Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాజు కొంపలో కూర్చొని ఇతరులపై రాళ్లు రువ్వలేరన్న సంగతి ఇటు మోడీ సర్కార్‌కూ తెలుసు, అటు బైడెన్ ప్రభుత్వానికీ తెలుసు. అయినా ''మీ దేశంలో మత హింస పెరిగి''ందని బ్లింకెన్ అనడం, మరి ''మీ దేశంలో మా సిక్కులను చంపలేదా'' అని జయశంకర్ అనడం, ఇది చూపి మోడీ సర్కార్ అమెరికాకి ''టిట్ ఫర్ టాట్'' చెప్పింది చూశారా అంటూ వంది మాగధులు శ్రోత్తపాఠాలు వల్లించడం చూస్తున్నాం. అగ్రరాజ్య భౌగోళిక రాజకీయ వ్యూహంలో మనదేశం కీలక స్థానంలో ఉందని మోడీ సర్కార్‌కు స్పష్టమైన అవగాహనుంది. అలాగే అమెరికా వ్యూహంలో కీలకం వారి బహుళజాతి కంపెనీల ప్రయోజనమేనన్న స్పష్టత పరివార్ పెద్దలకూ లేకపోలేదు. ఎన్ని తాటాకు చప్పుళ్లు చేసినా మన 130కోట్ల మార్కెట్ కోసం అమెరికా ఏమీ చేయ(లే)దని పరివార్‌కు నమ్మకం.
మోకాళ్లమీద నిలబడ్డ ప్రభుత్వాలను కూడా పాదాక్రాంతం చేసుకున్న చరిత్ర అమెరికాది. తమ సామ్రాజ్య ప్రయోజనాల కోసం, సహజ వనరుల కోసం ప్రపంచం మీదికి తెగబడుతుంది అమెరికా. నాడు కమ్యూనిజం పేర, నేడు టెర్రరిజం పేర ప్రపంచాధిపత్యానికై వెంపర్లాడే సామ్రాజ్యవాదశక్తి అమెరికా. నాపామ్ బాంబులతో వియత్నాంని ఆనాడు విధ్వంసం చేసింది. టెర్రరిస్టులున్నారనే పేరుతో ఆఫ్గనిస్తాన్ని ఇరవయ్యేండ్ల పాటు భస్మీపటలం చేసింది. అభివృద్ధిగాముక నాయకులను అది అలెండీ అయినా, పాట్రిక్ లుముంబా అయినా, చెగువేరా అయినా అంతమొందించిన చరిత్ర అమెరికాది. ఇండోనేషియాలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఐదిత్తో సహా వేలాది మంది కమ్యూనిస్టులను ఊచకోత కోసింది అమెరికా. రసాయన ఆయుధాలున్నాయన్న పేర ఇరాక్‌పై దాడి చేసి ఆ దేశాధ్యకుడిని హత్య చేసి, ఆ దేశాన్ని రక్తపుటేరుల్లో ముంచింది అమెరికా. ప్రపంచంలోనే కాదు, తమ దేశంలో సైతం జార్జి ఫ్లాయిడ్ వంటి నల్ల జాతీయులను దారుణంగా హత్యలు చేస్తున్నది అమెరికాలోని శ్వేతజాతి దురహంకారం. అందుకే బ్లింకెన్ దొరా! మీరు కూచున్నదే పెద్ద గాజు కొంప, దాంట్లోంచి రాళ్లేయలేరు!
సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత యావత్ ప్రపంచాన్ని తనకు పాదాక్రాంతం చేసుకునే పనిలో ఉన్న అమెరికాకు వాటంగా దొరికింది మోడీ సర్కార్. దేశభక్తి కొంగుచాటున మన ప్రభుత్వరంగ పరిశ్రమలను అమెరికన్ కంపెనీలకు మారుబేరానికి తెగనమ్ముతోంది. ఇవి అలీన విదేశాంగ విధానానికి చెల్లుచీటి ఇచ్చేలా చేశాయి. మన దేశం అమెరికా పంచన చేరింది. మోడీ సర్కార్ అగ్రరాజ్యానికి సాగిలపడ్డ అంశాలను కనుమరుగు చేసేంతగా హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు మోడీ మీడియా మేనేజర్లు. పైన పేర్కొన్నంత ''ఘన చరిత్ర'' ఉన్న అమెరికాను ఎదురు ప్రశ్నించడం పెద్ద కష్టం కాదు. మన దేశ పాలకవర్గాల అవసరాల కోసం అమెరికా గీసిన లక్ష్మణరేఖలు దాటిన ఎన్నో సందర్భాలు గతంలో ఉన్నాయి.
నేడు దేశంలో ఊడలు వేస్తున్న నిరుద్యోగంపై చర్చలేదు. పెచ్చరిల్లుతున్న పేదరికం గురించి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతో మాట్లాడేవారు కనపడరు. కనీసవేతనాలు అందని కార్మికుల ఆక్రందనలు ఎవరూ వినిపించుకోరు. ప్రయివేటీకరణలు, దానివల్ల దేశానికి జరిగే నష్టం ప్రస్తుత పాలక ''దేశ భక్తులు'' అసలు చర్చకే రాకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుత చర్చంతా హలాల్, అజామ్, హిజాబ్ వంటివాటి చుట్టూనే! మొన్న ధార్వాడ్‌లో ముస్లింల తోపుడు బళ్లు ధ్వంసం చేశారు శ్రీరామసేన కార్యకర్తలు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి కుర్చీ ఎక్కిన కర్నాటక ముఖ్యమంత్రి ముస్లింల వ్యాపారాలను బహిష్కరించండని పిలుపునిచ్చాడు. హరిద్వార్‌లో హిందూ మత పెద్దలు ముస్లింలను ఊచకోత కోయండని, ముస్లిం స్త్రీలను మానభంగం చేయండని పిలుపునిచ్చారు. అదే పిలుపు ఆ తర్వాత భోపాల్‌లో ప్రతిధ్వనించింది. మొన్న శ్రీరామనవమి ర్యాలీల్లో, హనుమ జయంతి వేడుకల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో ముస్లింలపై దాడులు జరిగాయి. అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ప్రదర్శనలన్నీ సాయుధంగానే జరుగుతున్నాయి. రంజాన్ ఉపవాస దీక్షల్లో ఉన్న ముస్లింలే లక్ష్యంగా సాగుతున్నాయీ దాడులు.
2002 గుజరాత్ 2022లో అనేక రాష్ట్రాలకు విస్తరించింది. ఇంత బహిరంగంగా దేశంలో మైనార్టీలపై దాడులకు తెగబడ్డ బీజేపీ పెద్దన్నకేమీతీసిపోదు. ఐఎఎస్, ఐపీఎస్‌లకు అమెరికాలో శిక్షణ, అదీ ఇజ్రాయిల్ వారితో శిక్షణ ఫలితాలివి. ఈ నేపథ్యంలోనేగా 'వీడెమ్' సంస్థ మన దేశాన్ని 'ఎన్నికలున్న నిరంకుశ పాలన' (ఎలక్టోరల్ ఆటోక్రసీ) అన్నది. మనదేశంలో ఉన్నది 'పాక్షిక స్వేచ్ఛ' అని ఫ్రీడమ్ హౌస్ అనే సంస్థ పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ విషయంలో మనదేశం స్థానం 2016లో 133 నుండి 2020కి 142కి దిగజారిందని రిపోర్టర్స్ వితౌట్ ఫ్రాంటియర్స్ తేల్చింది.
మన దేశంలో ప్రజాస్వామ్యానికి గ్రహణం పట్టిన సంగతి ప్రపంచం మొత్తానికి అర్థమవుతూనే ఉంది. మోడీని పల్లెత్తుమాటంటే జైళ్లు నోరుతెరుచుకుంటున్నాయి. రాణా అయూబ్, ఆకార్ పటేల్ వంటి వారిని మోడీ సర్కార్ ఎయిర్‌పోర్టులో ఆపేయగలదేమో కాని నిజాలు ఎల్లలు దాటడానికి వీసా అవసరం లేదన్న సంగతి ఈ ప్రభుత్వానికి ఎవరు చెప్పాలి! అందువల్ల ముందే చెప్పినట్టు చెరొక గాజు కొంపలో కూర్చొని బంతులాట ఆడలేమని ఇరుదేశాల నేతలకూ తెలుసు. కాకపోతే ప్రజలే అమాయకులన్నది వారి భావన..! అందుకే ఈ మోసపు మాటలు..!!