Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వివక్ష రూపాలు మారాయి. కానీ అది ఇంకా కొనసాగుతూనే ఉన్నది.. జడలు విప్పుతూనే ఉన్నది. కుల, మత, లింగ, ప్రాంతీయ వివక్షల గురించి మనం నిత్యం వింటూనే ఉన్నాం. కానీ మోడీగారి పాలనలో రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్ష రోజురోజుకీ పెరిగిపోతున్నది. నిధులు, విధులు, అధికారాల విషయంలో ఇది మరింత ప్రస్ఫుటంగా కనబడుతున్నది. తాజాగా తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం.. వరసగా విజ్ఞప్తులు చేస్తున్నా కేంద్రం పెడచెవిన పెడుతుండటాన్నిబట్టి మనపట్ల బీజేపీ సర్కారు వైఖరేమిటో తేటతెల్లమవుతున్నది. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల ఏర్పాటులోనూ ఇదే తీరును కేంద్రం ప్రదర్శిస్తుండటం గమనార్హం. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా మొత్తం ఏడు ఐఏఎంలను స్థాపించారు. వాటిలో ఒక్కటి కూడా తెలంగాణకు దక్కకపోవటం విస్మయపరిచే అంశం. ఇదే తరహాలో వివిధ రాష్ట్రాల్లో నాలుగు ఎన్ఐటీలు, 157 వైద్య కళాశాలలు, 84 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేసినా వాటలో ఏ ఒక్కటీ రాష్ట్రానికి కేటాయించకపోవటం దారుణం. విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన విశ్వవిద్యాలయం (ములుగు) ఏర్పాటుపై కూడా మోడీ సర్కారు మౌనం దాల్చింది. గతంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి... మన రాష్ట్రంలో డబ్ల్యూహెచ్‌వో సాంప్రదాయ ప్రాచీన వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామంటూ హామీనిచ్చారు. కానీ ఆ హామీ ఇప్పుడు గాలికి కొట్టుకుపోగా... ఆ కేంద్రం గుజరాత్‌కు తరలిపోయింది. మంగళవారం ఆ రాష్ట్రంలోని జామ్‌నగర్‌లో దానికి శంకుస్థాపన చేశారు.
ఇలా ఎనిమిదేండ్ల మోడీ సర్కారు... తెలంగాణకు చేసిందేమీ లేకపోగా... అనేక సందర్భాల్లో రిక్తహస్తాన్ని చూపింది. రాష్ట్ర వ్యవసాయరంగం అత్యధిక భాగం బోరు బావుల మీద ఆధారపడి ఉంది. ఈ క్రమంలో విద్యుత్ సంస్కరణల పేరిట తెలంగాణపై కేంద్రం తీవ్రమైన దాడిని కొనసాగిస్తున్నది. వాటికి మీటర్లు బిగించాలి.. డిస్కాములను ప్రయివేటీకరించా లంటూ ఒత్తిడి తెస్తున్నది. తాను చెప్పిన ఈ పనులను చేసి పెడితే... ఆర్థిక సాయాలను అందిస్తామంటూ ఆశ పెడుతున్నది. ఇలాంటి చర్యలు తెలంగాణకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తాయి. మరోవైపు ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీపై డీజిల్ సుంకాల భారాన్ని మోపటం ద్వారా బీజేపీ ప్రభుత్వం... ఆ సంస్థను నష్టాల్లోకి, మరింత అప్పుల ఊబిలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. ఫలితంగా ఇప్పుడు ప్రయాణీకులపై ఛార్జీల భారాన్ని మోపారు. దీంతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థలో బియ్యానికి బదులుగా నగదు బదిలీ చేపట్టాలంటూ కేంద్రం.. రాష్ట్రాలను కోరటం విడ్డూరం. అంటే ఇది పేదోడి నోటి కాడ ముద్దను లాక్కోవటమే. తెలంగాణలాంటి రాష్ట్రానికి ఇది తీరని నష్టాన్ని కలిగిస్తుంది.
ఈ విధంగా మన రాష్ట్రం మీద కేంద్రం వివక్షను ప్రదర్శిస్తూ చోద్యం చూస్తున్నది. వీటిని ప్రశ్నిస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిన ఇక్కడి కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా సంగ్రామ యాత్రలు, శోభా యాత్రలనుకుంటూ జనాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. పెట్రోల్ ధరల పెంపు వారికి పట్టదు. నిత్యావసరల రేట్లు పెరిగినా వారికి చీమకుట్టినట్టైనా ఉండదు. గ్యాస్ ధరలు గుదిబండల్లా మారి... జనం జేబులకు చిల్లులు పడుతున్నా అగుపడదు. పైగా 'మేం అధికారంలోకి వస్తే తెలంగాణలో విద్య, వైద్యం ఉచితంగా అందిస్తాం...' అంటూ 'పాదయాత్ర రధసారథి' మాట్లాడున్నారంటే ఆయన ఇండియాలోనే ఉన్నారా..? లేక వేరే ఏ ఇతర దేశంలో ఉన్నారా..? అనే సందేహం కలగక మానదు. కేంద్రంలో ఎనిమిదేండ్లుగా అధికారాన్ని వెలగబెడుతున్నది ఆయన పార్టీయే కదా..? అలాంటప్పుడు ఒక్క తెలంగాణకే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు విద్య, వైద్యాన్ని ఫ్రీగా అందిస్తే ఎవరైనా అడ్డుకున్నారా..? ఇదే విషయాన్ని 'సంగ్రామ బండి'ని నడుపుతున్న ఆ నాయకుణ్ని అడిగితే... వారి నుంచి 'జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై...' అనే నినాదాలే వస్తాయి తప్ప ఇతమిద్ధంగా స్పష్టమైన సమాధానమేదీ రాదన్నది జగమెరిగిన సత్యం. అందువల్ల అధికారం కోసం కుప్పిగంతులు వేస్తూ మత కుతంత్రాలు పన్నే కాషాయదళం పట్ల జనం జాగరూకతతో మెలగాలి. తెలంగాణపై వివక్షను ప్రదర్శిస్తున్న కేంద్రం వైఖరిపై అధికార టీఆర్ఎస్ తన పోరాటానికి పదును పెట్టాలి. గోడ మీది పిల్లి వాటంలా గాకుండా అది ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్లినప్పుడే వీటన్నింటినీ ఎదుర్కోగలం. ప్రతిపక్ష పార్టీలతో కేసీఆర్ చెట్టపట్టాల్ వేసుకుని ముందుకు సాగితేనే రాష్ట్రానికీ, మన ప్రజలకూ మేలు జరుగుతుంది. అప్పటి వరకూ ప్రజలు, ప్రజాతంత్ర, అభ్యుదయవాదులు ఈ క్రతువులో తమ పాత్రను పోషించాలి.