Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యావత్ జాతి గురువారం ఆయనకు ప్రణమిల్లింది. స్వాతంత్య్రానంతరం భారత సమాఖ్య వ్యవస్థ ఏయే పునాదుల మీద ఎలా నడుచుకోవాలో చెబుతూ.. దేశానికి సరైన దిశా నిర్దేశం చేసిన ఆ రాజ్యాంగాన్ని, దానిలోని మూల సూత్రాలను మనందరమూ మరోసారి మననం చేసుకున్నాం. వాటిని శిరసావహిస్తామనీ, కాపాడుకుంటామనీ ప్రతినబూనాం. అయితే 'దొంగే దొంగ అని అరవటం.. దెయ్యాలు వేదాలను వల్లించట'మనే రీతిలో అంబేద్కర్ జయంతి సభలను అధికార బీజేపీ హైజాక్ చేసిన తీరు ఇటు సాధారణ ప్రజలను.. అటు మేధావులను సైతం విస్మయానికి గురి చేసింది. సంఫ్‌ు పరివార్ కనుసన్నల్లో పాలన సాగిస్తున్న కాషాయ పార్టీ... గత ఎనిమిదేండ్లుగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న తీరును మనం గమనిస్తూనే ఉన్నాం. ఏ మతోన్మాదానికి, మత వివక్షకు తావులేకుండా పాలన సాగించాలంటూ రాజ్యాంగం చెప్పిందో.. ఆయా అంశాలకు పూర్తి భిన్నంగా తినే ఆహారం దగ్గర్నుంచి, అభ్యసించే విద్య వరకూ, కట్టుకునే దుస్తుల నుంచి.. చేసే పని వరకూ అన్నింటిలోనూ మతాన్ని జొప్పిస్తూ తన పబ్బం గడుపుకుంటున్న బీజేపీ... అంబేద్కర్‌ను కూడా రాముడు, హనుమంతుడి సరసర చేర్చటం ద్వారా ఆయన్ను కూడా తమ దేవతల తరహాలో పూజించటం, తద్వారా జనాన్ని మరింతగా మభ్యపెట్టటం ఒక ప్రమాదకర సంకేతం. హైదరాబాద్‌లో పలు చోట్ల నిర్వహించిన జయంతి వేడుకల్లో ఒకవైపు రాముడు, మరోవైపు గాంధీ, నెహ్రూ, మధ్యలో అంబేద్కర్ ఫొటోలను పెట్టి పూజించటం, టెంకాయలు కొట్టి, అగరుబత్తీలు వెలిగించటం ద్వారా ఏ విగ్రహారాధనకు, వ్యక్తిపూజకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడారో... అదే చట్రంలో ఆయన్ను ఇరికించేందుకు ప్రయత్నించటం అత్యంత దుర్మార్గం.
మరోవైపు ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సమాఖ్య వ్యవస్థ, ఆర్థిక స్వావలంబన అనే అంశాలు భారత దేశ పురోగతికి మూల స్థంభాలంటూ రాజ్యాంగం నొక్కిచెప్పింది. ఈ క్రమంలో భారతదేశమనేది ఒక సమాఖ్య వ్యవస్థ.. సమాఖ్య వ్యవస్థతో కూడిందే కేంద్ర ప్రభుత్వం అని స్పష్టం చేసింది. అంబేద్కర్ చెప్పిన ఈ విషయాలనే కేరళలోని కన్నూరులో ఇటీవల నిర్వహించిన సీపీఐ (ఎం) 23వ మహాసభ ఉద్ఘాటించింది. ఇప్పుడు ఈ నాలుగు మూల సూత్రాలూ ప్రమాదపుటంచున ఉన్నాయంటూ హెచ్చరించింది. ఈ దుస్థితిపై మేధావులు, లౌకిక పార్టీలూ ఆలోచించాలని హితవు పలికింది. ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్... ప్రశ్నించే గళాలకు, కలాలకు సంకెళ్లేస్తూ, మేధావులు, అభ్యుదయవాదులు, సామాజిక వేత్తలను జైలుపాల్జేస్తూ ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేస్తున్నది. 'ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాన్ని ప్రజా స్వామ్య ప్రభుత్వం అంటాం...' అని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ నిర్వచించారు. కానీ ఇప్పుడు ఆ ప్రజలే ఎన్నుకుంటున్న ప్రభుత్వాలను తారుమారు చేస్తూ.. వారి విశ్వాసాలను దారుణంగా దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య పునాదులను పెకిలించేందుకు కాషాయ దళం కుట్రలు పన్నుతున్నది. మొన్నటిదాకా హిజాబ్ గురించి రచ్చ రచ్చ చేసి మత పిచ్చి రేపిన 'పరివారం'... రంజాన్ ప్రారంభ సందర్భంగా ఇప్పుడు హలాల్ వివాదాన్ని తెరమీదికి తెచ్చింది. ఇలాంటి ఘటనల ద్వారా లౌకికత్వాన్ని భంగపరుస్తూ తన మతాధిపత్యాన్ని ప్రజలపై బలంగా రుద్దుతున్నది. జీఎస్టీ,
నదుల అనుసంధానం తదితరాల్లో రాష్ట్రాల అధికారాలను కుదిస్తూ సమాఖ్య వ్యవస్థను భంగపరుస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేకాంశాల్లో తానే పెత్తనాన్ని చెలాయిస్తూ... రాష్ట్రాలకు మనుగడ లేకుండా చేస్తున్నది. దేశం ఆర్థికంగా స్వావలంబన సాధించాలంటే ప్రజలకు అవసరమైన, వారికి ఉపయోగపడే విద్య, వైద్యం, పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన తదితర రంగాలు పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే ఉండాలని రాజ్యాంగం చెబుతున్నది. కానీ మోడీ సర్కార్... వాటన్నింటినీ కార్పొరేట్లకు అప్పజెపుతూ ప్రయివేటీకరణ మంత్రాన్ని జపిస్తున్నది. సరళీకృత ఆర్థిక విధానాలను జెట్ స్పీడుతో అమల్జేస్తూ రక్షణ, విమానయాన, రైల్వే, బీమా, తపాలా, బ్యాంకులను అంబానీ, ఆదానీ లాంటి బడా బాబులకు కారు చౌకగా అమ్మేస్తూ చేతులు దులుపుకుంటున్నది. మాటల్లో 'మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, స్కిల్ ఇండియా...' అంటూ ఊదరగొడుతున్న ప్రధాని మోడీ, చేతల్లో మాత్రం దేశాన్ని స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు తాకట్టు పెడుతూ మన ఆర్థిక స్వావలంబనను అథ: పాతాళానికి తొక్కేస్తున్నారు. ఈ విధంగా అనునిత్యం 'భారత్ మాతాకీ జై...' అంటూ నినాదాలిచ్చే బీజేపీ, ఆరెస్సెస్... అదే భారతావనిని సమూ లంగా నిలబెట్టేందుకు ఉద్దే శించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయి. ఈ క్రమంలో ప్రజాబలంతో వీటిని తిప్పికొట్టటం, తద్వారా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం ఇప్పుడు మనముందున్న తక్షణ కర్తవ్యం.