Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో కరోనా రక్కసి మళ్లీ తలెత్తుతోంది. కేసుల సంఖ్యతో పాటు పాజిటివిటీ రేటు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో సహా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, మిజోరం తదితర రాష్ట్రాల్లో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా 2,067పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలతో పోల్చుకుంటే కేసుల సంఖ్య 65శాతం పెరిగింది. ఢిల్లీ నగరంలోనే బుధవారంనాడు 600మంది వైరస్ బారిన పడ్డారు. ముంబాయిలో మార్చి రెండు తరువాత అత్యధిక కేసులు (85) నమోదయ్యాయి. చాలా రోజుల తరువాత దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 12 వేలు దాటింది. మరోవైపు దేశ వ్యాప్తంగా ఆర్ వాల్యూ (రీ ప్రొడెక్టవ్ వాల్యూ) ఒకటి దాటినట్టు చెన్నైకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాథమ్యాటికల్ సైన్స్ ప్రకటించింది. ఏప్రిల్ మొదటి వారంలో దేశ వ్యాప్తంగా 5-11 మధ్య ఉన్న ఆర్ వాల్యూ 18వ తేది నాటికి 1.07కు చేరినట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఆర్ వాల్యూ ఒకటి దాటడం మూడు నెలల తరవాత ఇదే మొదటిసారి. ఢిల్లీ, యూపీలలో ఆర్ వాల్యూ రెండుకు చేరింది. అంతర్జాతీయ నిర్దేశాల ప్రకారం ఇది ఒకటి దాటితే ప్రమాద ఘంటికలు మోగినట్టే! మరో మాటలో చెప్పాలంటే అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన సమయమిది.
కాన్పూరుకు చెందిన ఐఐటి పరిశోధకుల బృందం జూన్ నెలలో దేశంలో కోవిడ్ నాలుగో దశ చోటుచేసుకునే అవకాశం ఉందని గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతుండటంతో దేశ వ్యాప్తంగా ఈ విషయమై మళ్లీ చర్చ ప్రారంభమైంది. అనేక దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో డబ్ల్యుహెచ్ఓ కూడా ముప్పు తొలగిపోలేదని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం మహమ్మారిపై పోరాటం ముగియలేదని ప్రకటించారు. అయితే, ఈ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలన్న విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ముఖ్యంగా కరోనా కాటుతో ఆర్థికంగా అస్తవ్యస్తమైన రాష్ట్రాలను ఆదుకునే విషయంలోనూ, ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని క్షేత్రస్థాయికి విస్తృత పరిచి పేదలకు అండగా నిలిచే విషయంలోనూ ఆయన మౌనం వహించారు. సార్వత్రిక ఉచిత వ్యాక్సినేషన్‌పై కూడా ప్రధానిది ఇదే తీరు!
ముప్పు పొంచే ఉందని ఒకవైపు చెబుతూనే కీలకమైన ఈ విషయాలపై పెదవి విప్పకపోవడం దేనికి సంకేతమో! ప్రజల ప్రాణ పరిరక్షణ కన్నా ముఖ్యమైనది ఏమిటో? తాజా గణాంకాల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో వైరస్ బారిన పడిన వారిలో 27శాతం మంది చిన్నారులే! వీరిలో అత్యధికులు వ్యాక్సినేషన్ పరిధిలోకి రాని వారే! మిగిలిన వారిలోనూ ఇంతవరకు వ్యాక్సినేషన్ జరగని వారో, పాక్షికంగానే వ్యాక్సినేషన్ వేయించుకున్నవారో అత్యధికులు ఉన్నారు. తాజా గణాంకాల ప్రకారం అర్హులైన జనాభాలో 71శాతం మందికే ఒక్క డోస్ వ్యాక్సిన్ అందింది. 61శాతం మందికి రెండు డోసులు వేశారు. బూస్టర్ డోసు కేవలం 1.8శాతం మందికే అందింది. పిల్లలతో పాటు దేశవ్యాప్తంగా నూరుశాతం మంది ప్రజానీకానికి వ్యాక్సిన్ అందేదెప్పుడో? ఈ దిశలో నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించకుండా ఉత్త మాటలు ఎంత గట్టిగా చెప్పినా ప్రయోజనం ఏమిటి?
ఈ నేపథ్యంలోనే వైరస్ వ్యాప్తి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడం అనివార్యం. అటువంటి చర్యలే మరణాలను తగ్గిస్తాయి. తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏ మాత్రం అలసత్వం లేకుండా ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి సారించాలి. అదే సమయంలో ప్రజల జీవనావసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలతో చెలగాటమాడే విధంగా ఆంక్షలు రుద్దకూడదు. ఇప్పటికే మూడు దశల కరోనాను చూసిన అనుభవం మనకుంది! జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేసే కఠిన నిబంధనల కన్నా చైతన్యంతో వైరస్‌ను అడ్డుకోగలమన్నది ఇప్పటికే నిర్ధారణైంది. ఆ దిశలో ప్రజలను చైతన్యం చేయాలి. మాస్క్‌లను ధరించడంతో పాటు, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి చర్యలు పాటించడాన్ని కఠినంగా అమలు చేయాలి. ప్రజానీకం సైతం ఈ విష యంలో ప్రభుత్వాలకు సహకరించాలి. అప్రమత్తతే అసలైన ఆయుధం.