Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అవును! గుర్రం వాడిదే, అప్పుడెప్పుడో... దానిపైనే ఇక్కడకొచ్చినోడు, నువ్వు ఈ మట్టిలోంచి మొలకెత్తినోడివి, గుర్రం వాడిదే! వాడు యుద్ధం చేసి గెలిచాడు, నువ్వు అన్నం ముద్దయి నిలిచావు; ఇంకా ఆ మధ్యయుగపు విరిగిన మెట్ల కింద మాసిన మీసాన్ని మెలివేస్తూ విర్రవీగుతున్నాడు... ఆటవిక ఆలోచనతోనే రాజ్యమై ఊరేగుతున్నాడు... గుర్రం వాడిదే! కానీ... ఈ నేల నేలంతా!'' అంటూ కవి, దళితుడు గుర్రమెక్కితే కొట్టి చంపిన ఘటనపై స్పందిస్తూ పద్యాన్ని రాశాడు. గుర్రమెక్కడమనేది కొన్ని వర్గాలకు, కులాలకు పరిమితమయిన హక్కుగా ఇప్పటికీ భావిస్తుండటం, తమ అధికారానికి ఆధిపత్యానికి సూచికగా అది నిలవటం గమనిస్తున్నాము. ఆధిపత్య కులాలకు, వర్ణాలకు మాత్రమే గుర్రమెక్కి ఊరేగగల అర్హత ఉందని మన సామాజిక వ్యవస్థలో జరుగుతున్న ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
తెలంగాణలో జాగిర్దారు, జమీందారు వ్యవస్థలోనూ దొరల ముందు చెప్పులేసుకుని ధైర్యంగా తలెత్తి తిరిగే పరిస్థితి ఉండేదికాదు. అందుకే అప్పుడు ప్రజలు తిరగబడి సాయుధ పోరాటమే చేసారు. వెట్టిని, వివక్షతలను పారద్రోలారు. ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజలందరికీ సమాన గౌరవమూ, సమాన హక్కులూ కలిగి ఉంటాయని మనకోసం మనం రాసుకున్న రాజ్యాంగం చెబుతుంది. దాని ఆధారంగానే పాలన, న్యాయము, చట్టము ఏర్పడింది. మరి ఇప్పుడిదేమిటి? ఎప్పుడో రాచరికంలో, మధ్యయుగాల నాటి ఆలోచనలు, విధానాలు తిరగబెడుతున్నాయి! ఎందుకు జరుగు తోంది? 2018లో ఒక దళితుడు గుర్రం ఎక్కాడని, ఆ గ్రామంలోని అగ్రకుల దురంహకారులు అతన్ని తీవ్రంగా కొట్టి చంపేశారు ఉత్తర భారతంలో. మొన్న కూడా మధ్యప్రదేశ్లోని దమోV్ాజిల్లాలో ఒక దళితుడు తన పెళ్ళి బారాత్ సందర్భంగా గుర్రంపై ఊరేగటానికి పోలీసు రక్షణ తీసుకోవాల్సి వచ్చింది.
పెళ్లి సంప్రదాయంలో ఊరేగింపు అనేది ఒక ఘట్టం. కొత్తగా జతకట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ ఊరివాళ్లందరికి ఆ విషయం ఎరిగించడమే ఇందులోని సారం. గుర్రాలు, గుర్రపుబండ్లు, పల్లకీలు మొదలైన రూపాలు మారి కార్లు, జీపులు ఇప్పుడొచ్చాయి. గ్రామీణ ప్రాంతాలలో ఈ తంతు జరుగుతూనే ఉన్నది. అందులో భాగంగా నీరజ్ అహిర్వార్ అనే దళిత యువకుడు తన పెళ్లి, ఊరేగింపుల సందర్భంగా గుర్రం ఎక్కడానికి వీలులేదని ఫర్మానా జారీ చేశారు ఆ ఊరి ఆధిపత్య కులాలవారు. ఈ బెదిరింపులకు భయపడి పోలీసులను ఆశ్రయించి పోలీసుల రక్షణలో పెళ్లితంతు పూర్తిచేసుకున్నాడు. ఇది ఒక సంఘటనే కావచ్చు. కానీ మన సామాజిక ఆలోచనలకు దర్పణం. అంతే కాదు, మన పాలకుల ఆలోచనల, విధానాల ఫలితం కూడా. ఎందుకంటే ఎక్కడయితే హిందూత్వ, మనువాద శక్తులు అధికారంలో ఉన్నారో అక్కడ మరింతగా కుల దురహంకారం, వివక్షత, హింస పెరిగిపోతున్నది. రాజ్యాంగ విలువలు, సమానత, ప్రజాస్వామ్య భావన అన్నీ విధ్వంసానికి గురవుతున్నాయి. డెబ్బయి ఐదేండ్ల స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా మన పయనం మధ్యయుగాలవైపుకు తిరుగు ప్రయాణం కట్టింది. సాంస్కృతిక పరమైన అన్ని విషయాలలో కూడా మనువాద భావజాలం విస్తృతంగా ప్రచారంలోకి తెస్తున్నారు. స్త్రీల పట్ల, దళితుల పట్ల, ఆదివాసీల పట్ల, మైనారిటీల పట్ల వివక్షతలు, విభజనలు ముందుకు తెస్తున్నారు.
ఒకవైపు మత పరమైన విభజనకు, విద్వేషానికి పూనుకుని వాళ్లూ, వాళ్ల సంస్కృతి వేరు, మనం వేరు, మనమంతా హిందువులం, బంధువులం అని తెగ అరచి గీపెడుతున్నవారు, పై వివక్షతలకు సమాధానం చెప్పాలి. హిందువులందరూ ఒకటే అయితే ఈ వివక్షతలేమిటి? ఈ విధ్వంసాలేమిటి! చంపడమేమిటీ? గుళ్లలోకి కూడా ప్రవేశాన్ని నిషేధించడాలు, తలెత్తుకుని నిలబడనీయని విధానాలు, మహిళలు పురుషలకు లోబడి ఉండాలన్న ఆలోచనలు, ఆహార నియమాలను కూడా నియంత్రించే నియంతృత్వ పోకడలు మొదలైనవన్నీ ఏరకమైన ఐక్యతకు నిదర్శనాలు! ఇవి పూర్తిగా ప్రజలను, చాతుర్వర్ణాల ఆధారంగా ఏర్పడిన కుల సమాజ స్థిరీకరణకు, ఆధిపత్య మనువాద వివక్షపూరిత సమాజ నిర్మాణానికి చేస్తున్న కృషిలో భాగమే. మనమంతా ఒకటేనని, అవకాశవాదంతో, విచ్ఛిన్న ధోరణితో రెచ్చగొట్టేందుకు చెబుతున్నదేకానీ, సమానతను కాంక్షించే ఆలోచన కానేకాదు.
కావున ఈ రోజు గుర్రం ఎక్కడానికి, తన స్వేచ్ఛా హక్కును వినియోగించుకోవడానికి భయపడి, రక్షణ తీసుకోవాల్సి వచ్చింది. రేపు మాట్లాడటానికి, ఆధిపత్య వర్గాలకెదురుగా నిలబడటానికి కూడా పెద్ద పోరాటమే చేయాల్సి అవసరం ఏర్పడవచ్చు. వివక్షత మైనారిటీలు, దళితులకే పరిమితమవ్వదు. అందరి దగ్గరికీ వస్తుంది. కనుక గొంతులు విప్పాల్సిన సమయమిది. ఐక్యంగా కదలాల్సిన సమయం.