Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ!'' అంటూ హిరణ్య కశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని గురువుల దగ్గరికి పంపిస్తూ ఈ మాట చెబుతాడు. చదవకపోతే అజ్ఞానంలో ఉంటాము. చదివితే ఏమవుతుందంటే! మంచి చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకోగలిగే శక్తి వస్తుంది. అందుకోసం చదువుకోవాలి. మంచి విద్యనందించే గురువుల వద్ద నిన్ను చదివిస్తాను చదువుకో నాయనా! అని సెలవిచ్చాడు. ఇది పోతన ఆంధ్ర మహాభారతంలో చెప్పిన పద్యం. ఇందులో విషయమేమంటే, ఆనాడే విద్య ఏమిస్తుందో చాలా స్పష్టంగా తెలిపాడు ఆయన. కానీ నేడు మంచీ చెడులు తెలుసుకునేందుకు ఎవరూ విద్యను గరపడం లేదు. విద్యకూ మంచీ చెడులకు సంబంధమే తెగిపోయింది. ఇది వేరే విషయం. ఏనాటి చదువువైనా, ఆనాటి రాజ్యానికి, వ్యవస్థకు అనుగుణంగానే, బలపరిచేదిగానే ఉంటుందనేది వాస్తవం. ప్రహ్లాదుడు విద్య నేర్చుకుని తండ్రికే ఎదురుతిరిగాడు. సరే అందంతా భాగవత కధాంశం. అయితే ఇప్పుడు భగవద్గీతను పాఠ్యాంశాల్లో చేర్చి 'పిల్లల్లారా! ఇది చదవండి!' అని సెలవిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇందులోని 'మత'లబు ఏమిటో బోధపడటం పెద్ద విషయమేమీకాదు.
పోతనగారి తర్వాత ఐదు శతాబ్దాలు దాటి వచ్చాం మనం. శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధనలతో ప్రపంచం ఎంతో ప్రగతి సాధించింది. ఇప్పుడు విద్యార్థులు చదవాల్సినది ఏమిటి? నేర్చుకుని ముందుకు పోవాల్సినది ఏమిటి? అనే విషయాల మీద విద్యావేత్తలు తమ అభిప్రాయాలను వివరించే ఉన్నారు. కానీ విద్యలోకి మతపరమైన భావాలను తీసుకువచ్చి, తమ ఆలోచనలకు అనుగుణంగా భావితరాలను తీర్చాలన్న ఆలోచన చేయటం గమనించవచ్చు. అయితే మంచీ చెడుల విచక్షణకూ, మానవ ప్రగతికి చేయాల్సిన శాస్త్రీయ ఆలోచనకూ ఈ రకమైన చదువు ఉపయోగపడకపోగా, శతాబ్దాల వెనక్కి నడిచే స్థితి వస్తుంది.
భగవద్గీతను అధ్యయనం చేయటం తప్పేమీకాదు. దానిలోని మంచీ చెడులనూ, ఆనాటి సామాజిక పరిస్థితులనూ, ధర్మా ధర్మాలను, రాచరిక ప్రయోజనాలను అర్థం చేసుకోవటానికి పనికివస్తుంది. ఈ పని పరిశోధకులు, సాహిత్య అధ్యయన కారులు చేయవచ్చు. ఆ పని ఇంతక్రితమే చేసినవారూ ఉన్నారు. కానీ పాఠశాల విద్యార్థులు దీంతో ఏమినేర్చుకుంటారు! ఏ విలువలు పెంపొందించుకుంటారు!
కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఉన్న అర్జునుడు, తన బంధుమిత్రులను సోదరులను హతమార్చడం నేను చేయలేనని, యుద్ధ వింధ్వంసాన్ని సృష్టించలేనని ఆయుధాలు పడేసి వెనుదిరుగుతున్నప్పుడు, అతని రథ సారథియైన కృష్ణుడు, రాజ్యం కోసం, అధికారం కోసం యుద్ధం చేయాల్సిందేనని బోధించే సందర్భమే భగవద్గీత. ఇందులో కృష్ణుడే భగవత్ స్వరూపుడని చెప్పుకుని ఉపదేశం చేస్తాడు. అనేకమైన వైరుధ్య భావాలతో నిండివున్నది ఈ రచన. అంతేకాక భారతీయ కులవ్యవస్థను స్థిరీకరించే బోధకూడా ఇందులో మనం చూస్తాం.. 'చాతుర్వర్ణం మయాస్పష్టం / గుణ కర్మ విభాగశః / తస్య కర్తార మహిమాం / విద్ధ్వకర్తార మవ్యయమ్' అనే శ్లోకం ద్వారా మనుషులలోని గుణాలతో ఆధారంగా నేను నాలుగు వర్ణాలను సృష్టించానని చెబుతాడు. వర్ణం, కుల వ్యవస్థగా స్థిరపడి ఇప్పటికే మన సమాజంలో పీడనను, దోపిడీని కొనసాగిస్తూనే ఉన్నది. అందుకనే అదే భగవద్గీతలో 'కర్మణ్యే వాధికారస్తే / మా ఫలేషు కదాచన / మా కర్మ ఫల హేతుర్భూః / మాతే సంగోస్త్వ కర్మణి' అంటారు. పని చేయడమే నీ చేతిలో ఉన్నది. ఫలితం నీ చేతిలో లేదు అని చెబుతాడు. అంటే శ్రమ ఫలాన్ని పొందే హక్కును భగవంతునికి వదిలేయమని ప్రబోధిస్తుంది. యుద్ధ పోటీలలో పాల్గొనడానికి కూడా కుల యోగ్యత ఉండాలని చెప్పే మహా భారత కథాంశం నేటి విద్యార్థుల మెదళ్ళను ఏవిధంగా తయారు చేస్తుంది!
మతం, విశ్వాసాలు, నమ్మకాల మీద ఆధారపడ్డ భావాలను - ప్రజాస్వామిక లౌకిక ఆధునిక భావాలతో ఏర్పచుకున్న రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తున్న దేశంలో ఎలా బోధిస్తారు? పోనీ అందులో ఉన్న విషయాలు వర్తమాన సమాజాన్ని ఉన్నతీకరించి ముందుకు నడిపే ఆలోచననిస్తాయా? ఇవేమీ చేయవు. మనకోసం మనం రాసుకున్న రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇవ్వాల్సిందే. అనేక మతాలు, కులాలు, తెగలు, సంస్కృతులు గల దేశంలో ఒక మతానికి చెందిన భావాన్ని ఎలా బోధిస్తారు.! రాజులు, రాజ్యాలు, రాజులే దేవుళ్ళుగా కొనసాగిన నాటి ఆలోచనలను నేటి తరానికి అందించే ప్రయత్నం చేయటం తిరోగమన చర్యే. మేధావులు, విద్యావేత్తలు దీనిని వ్యతిరేకించాలి. మత ప్రాతిపధికన విద్యాబోధన, మనువాద విద్యాబోధన ఏరకంగానూ ఆచరణీయం కాదు.