Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్లో బుల్డోజర్ ఎక్కి అభివాదం చేశారు. పతాక శీర్షికకలకెక్కిన ఈ వార్త ఇప్పుడో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆయన బుల్డోజర్ ఎక్కిన సందర్భం అటువంటిది మరి! ఇప్పుడీ దేశంలో బుల్డోజర్ కేవలం కట్టడాలను కూల్చి నేలను చదును చేసే సాధనం మాత్రమే కాదు, తరతరాలుగా ఈ దేశ ప్రజలు నిర్మించుకున్న సహజీవన సౌధాల్ని నేలమట్టంగావిస్తున్న విధ్వంసక ఆయుధం. మనుషుల్ని మూలాల నుంచి పెకిలించి నిరాశ్రయులను చేస్తున్న మృత్యుశకటం. జేసీబీ అంటే ''జిహద్ కంట్రోల్ బోర్డు''గా ఉత్తరప్రదేశ్‌లో రూపాంతరం చెందిన ఈ బుల్డోజర్ ఇప్పుడు బీజేపీ పాలిత ప్రభుత్వాలన్నిటికీ ఆదర్శప్రాయంగా మారింది. సరిగ్గా ఇప్పుడది దేశ రాజధానిలో గుండెల్ని ఛిద్రం చేసే హృదయవిదారక దృశ్యాలను సృష్టిస్తున్న సమయంలో ఆయన దానిని అధిరోహించి అభివాదం చేశారు. బహుశా అది యాధృచ్ఛికమే అయ్యిండొచ్చుగానీ, ఇప్పుడాయన భారత్‌తో సాగించే దౌత్యం కేవలం అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకే పరిమితం కాకుండా, ఈ దేశంలో దాడికి గురవుతున్న మానవహక్కుల గురించి కూడా చర్చించాలని ఈ సందర్భం గుర్తుచేస్తుండటం విస్మరించరానిది.
విషాదమేమిటంటే.. మనం కూడా ''రోటీ కపడా ఔర్ మకాన్'' అన్నవి మరిచిపోయి ''బీఫ్, హిజాబ్ ఔర్ బుల్డోజర్'' అని మాట్లాడక తప్పని దుస్థితిని ఎదుర్కొంటున్నాం. నిజానికి ఢిల్లీలోని జహింగీర్పూరీలో పకపక్కనే మసీదు, మందిరం నెలకొని ఉన్న కుశాల్చౌక్ ప్రాంతం... దశాబ్దాలుగా శాంతీ సామరస్యాలకూ, ప్రజల సహజీవన స్రవంతికీ ప్రతీక. అటువంటి చోట... అక్రమ నిర్మాణాల సాకుతో బుల్డోజర్లు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. పోలీసుల అనుమతి లేకుండా, చేతుల్లో మారణాయుధాలతో ఏప్రిల్ 16న సాగిన హనుమాన్ జయంతి యాత్రలో చెలరేగిన మత ఘర్షణలే అక్కడ ఈ అశాంతికి కారణం. ఈ ఘర్షణలకు కారకులెవరైనా దోషుల్ని శిక్షించాల్సిందే. అలాగే అక్కడి అక్రమ నిర్మాణాలపైనా చర్యలు చేపట్టవల్సిందే. కానీ ఏండ్లు గడుస్తున్నా గుర్తుకురాని ఆ అక్రమ కట్టడాలు ఉన్నట్టుండి ఇప్పుడు గుర్తుకురావడమే విచిత్రం! అంతే కాదు, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడి లేఖే శిరోధార్యంగా సమస్త అధికార యంత్రాం గం, పదిహేను వందల మంది పోలీసులు, తొమ్మిది బుల్డోజర్ లతో దాడులకు దిగడం మరీ విడ్డూరం!! దేనికైనా కొన్ని చట్టబద్దమైనపద్ధతు లుంటాయి. న్యాయబద్ధమైన సూత్రాలుంటాయి. వాటన్నిటిని కాలరాస్తూ, కనీస ముందస్తు నోటీసులైనా ఇవ్వకుండా, ఏకపక్షంగా ఒక వర్గాన్నే లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలకు తెగబడటం దేనికి సూచిక కేవలం ఒక ధార్మిక స్థలంలోని దుకాణాలను, ఆవాసాలను మాత్రమే ధ్వంసం చేసి, పక్కనే ఉన్న మరో ధార్మిక స్థలంలోని కట్టడాల జోలికే వెళ్లకపోవడం ఏం చెపుతున్నది?
వారు ప్రత్యర్థులుగా భావించిన వారికి పక్కా అధికారిక కాగితాలన్నీ ఉన్నా వదిలిపెట్టకుండా కూలదోసారు. అసలు కాగితాలు ఉన్నా లేకున్నా ఢిల్లీలోని అక్రమ కట్టడాలన్నిటికీ 2023 డిసెంబర్ వరకూ రక్షణనిస్తూ 2011లో ఏర్పడ్డ చట్టాన్నీ కాలరాసారు. వీటన్నిటికీ మించి అక్కడ యథాతథ స్థితి కొనసాగించాలన్న మన సర్వోన్నత న్యాయస్థానం తాజా ఉత్తర్వులున్నాయి. వాటిని కూడా లెక్కచేయకుండా ఒక రాజకీయ నాయకుడి లేఖకు కట్టుబడి ఈ దారుణానికి వొడిగట్టిన నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలినీ, అధికారులనూ ఏమనాలి? అందుకే ఈ దుశ్చర్యను తీవ్రమైన అతిక్రమణగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు హెచ్చరిస్తోంది. ఇది న్యాయమూర్తుల ఆగ్రహాన్నే కాదు, కమలనాథుల ఏలుబడిలో పాలనా వ్యవస్థల అవస్థలను కూడా ఎత్తిచూపుతున్నది. లేదంటే ''కూల్చివేయండి'' అని ఓ బీజేపీ నాయకుడు లేఖ రాయడ మేమిటీ, దానికి ''జీ హుజూర్'' అంటూ కార్పొరేషన్ మేయర్‌తో సహా అధికారులూ పోలీసులూ వంత పాడటమేమిటీ?!
ఇప్పుడు బుల్డోజర్లు కూల్చేస్తున్నది కేవలం కట్టడాలను మాత్రమే అనుకుంటే పొరపాటు. ఈ దేశ సమస్త వ్యవస్థలనూ, ఈ దేశ శతాబ్దాల సహజీవన పునాదులనూ అని గుర్తించాలి. అందుకే ఈ బుల్డోజర్లకు ఎదురు నిలవడమే కాదు, వీటి వెనుకున్నది మత రాజకీయాలేనని బృందాకరత్ కుండబద్ధలు కొడుతున్నది. ఘటనా స్థలిలోనే కాదు, న్యాయస్థానంలోనూ బాధితుల పక్షాన పోరాడుతున్నది. దేశంలోని లౌకిక ప్రజాస్వామిక శక్తులన్నీ ఆమె పోరాటాన్ని హర్షిస్తున్నాయి. విభజన భావజాలాన్ని నిరసిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో భారత పర్యటనకొచ్చిన బ్రిటిష్ ప్రధాని... కనీసం ఈ సమయంలోనైనా తమ విద్వేష విధ్వంసక చర్యల్ని ఆపని పాలక శ్రేణుల తీరును గర్హించాలి. తన బుల్డోజర్ అభివాదం వీరి ఉన్మాదానికి మద్దతుగా ప్రజలు భావించకూడదంటే ఈ అసహానాన్ని ఖండించాలి. బోరిస్ జాన్సన్ నుండి ఇది ఆశించడం అత్యాశే అవుతుందేమోగానీ, బృందాకరత్ మాత్రం గొప్ప ఆశారేఖలా కనిపించింది. కులమతాలకతీతమైన సామరస్యానికీ, సౌభాతృత్వానికీ నిలయమైన భారతీయతను, బుల్డోజర్ బూతాలకు బలివ్వడమా? లేక బరిలో నిలిచి కాపాడుకోవడమా అన్న సందేహాలకు స్పష్టమైన సమాధానంగా నిలిచింది.