంగా, గట్టిగా చెప్పాలి. ప్రగతిశీల, లౌకికవాద శక్తులన్నీ ఏక కంఠాన నినదించి, ఏకతాటిపై నిలబడి మతోన్మాద శక్తులను ఎదిరించాలి.