Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఏ ఉన్మాదం తలకెక్కిందో ఎందుకో ఈ విపరీతం'' అని ఓ కవి ఆందోళన చెందినట్టే నేడు దేశంలో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రోజు రోజుకి హిందూత్వ పరివారం భారతీయతకు సవాలుగా మారుతోంది. దేశమంతటా పెల్లుబుకుతున్న విద్వేషాలు, అరాచకాలు ఆజ్యం పోసేలా పరివారానికి తోడు ప్రభుత్వాధినేతలూ వ్యవహరిస్తుండటం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నవి. 'హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనాలి. లేకుంటే మైనార్టీలుగా మారిపోయే ప్రమాదముంది' అన్న మొన్నటి యతి సత్యదేవానంద వ్యాఖ్యల దుమారం చల్లారక ముందే, 'హిందూ జంటలు నలుగురు పిల్లలను కని, వారిలో ఇద్దరిని ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్, వీహెచ్‌పీ లాంటి సంఫ్‌ు సంస్థలకు ఇచ్చేయాలి. అలా చేస్తే భారత్ త్వరలోనే హిందూరాజ్యం అవుతుంది' అంటున్న వీహెచ్‌పీ మహిళా విభాగం వ్యవస్థాపకురాలు సాధ్వి రితంబర రెచ్చగొట్టే వ్యాఖ్యలు మరింత ఆందోళన కలగిస్తున్నాయి. దేశంలో లౌకిక, ప్రజాస్వామిక విలువలకు మతోన్మాద ప్రమాదం పొంచి ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏంకావాలి?
మన రాజ్యాంగంలో పౌరులకు మత స్వేచ్ఛ ఉంది. కానీ రాజ్యానికి (ప్రభుత్వానికి) మతం ఉండదు కూడదు. ఎందుకంటే మనది లౌకిక రాజ్యం. ఇతరలకు ఇబ్బంది కల్గించకుండా ఏవరి మత కార్యక్రమాలు వారు నిర్వహించుకోవచ్చు. అందుకు విరుద్ధంగా మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుతం మతమే రాజకీయం అయింది. ప్రతి విషయాన్ని మత కోణంలో చూడడం పెరిగిపోయింది. గతవారం ఎనిమిది రాష్ట్రాలలో చెలరేగిన రామనవమి అల్లర్లు, భారతదేశం అంతటా వ్యాపించిన విద్వేష రాజకీయాలు, మతపరమైన అలజడులు మోడీ హయాంలో తప్ప, గతంలో ఎప్పుడూ ఈ దేశం ఎరగదు. హనుమాన్ శోభాయాత్ర పేరుతో పోలీసులు చూస్తుండగానే వీధుల్లో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వినడానికే అసహ్యమనిపించే కఠినమైన మాటలతో నినాదాలు చేశారు. ఆ వర్గం మహిళలపై లైంగికదాడి జరుపుతామని బజరంగ్ మునిగా ప్రసిద్ధి చెందిన హిందూత్వ నాయకుడు అనుపమ్ మిశ్రా హెచ్చరికలిచ్చారు. మరో అడుగు ముందుకు వేసి సాధ్వి సరస్వతి 'ఆ వర్గాన్ని బహిరంగంగా ఉరితీయాలని' డిమాండ్ చేస్తే.. దీపేంద్ర సింగ్ అకాయతి నర్సింహానంద్ మారణహౌమానికి పిలుపునిచ్చారు. ఒకవైపు రామరాజ్యం అంటూనే మరోవైపు దేశాన్ని రావణకాష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? రాజ్యాంగం అమలవుతుందా? అన్న సందేహం కలగుతోంది. దీనిని బట్టి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆలోచనలు ఎంత విషపూరితమో, వివక్ష పూరితమో అర్థం చేసుకోవచ్చు.
ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి మతాలు వారివి. వాటిని కాదనే హక్కు ఎవరకీ లేదు. మత విశ్వాసం వేరు, మత విద్వేషం వేరు. కానీ విశ్వాసాల్ని దెబ్బతీసే ఈ విద్వేషం ఏ ప్రయోజనాలకు? అటువంటి విద్వేషాన్ని ఆవేశపూరిత ప్రసంగాలలో మందుగుండులా దట్టించి, భిన్నవర్గాల మధ్య విభేదాల్ని రెచ్చగొట్టే ఉన్మాదాన్ని ఎవరు రగిలించినా అది కచ్చితంగా జాతిద్రోహమే. తరచూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో విద్వేషాలను రాజేస్తున్నా, అందుకు కారకులపై కఠినచర్యలు కాదు కదా కనీస చర్యలు కొరవడటం దిగ్భ్రాంతపరుస్తోంది. ఫలితంగా సామరస్యం, సోదరత్వం విరబూయాల్సిన ఈ నేల కలతలు, కలహాలతో విలవిలలాడుతున్నది. మనుషుల మధ్య స్నేహ వారధులను నిర్మించవలసింది పోయి అడ్డుగోడలను సష్టిస్తున్నారు. విద్వేష వ్యాఖ్యలతో విషం చిమ్ముతున్నారు.
మనుషుల మధ్య మంటలు రేపడమే కాదు, దేశంలోని కీలకమైన సాంస్కతిక, మేధో సంస్థలన్నిటినీ ఆర్ఎస్ఎస్ వాదులతో నింపుతూ, కేంద్రప్రభుత్వం దేశాన్ని మతరాజ్యంగా మార్చేందుకు అడుగులు వేస్తోంది. దేశాన్ని హిందూరాజ్యంగా మార్చాలన్న ఆర్ఎస్ఎస్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది. అదే గనుక జరిగితే భారతీయతే ధ్వంసం అవుతుంది. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయత. ఈ వైవిధ్యం అంతరిస్తుంది. సర్వమతాల సామరస్యమే భారతీయత. ఈ సామరస్యం మంటగలుస్తుంది. ప్రజాస్వామ్యం కనుమరుగై. నియంతత్వం పడగ విప్పుతుంది. ప్రగతిశీల శక్తులన్నీ ఒక్కటిగా నిలిచి ఈ మత తత్వాన్ని తిప్పికొట్టి లౌకికవాదాన్ని కాపాడుకోవాల్సిన తరుణమిది. ఈ మతోన్మాదం కేవలం ముస్లీంలకు, ఇతర మైనారిటీలకే కాదు... అణచివేతకు గురయ్యే ప్రజలందరికీ శత్రువే. మతోన్మాదం ఏదైనా అది భస్మాసుర హస్తమే. మతం జీవన విధానమైతే ఏ అభ్యంతరమూ లేదు. కానీ.. మతమే రాజ్యమైతే...? అలాంటి రాజ్యం దేశానికి మహాప్రమాదం.