Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మూడు వైపుల శివారు ప్రాంతాలైన అల్వాల్, ఎల్బీనగర్, సనత్ నగర్లో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేరిట మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో వైద్య విధానాన్ని పటిష్టం చేస్తున్నామంటూ ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించటమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఒక విషయం మనకు గుర్తుకు రాక మానదు. ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టే సమయంలో ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఇదే 'కార్పొరేట్ వైద్యం' పదాన్ని విపరీతమైన ప్రచారంలో పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ పదం మన పాలకులందరి నోటా వినబడుతున్నదే తప్ప.. పేదోడి వైద్యానికి మాత్రం భద్రత, భరోసా దొరకలేదు.
కరోనా సమయంలో అట్టహాసంగా, ఆర్భాటంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో టిమ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. 'పదిహేను రోజుల్లో ఆస్ప త్రిని నిర్మించిన ఘనత మాదే...' అంటూ ఊదర గొట్టింది. కానీ ఇప్పుడక్కడ సరైన మౌలిక వసతులు, పడకలు, ఐసీయూలు లేక అది కునారిల్లుతున్నది. దాని దుస్థితి ఆ విధంగా ఉండగానే మరో మూడు టిమ్స్‌లకు భూమి పూజ జరిగిపోయింది. మరోవైపు చారిత్రక ఉస్మానియా దవాఖానాకు కొత్త భవనం అనే హామీ అటకెక్కింది. ప్రఖ్యాతిగాంచిన గాంధీ ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్ వారానికోసారి డ్రైనేజీతో కంపు కొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఇమేజ్ ఉన్న నిమ్స్ హాస్పటల్లో పరీక్షలు, చికిత్సల కోసం రోగులు నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇక ఎంతో కీలకమైన ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలోని రోగుల గోసైతే వర్ణనాతీతం. అక్కడ పేషెంట్లకు ఉన్న ఇతరత్రా రోగాల నిర్దారణ కోసం వారిని గాంధీ, ఉస్మానియాకు పంపుతున్నారు. అయితే సహాయకులు లేని మానసిక రోగులను సైతం ఒంటరిగా టెస్టులు చేయించుకుని రావాలంటూ పంపుతుండటం విస్తుగొలిపే అంశం. ఇలాంటి ప్రఖ్యాత ఆస్పత్రుల పరిస్థితే ఈ విధంగా ఉంటే... వాటిని పట్టించుకోకుండా కొత్తగా మరిన్ని ఆస్పత్రులను నిర్మించటం ఇక్కడ గమనార్హం.
ఇక 33 జిల్లాల తెలంగాణలో జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఒక్కో జిల్లాలో ఒక్కో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఆ చొప్పున ఇప్పటికి రాష్ట్రంలో మొత్తం వైద్య కళాశాలల సంఖ్య 10కి (ఉస్మానియా, గాంధీ, ఎంజీఎంతో కలిపి) చేరింది. ఇవిగాక మరో 23 మెడికల్ కాలేజీలను నిర్మించాల్సి ఉంది. కత ఇంత వరకూ బాగానే ఉన్నా... అసలు ఇప్పటి వరకూ నిర్మించిన వైద్య కళాశాలల్లో మౌలిక వసతులు, సిబ్బంది, 24 గంటల ల్యాబ్ సౌకర్యం కల్పించాలన్న సోయి సర్కారుకు లేకుండా పోవటం విడ్డూరం. ఇవి లేకుండా నాణ్యమైన వైద్య విద్య అందుతుందని భావించటం అత్యాశే అవుతుంది.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని పేదోడికి వైద్యం గగన కుసుమమైంది. ఆరోగ్య శ్రీ లాంటి పథకాల ద్వారా అందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందిస్తున్నామంటూ సర్కారు వారు చంకలు గుద్దుకున్నా...ఆ పథకం కింద చేసిన చికిత్సలు, శస్త్ర చికిత్సలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవటంతో ప్రయివేటు, కార్పొరేట్ దవాఖానాలు సామాన్యుణ్ని గేటు దాకా కూడా రానివ్వటం లేదు. మరోవైపు ఆ పథకం వర్తించాలంటే బాధితులు రకరకాల కొర్రీలను దాటుకుని పోవాల్సి ఉంటున్నది. కొత్తగా ఇచ్చిన ఆహార భద్రతా కార్డుల ద్వారా ఆరోగ్యశ్రీని పొందేందుకు వీల్లేదు. ఈ నేపథ్యంలో బీదా బిక్కీ... 'వైద్యమో చంద్రశేఖరా...' అంటూ గోసపడుతున్నారు. ఏతావాతా తేలేదేమంటే ప్రభుత్వం పూర్తిగా ప్రజల ఆరోగ్య రక్షణ, వారికి నాణ్యమైన వైద్యాన్ని కల్పించటమనే నిర్వహణ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుని... కేవలం ఎంతో కొంత నిధుల విడుదలకే పరిమితమై పోతున్నదన్నమాట. ఈ క్రమంలో మన బడ్జెట్లో వైద్యారోగ్య రంగానికి కేటాయింపులు 1.2 శాతం దాటటం లేదు. ఇలా అరకొరా నిధులతో ఆ రంగం ఎలా బలోపేతం అవుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇలాంటి వైద్య విధానాలకు ప్రత్యామ్నాయంగా కేరళ ఆరోగ్య రంగం దేశానికి ఒక మోడల్‌గా నిలిచింది. ప్రాథమిక వైద్య రంగాన్ని బలోపేతం చేయటం, ఆరోగ్య, ఆహార నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించటం, పర్యావరణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించటం తదితర చర్యల ద్వారా అక్కడి పాలకులు ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేశారు. ఢిల్లీ ప్రభుత్వం సైతం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించటం ద్వారా అక్కడి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కారు 'రాశి కంటే వాసి ముఖ్యం...' అనే విషయాన్ని గుర్తెరగాలి. తద్వారా కేవలం సంఖ్య కోసం ఆస్పత్రులను నిర్మించటమనే పద్ధతికి స్వస్తి పలికి.. .ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ట పరచాలి.