Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం తీవ్రం కావడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రాల్లో అప్పుడే కరెంటు కోతలు మొదలైపోయాయి. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ విద్యుత్‌ను ఏడు గంటలకే పరిమితం చేయడం, పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడం సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది. ఏపీతోపాటు జార్ఖండ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లోనూ విద్యుత్ కొరత ఇప్పుడు పెను సమస్యగా పరిణమించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా పరిశ్రమలకు వారానికి ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించారు. దాదాపు దేశమంతటా విద్యుత్తు కోతలు అమలు చేస్తున్నారు. కోవిడ్ విపత్తు కారణంగా మూడేండ్లుగా చతికిలపడిపోయిన పారిశ్రామిక రంగం తేరుకోవాల్సిన సమయంలో పవర్ హాలిడే ప్రకటించడం పెనం నుంచి పొయ్యిలోకి పడేయటమే. వేసవి, పరీక్షల సీజన్ దరిమిలా కరెంటు కోతల వల్ల ప్రజల జీవనంపైనా, ఉపాధులపైనా ఎనలేని ప్రభావం పడటం ఖాయం.
నిజానికి దేశవ్యాప్తంగా 3.95లక్షల మెగావాట్లకు పైగా విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా.. గరిష్ట డిమాండ్ మాత్రం 2లక్షల మెగావాట్లకు కాస్త అటూ ఇటుగా ఉంటున్నది. కానీ ఉత్పత్తి మాత్రం ఆ స్థాయిలోనూ చేయలేకపోతున్నాం. మూడు దశాబ్దాల కిందట అమల్లోకి వచ్చిన నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలతోనే ఈ సంక్షోభ బీజాలు పడ్డాయి. ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో నాడు ప్రారంభమైన సంస్కరణల అమలుతో కేరళ మినహా అన్ని రాష్ట్రాల విద్యుత్ బోర్డులు ఉత్పత్తి (జెన్కో), ప్రసారం (ట్రాన్స్‌కో) పంపిణీ (డిస్కాం) మూడు ముక్కలయ్యాయి. విద్యుదుత్పత్తిలో ప్రయివేటురంగం పాగా వేసింది. గడచిన మార్చి 31 నాటికి దేశంలో ఉత్పత్తయిన విద్యుత్‌లో రమారమి 47శాతం ప్రయివేటు రంగానిదే కావడం గమనార్హం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రయివేటీకరణ జోరు మరింత పెరిగింది. ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని గంపగుత్తగా ప్రయివేటుకు కట్టబెట్టేలా విద్యుత్ సంస్కరణలు తెచ్చారు. బొగ్గు గనుల్లో పెట్టుబడుల ఉపసంహరణ, కృష్ణపట్నం పవర్ ప్లాంటుతో సహా ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెన్కోలను క్రోనీ మిత్రులకు కట్టబెట్టడం వంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వినాశకర చర్యలే విద్యుత్ రంగాన్ని సంక్షోభంలో నెట్టేస్తున్నాయి. ప్రయివేటు రంగంలో ఉన్న 1.02లక్షల మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని మార్కెట్లో తీసుకురావడం కోసమే మోడీ సర్కార్ ఇంతటి దుర్మార్గానికి ఒడిగడుతోంది. అందుకే థర్మల్ విద్యుత్కేంద్రాలను బలవంతంగా ఉత్పత్తిని తగ్గించుకొనేలా ఒత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. కావాల్సినంత విద్యుదుత్పత్తికి అవకాశం ఉన్నా.. కేంద్రం నిబంధనలు విద్యుదుత్పత్తి కేంద్రాల చేతులను కట్టిపడేస్తున్నాయి.
ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో, కేంద్రం బెదిరింపులతో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం వంటి చర్యలకు తెరలేపింది కేంద్రం. దేశమంతటా రైతుల ఆందోళన సాగుతుంటే మరోవైపున చట్ట సవరణ అంశాలను మోడీ సర్కారు దొడ్డిదారిన తీసుకొస్తోంది. అన్నిటికన్నా మించి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా అప్పు చేసుకోవడానికి ఎఫ్ఆర్బిఎం నిబంధనలు సడలిస్తామని, అందుకు విద్యుత్ సంస్కరణలు చేపట్టాలని షరతులు విధిస్తోంది. వాటికి లొంగిన రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాదే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపునకు నిర్ణయించిన విషయం విదితమే! ఏ గడువులోగా స్మార్ట్ మీటర్లు పెట్టాలి, నగదు బదిలీ చేయాలి, వ్యవసాయంతో సహా రాయితీలను తొలగించాలి వంటి వత్తిళ్ళతోపాటు... విద్యుత్ పోలీసులను కూడా నియమించాలని కేంద్రం నిర్దేశించిందంటే దాని బరితెగింపును అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవసాయ మీటర్ల కోసం వేలాది కోట్ల రూపాయలు తగలేయడంతో విద్యుత్ ఉత్పాదక సంస్థలకు బకాయిలు కూడా చెల్లించలేని దుస్థితి రాష్ట్రాల్లో ఎదురవుతోంది. ఈ వాస్తవాలను విస్మరించి విద్యుత్ సంక్షోభానికి పరిష్కారం సాధించలేం. సంక్షోభ నివారణకు పరిష్కారం దాని మూలాలైన సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాలు విడనాడటమే. కేంద్రం నుంచి వస్తున్న బెదిరింపులపై విశాల ప్రజానీకం మద్దతుతో ఐక్యంగా పోరాడటమే. ప్రభుత్వ రంగ విద్యుత్ వ్యవస్థలను పరిరక్షించుకుంటేనే దేశంలో విద్యుత్ కొరత తీరేది. సరళీకరణ, ప్రయివేటీకరణ, విధానాలకు వ్యతిరేకంగా విశాల ప్రజా ప్రతిఘటనను నిర్మించవలసిన ఆవశ్యకతను ఈ విద్యుత్ సంక్షోభం ఎత్తిచూపుతోంది.