Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అందాల రాముడు, ఇందీవర శ్యాముడు, ఇనకులాబ్ది సోముడు, ఎందువలన దేముడు?' అంటూ రాముని గొప్ప తనాన్ని గూర్చి ఆరుద్ర ఓ సినిమా పాటలో వివరిస్తాడు. తండ్రికిచ్చినమాట తప్పకుండ పదవులు త్యాగం చేశాడని, తన తమ్ముని బాగుకోసం తాను బాధ పొందాడనీ, అందుకే రాముడు ఆరాధ్యనీయుడైనాడని సాగుతుంది పాట. రాముడు మంచి బాలుడు అని ఉదహారణలు ఇస్తుంటాం. పోలుస్తుంటాం. ఎవరినైనా కొలవటమో, అభిమానించడమో చేస్తున్నామంటే, పూజిస్తున్నామంటే, అతడు ప్రవర్తించిన తీరు, నడిచినదారి చెప్పిన మాట మనకు ఆదర్శమని నమ్మటమే. మరి రామభక్తులమనుకునేవారు, వీరభక్తులమనుకునేవారు రాముని పేరు చెప్పి ఏం చేస్తున్నారూ...? ఎలా ప్రవర్తిస్తున్నారూ...?
తండ్రికిచ్చిన మాటకోసమే, తను పద్నాలుగేండ్లు వనవాస జీవితాన్ని గడిపి, రాజ్యానికి దూరంగా ఉన్నాడు కదా! రామాయణకథా వ్యాఖ్యానంగా ఆలోచించినా మాట తప్పనివాడు, మాటపై నిలబడేవాడు రాముడు. మరి రాముడు మా ఆరాధ్యనీయుడని తెగ ఫోజులు కొట్టే వాళ్లు ఏ ఒక్క మాట మీదయినా నిలబడ్డారా! నూట ముప్పయి కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నారా! ప్రతీ భారతీయుడి బ్యాంకు ఖాతాలో పదిహేను లక్షలు డిపాజిట్ చేస్తానని ఎన్నికల్లో చెప్పారు, చేయలేదు. నోట్ల రద్దుతో విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెస్తానన్నారు, తేలేదు. ఉగ్రవాదాన్ని పారద్రోలుతామన్నారు, పెరుగుతోంది. దేశంలో గూడు లేని వాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తామన్నారు. పూర్తి చేశారా? లేదు. మేక్ ఇన్ ఇండియా అన్నారు. కానీ దేశంలోని ప్రభుత్వ సంస్థలన్నింటినీ గుండుగుత్తగా అమ్మేస్తున్నారు. బేటీబచావ్, భేటీ పడావ్ నినాదమిచ్చారు. లైంగిక దాడులకు పాల్పడిన వారికి అండగా నిలుస్తున్నారు. ఆడపిల్లలు చదువుకోకుండా ఆంక్షలు పెడుతున్నారు. ధరలు తగ్గిస్తామని చెప్పారు. ధరలు చుక్కలెక్కుతుంటే చోద్యం చూస్తున్నారు. నిరుద్యోగులకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలి స్తామన్నారు. ఇప్పుడేమో పకోడీలు అమ్ముకోమంటున్నారు. ఇవన్నీ కొన్ని మాత్రమే. ఇంకా చాలా వున్నాయి మాట తప్పినవి. వీళ్లేనా రాముని అనుచరులు!
పరుల బాగుకోసం తను బాధలు పడ్డవాడు రాముడు సహనం సౌమ్యత, దయాగుణ సంపణ్ణు డని, ధర్మపాలకుడని ఎన్నో విశేషణాలు రామునికి ఉన్నాయి. ద్వేష పూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే చర్యలు, చంపేస్తాం, లైంగికదాడులు చేస్తామనే బెదిరింపులు, ఆహారపు అలవాట్లపై హత్యలకు పూనుకొంటున్న వీళ్లెలా రామభక్తులు! మొన్న రామనవమి రోజు కర్రలతో, మారణాయుధాలతో కాషాయ జెండాలతో ప్రదర్శనలు తీస్తూ మసీదుల, చర్చీల ముందు గేలి చేస్తూ ఎగరటం ఎప్పుడయినా భక్తులు చేయగా చూశామా! మసీదు పైకి ఎక్కి మినార్లపై కాషాయ జెండాను కట్టి ద్వేషాన్ని రెచ్చగొట్టిన సంఘటనను ఎన్నడయినా కన్నామా! గుళ్లముందు బతుకుదెరువుకోసం తర్భూజపండ్లు, అరటి పండ్లు అమ్ముకునే పేద ముస్లింలను చితకబాది, దుకాణాలను విధ్వంసమొనర్చడం లాంటి గూండా చర్యలు, సహనశీలి కరుణామూర్తి రాముని ఆదర్శాలకు నిదర్శనాలా? తన చివరి శ్వాస కూడా 'హేరామ్' అంటూ ప్రాణాలొదిలిన మహాత్ముని చంపిన నాధూరాంకు గుడులు నిర్మిస్తున్న వాళ్లు, దేశభక్తుడని కొలుస్తున్న వాళ్ళు రాముని భక్తులా? రాముని పూజించేందుకు గుడిలోకి వెళ్లింది లేదు, రామాయణాన్ని పారాయణం చేసిందీలేదు, భక్తితో భజనలు చేసిందీ లేదు. పేదలకు ఆహారాన్ని అందించిందీ లేదు. కర్రలు జెండాలు పట్టుకుని వీరంగం వేయటం మాత్రం చూశాము. అల్లర్లురేపి, రెచ్చగొట్టి విభేదాలను పెంచేందుకు రామున్ని వాడుకోవడం, మానవీయతను మంటగలపడం, ఓట్లు సీట్ల కోసం మతం చిచ్చు రగల్చడం నేటి దొంగ భక్తుల పనిగా మారింది. భక్తి అనేది కేవలం వేసుకున్న ముసుగు మాత్రమే. ఈ దేశం కోసం, ఇక్కడి ప్రజలందరి కోసం, సమాజ మార్పు కోసం పని చేసిన నాయకుల వారసత్వమేమీ లేని కారణంగా రామున్ని ముందుపెట్టి, తమ అరాచకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
పూజించటానికి, మొక్కుకోవటానికి మందిరాలుంటాయి. చదువులు నేర్చుకునే విశ్వ విద్యాలయాల్లో మందిరాలు, పూజలు ఏమిటి! భక్తినీ, పూజనూ ప్రదర్శనగా మారుస్తారా? మొన్నటికి మొన్న జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో విద్యార్థులు, మాంసాహారం తింటున్నారనీ, వారిని రక్తాలు కారేట్టు తలలు పగులకొట్టటం హిందూమత ధర్మంగా భావించాలా? దెబ్బలు తిన్న బాధితుల మీదనే పోలీసులు కేసులుపెట్టటం శ్రీరాముని ధర్మపాలనాదర్శమా? రాముడూ, కృష్ణుడూ క్షత్రియులే కదా! మాంసాహారులు కాదా? భక్తులెవరైనా దేవుళ్లుకు తాము తినే ఆహారాన్నే నైవేద్యంగా పెడతారనే విషయం అజ్ఞానులకు బోధించడం మెలా! రామా! నువ్వయినా వీరికి జ్ఞానోదయాన్ని కలిగించు. ఒక్కసారి వీళ్ళు నీ పేరు చెప్పి చేస్తున్న దుర్మార్గాలను వీక్షించు!