Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆహారపు అలవాట్లను శాసించడం 'ఆధిపత్య' ఆహంకారానికి పరాకాష్ట. డెబ్బైఏండ్ల పాటు ఇన్ని కోట్ల భారతీయులు ఎవరి తిండి వారుతిన్నారు. ఎవరి ఇంట వారున్నారు. ఇప్పుడు 'తిండి'పై ఆంక్షలొస్తున్నాయి. లేదా వచ్చేశాయి. ఎవరేమి తినాలో ఫర్మానాలు జారీ చేస్తున్నారు. భీఫ్తో మొదలై నేడు మాంపాహారం మొత్తంపై 'సాంస్కృతిక పోలీసు'ల దాడి సాగుతోంది. అసలు ఫలానాదే తినాలని శాసించడానికి నువ్వెవరు? అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నం అవుతోంది. తాజాగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) హాస్టల్ మెస్‌లో మాంసాహారాన్ని వండకుండా ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకున్నారు. సాధారణంగా ప్రతి ఆదివారం, అన్ని హాస్టళ్లలో మాంసాహారం, శాఖాహారం రెండూ వండుతారు. కావేరీ హాస్టల్ దగ్గర ఏబీవీపీ విద్యార్థులు శ్రీరామనవమి కార్యక్రమం నిర్వహిస్తుండగా, చికెన్ డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యాపారిని అడ్డుకున్నారు. పూజలు నిర్వహిస్తున్నారని, మాంసాహారం వండడం కుదరదని చెబుతూ వారు అతడిపై, మెస్ సెక్రటరీపై దాడికి తెగబడి 'నీచు రాజకీయాలకు' తెరతీశారు. దానిని వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు అడ్డుకున్నారు. 'మీ పూజలకు మేం అడ్డురాం, ఇష్టమైన వాళ్లు నాన్ వెజ్ తింటారని' జేఎన్‌యూ విద్యార్థి నేతలు చెప్పారు. అయినా వినకుండా ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థులపై ఆ గుండాలు దాడిచేశారు. రక్తం కారేలా కర్రలు, ట్యూబ్ లైట్లతో చితకబాదారు. దీనికి ప్రత్యక్ష సాక్షి, కేంద్రం చేతిలో ఉండే ఢిల్లీ పోలీసు శాఖ కేవలం ప్రేక్షకపాత్ర పోషించిందే తప్ప దాడులను అడ్డుకోలేదు.
మన దేశంలో ఆహారమే కాదు ఆహార్యం కూడా ఆయా ప్రాంతాలను బట్టి, అక్కడి భౌగోళిక పరిస్థితులను బట్టి ఉంటాయి. అంతే కాదు. మన భారతదేశం విభిన్న మతాలకు, విభిన్న కులాలకు, విభిన్న జాతులకు నిలయం. వారి వారి ఆచార వ్యవహారాలను బట్టి వారి కట్టుబొట్టు, తిండి ఉంటాయి. అదిగో ఇప్పుడు వాటి మీద దాడి మొదలైంది. ఎదో ఒక అంశాన్ని పట్టుకొని దాని ద్వారా మతాల మధ్యో, కులాల మధ్యో విభజన తెచ్చేందుకు బీజేపీ, వారి పరివారం సర్వవిధాల ప్రయత్నిస్తున్నది. అందుకు జేఎన్‌యూను ఒక ల్యాబ్ స్కూల్‌గా వాడుకుంటున్నది. ఆ పనిలో భాగంగానే ఈ ఏనిమిదేండ్ల కాలంలో జేఎన్‌యూను అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మార్చుతోంది. నిత్యం మేధోమథనం జరిగే విశ్వవిద్యాలయం.. నేడు విష సంస్కృతిపై పోరాటం చేస్తున్నది. దేశంలో అనేకచోట్ల ఇటీవలికాలంలో పండుగలు, ఉత్సవాలు, కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాంసాన్ని నిషేధించటం జరుగుతోంది. ఒక విధంగా ఇది ఆధిపత్య సంస్కతియే! మాంసాహారం తిన్నందుకు ప్రజలను హత్యచేసిన చరిత్ర నిజానికి ప్రపంచంలో ఎక్కడాలేదు. ప్రముఖ ప్రవచనకర్త ప్రకారం.. రాముడు, కష్ణుడు అని పూజించే దైవాలు కూడా మాంసం తిన్నవారే!''
మాంసాహారులే హింసాత్మక చర్యలకు పూనుకుంటారనీ, మనిషిలో పశుత్వాన్నీ, దానవత్వాన్నీ, రెచ్చగొట్టే శక్తి మాంసాహారానికి ఉందనీ అందువల్ల నేరప్రవత్తికీ, హింసాప్రవత్తికీ వారే అధికంగా పాల్పడతారనీ ఈ 'పరివారం' వాదన. కానీ అందుకు రుజువులు ఏమున్నాయి? పశుమాంసం తింటున్నారన్న, విద్వేషంతో ఎంతో మందిని హత్య చేసింది ఆ గోరక్షకులే కదా! దీనిని బట్టి హింసాప్రవృత్తి ఎవరిదో అర్థమవుతోంది. 'భిన్నత్వంలో ఏకత్వం' కల్గిన లౌకిక దేశంలో, బీజేపీ తన మతోన్మాద ఎజెండాను అమలుచేసేందకు తమ ప్రచారకర్తలుగా దేవుళ్లను వాడుకుంటుంది. తద్వారా రాజకీయ లబ్ధిపొంది.. అధికారం చెలాయించడమే వారి ఎజెండా. కులం, మతం వంటివేకాక 'ఆహారం' కూడా రాజకీయం అయిపోయి, సామాజిక వాతావరణాన్ని స్వార్థ ప్రయోజ నాలతో కలుషితంగానూ, విషతుల్యంగానూ మార్చడం క్షమించరాని నేరం.
''తిండి కలిగితె కండకలదోరు!
కండకలవాడేను మనిషోరు'' అని గురజాడ అన్నాడంటే జాతి 'ఈసురోమంటూ' ఉండకూడదనే గానీ, కండకావరంతో మెలిగే విద్వేష ఆధిపత్య అహంకత సంస్కతి గురించి కాదు. పౌరుల ఇష్టాయిష్టాల్లో, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసు కోవడం బీజేపీ ప్రభుత్వాల అహంకారానికి, మతాధిపత్యానికి నిదర్శనం. ఇష్టమైన తిండి తినే స్వేచ్ఛ కూడా బీజేపీ పాలనలో ఉండదన్నమాట! ఈ పోకడ ఇలాగే పోతుంటే క్రమంగా దేశమంతా ఇలాంటి ఘర్షణలు పెరిగే ప్రమాదముంది. ముందుముందు ఇది ఎంత ప్రమాదానికి దారి తీస్తుందో తాజా జేఎన్‌యూ ఘటన స్పష్టం చేస్తోంది. ఈ విపరిణామాలను ప్రజలందరూ ఐక్యంగా ఎదిరించాలి.