Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈఏడాది సెప్టెంబరులో బీజింగ్‌లో బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా) కూటమి 14వ సమావేశాలతో పాటు, బ్రిక్స్ 15వ వార్షికోత్సవం కూడా జరపనున్నారు. ఈ పూర్వరంగంలో ఇటీవలే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ భారత పర్యటన జరిగింది. ప్రధాని ఉత్తరప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార హడావుడిలో ఉన్నందున వాంగ్‌తో భేటీ కుదరలేదని చెప్పారు. కానీ, సరిహద్దు సంగతి తేలకుండా తాను బీజింగ్ వచ్చేది లేదని స్పష్టం చేయటమే దీని అంతరార్థం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏకధృవ ప్రపంచం కోసం వెంపర్లాడే అమెరికాకు అనేక కూటములు ఏర్పడటం పక్కలో బల్లెం లాంటిదే. వీటిలో ఒక ముఖ్యమైంది బ్రిక్స్. దాన్ని సంరక్షించుకోవడం బ్రిక్స్‌లోని ఐదు దేశాల బాధ్యత సరిహద్దు వివాదాన్ని సాకుగా చూపి దాని విచ్ఛిన్నానికి భారతదేశం పూనుకుందనే పాపం మూటకట్టుకోరాదు.
బ్రిక్స్ శిఖరాగ్ర సభ భారత్-చైనాలకే పరిమితం కాదు. ఏ సంవత్సరం ఆ కూటమికి ఏ దేశం అధ్యక్షత వహిస్తుందో ఆ దేశంలో సభలు జరుపుతారు. ఈ సమావేశాలకు హాజరు కావటానికి సరిహద్దు వివాదానికి ముడి పెట్టటం ఏమిటన్న చర్చ నడుస్తోంది. పోనీ చైనాతో లావాదేవీలన్నిటికీ ఇలాగే ముడిపెట్టి అడుగు ముందుకు వేయనని చెబుతున్నారా? లేదే! 2020 గాల్వన్ ఉదంతం తరువాత చైనా వస్తువులను బహిష్కరించాలంటూ సంఫ్‌ుపరివార్‌కు చెందిన వారు, వారి ప్రభావానికి లోనైన మీడియా, ఇతరులు కూడా పెద్ద హడావుడి, ''దేశభక్తి'' ప్రదర్శనలు చేశారు. చైనా యాప్‌లను నిషేధించారు, దీపావళికి చైనా టపాసులు వద్దన్నారు. చిత్రం ఏమిటంటే అలాంటి వారిని వెర్రి వెంగళప్పలను చేస్తూ ఆ ఏడాదితో పోల్చితే 2021లో చైనా నుంచి దిగుమతులను అనుమతిం చటంలో మోడీ సర్కార్ కొత్త రికార్డు నెలకొల్పింది. 126 బిలియన్ డాలర్ల మేర దిగుమతి-ఎగుమతి లావాదేవీలు జరిగాయి. ఈ సంవత్సరం తొలి మూడు మాసాల్లో గత రికార్డులను బద్దలు కొట్టే దిశలో 31.9 బి.డాలర్ల లావాదేవీలు జరిగాయి.
చైనా నుంచి దిగుమతులు పెరగటం అన్నది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. మరి ఇక్కడ సరిహద్దు వివాదం, అక్కడ మోహరించిన మిలిటరీ గుర్తుకు రాదా! లేదూ వ్యాపారం వ్యాపారమే, దానికి సరిహద్దు వివాదాన్ని ముడిపెట్టకూడదు అని చెబుతారా ? అయితే అదే సూత్రం బ్రిక్స్ సమావేశంలో పాల్గొనటానికి ఎందుకు వర్తించదు?!
చైనా పెద్ద ఎగుమతిదారే కాదు, వివిధ దేశాల వస్తువులకు పెద్ద మార్కెట్ కూడా అని గమనించాలి. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనాను ఒక దేశంగా గుర్తించేందుకే నిరాకరించిన అమెరికా చివరకు దానితో కాళ్లబేరానికి వచ్చి ఐరాసలో గుర్తింపు, ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రవేశానికి అంగీకరించింది. దానితో పోలిస్తే మనం తాయత్తు కట్టుకొని బస్తీమే సవాల్ అంటూ బరిలోకి దిగే స్థితిలో ఉన్నామా? 1962లో సరిహద్దు వివాదంలో మన దేశం-చైనాల మధ్య యుద్ధం జరిగినప్పటికీ తరువాత కాలంలో రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలకు ఆ ఉదంతం అడ్డంకి కాలేదు.
ఉదంతం జరిగింది వాస్తవాధీన రేఖ ఆవల చైనా ఆధీన ప్రాంతంలో అన్నది తెలిసిందే. చైనా మన భూభాగాలను ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ కూడా ప్రకటించారు. పరస్పర అవిశ్వాసంతో రెండు వైపులా మిలిటరీ సమీకరణలు జరిగాయి. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవటం సహజం. ఎవరెన్ని చెప్పినా మిలిటరీ ఉపసంహరణ వెంటనే జరిగేది కాదు. అయినా ఆ ఉదంతాల తరువాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ తొలిసారిగా మన దేశానికి వచ్చాడు. ఉక్రెయిన్ వివాదం తరువాత అనేక దేశాల ప్రముఖులు మన దేశం వచ్చారు. చైనా మంత్రి రాక గురించి ముందుగానే వార్తలు వచ్చినా ఎందుకోగాని చివరి క్షణం వరకు నిర్థారణ కాలేదు. చైనా మంత్రి రాకను స్వాగతిస్తే అమెరికాకు, ఇతర పశ్చిమ దేశాలకు ఎక్కడ ఆగ్రహం వస్తుందో లేదా అపార్థం చేసుకుంటాయోననే మల్లగుల్లాలు కావచ్చు. ఇప్పటికే... తమ ఎడమ చేతి చిటికెన వేలు పట్టుకొని వెంట వస్తుందని, రష్యాను తిట్టేందుకు గొంతు కలుపుతుందని ఆశించిన వారి కోరిక నెరవేరలేదు. అనేక ఉదంతాల్లో అమెరికాను నమ్ముకున్న దేశాలు నట్టేట మునిగాయి. అమెరికాతో చేతులు కలిపితే, ఎన్నో దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న రష్యాను పోగొట్టుకుంటే మనకు మిగిలే మిత్రులెవరూ ఉండరు. అందుకే లాభనష్టాల బేరీజు వేసుకుంటూ అందరినీ సంతుష్టీకరిం చేందుకు కసరత్తు చేస్తున్నాం. అలాగే గాల్వన్ ఉదంతాలకు బాధ్యులైన చైనా మిలిటరీ ప్రతినిధులతో కూడా మన వారు చర్చలు జరుపుతూనే ఉన్నారు. (ఇప్పటికి 15సార్లు చర్చలు జరిపారు.) అయినా లడఖ్‌లో మిలిటరీని ఉపసంహరించకపోతే బీజింగ్ బ్రిక్స్ సమావేశాలకు రానంటూ మంకు పట్టుపట్టడంలోని ఉద్దేశ్యమేమిటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీకాదు. ఒకవైపు వ్యాపారులూ, పారిశ్రామికవేత్తల లాభాల కోసం దిగుమతులూ ఎగుమతులను కొనసాగిస్తూనే, మరోవైపు తాను సృష్టించిన చైనా వ్యతిరేకతనూ, దానికి ప్రభావితులైన వ్యక్తులనూ శక్తులనూ సంతుష్టీకరించేందుకే మోడీ సర్కార్ ఈ జిమ్మిక్కులకు పూనుకుంటున్నది స్పష్టం. కానీ, బ్రిక్స్ ఒక అంతర్జాతీయవేదిక, దానికి వెళ్లకుండా మంకుపట్టుపడితే మిగతా దేశాల దృష్టిలో మన దేశం పలుచన కాదా? ఎగుమతి, దిగుమతి లావాదేవీలు జరపటానికి లేని బెట్టు దీనికి ఎందుకో?