Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాస్వామ్యం పేరుతో మూకస్వామ్యం రాజ్యమేలుతోంది. ఎనిమిదేండ్ల తమ పాలనలో నిర్మాణాత్మకంగా ప్రజలకు ఏమి చేశారో చెప్పుకోలేకే ఈ మూక భావోద్వేగాల నెగడు దేశంలో ఏదో ఒక మూల నుంచి ఆరిపోకుండా రాజేస్తున్నారు కాషాయీదారులు. రోజురోజుకి పెరుగుతున్న దాడులే ఈ పెచ్చరిల్లుతున్న అసహనానికి పరాకాష్ట. ఇది దేశానికి ప్రమాదకరమని తెలిసి కూడా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా, మూకస్వామ్యానికి బాకా ఊదుతోంది. ఇది అత్యంత ఆందోళన కల్గిస్తోంది.
ఢిల్లీ నడిబొడ్డున ఉన్న జహంగీర్‌పురిలో ఏప్రిల్ 16న శోభాయాత్ర పేరుతో హిందూత్వ శక్తులు సష్టించిన అల్లరి అంతా ఇంతా కాదు. శోభాయాత్రపై రాళ్లదాడి చేశారన్న ఆరోపణలతో మోడీ సర్కార్ పోలీసుల్ని అక్కడున్న ముస్లిం మైనార్టీ లపైకి ఉసిగొల్పింది. వారి దుకాణాలు, ఇండ్లను బుల్డో జర్లతో కూల్చి వేసింది. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రజల ముందు ఆవిష్కరించి ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మీడి యాది. కానీ, కొన్ని ఛానెళ్ల ప్రసా రాలు ఏకపక్షంగానే సాగాయి. ముస్లిం మైనార్టీ వర్గాలను హిందూత్వ శక్తులు టార్గెట్ చేశాయన్న సున్నితాంశాన్ని సదరు ఛానెళ్లు విస్మరించాయి. ఒక టీవి ఛానెల్ అయితే 'బుల్డోజర్లతో కూల్చివేతలకు దేశం యావత్తు మద్దతు పలకాలి' అని పోల్ సర్వే సైతం నిర్వహించింది. కూల్చివేతలు సరైనవే.. వాటిని అడ్డుకునేవారు 'జిహాదీ మద్దతుదారులే' అంటూ మరో పత్రికా ఎడిటర్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ రాజకీయాల్ని... మంచి పాలనకు గుర్తుగా ప్రధాన మీడియాలో ఒక వర్గం తెగ ఊదర కొడుతోంది. అంటే మీడియా ఏ వైపు నిలుచుంది? సమాజంలో మీడియా పాత్ర ఇదేనా? అనే సందేహాలు కలగకమానవు.
సమాజ సేవ, దీనజనోద్ధరణే పత్రికల ప్రాధాన్యత కావాలన్న మహాత్ముని మాటలను మంట కల్పుతూ.. ప్రజలలోని ఆగ్రహావేశాలను సంచలనాత్మకంగా మలచిన నేరం దశ్యమీడియాదే కావచ్చు. కానీ, 'తిలా పాపం తలా పిడికెడు' అన్నట్టు ఇప్పుడది అందరిది. వార్తలు చెప్పవలసిన గొంతు, దేశమంటే తానేనని హుంకరిస్తున్నది. టీవీ బాక్సులు బద్దలయ్యేలా కేకలు పెడుతున్నది. శత్రువును గుర్తించి ద్రోహముద్రను అంటకడుతోంది.
హత్యలను సమర్థి స్తున్నది. వార్తలను రాయ వలసిన చేయి కూడా నిష్పా క్షికత ఇరుసు మీద నిలబడలేక, అధికారం వైపు ఒరిగిపోతున్నది. అనేక అఘాయిత్యాల తరు వాత, తెల్లవారి లేచి చూసుకుంటే, పాత్రికేయుల చేతులకు కూడా ఎంతో కొంత నెత్తుటి మరకలు అంటి ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో సమా చార సాధనాలంటే రానురాను గౌరవం అడుగం టిపోతోంది. ఒక అప్రజాస్వామికమైన పర్యవ సానాన్ని ప్రోత్సహించడమే కాదు, అందులో భాగస్వామ్యం తీసుకోవడానికి సైతం జర్నలిజం తహతహలాడటం విషాదం. కానీ ఏ బాపతు ప్రజాస్వామ్య విధ్వంసకులనైనా ప్రజలు నిలదీయకుండా ఉండరు. అందుకు మీడియా ఏమీ మినహాయింపు కాదు.
విద్వేషపూరిత నియంతృత్వ పాలకవర్గాల చర్యలను ఎండగట్టాల్సిన మీడియా, ఆ పాలకవర్గం చేతి కీలుబొమ్మగా మారిపోయింది. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ కీలకమైనది. సంచనల వార్తలను, విలువల్లేని విశ్లేషణలను, వ్యక్తిగత అభిప్రాయాలను జోడించే వార్తలను అందించే వేదికలుగా మీడియా మారకూడదు. సామాన్యుల గొంతుగా నిలవడం కోసం రాజీ లేకుండా నిజాలను నిర్భయంగా ప్రజలకు అందించాలి. ఒక సమాజంలోని వివేకవంతులు, విమర్శకులు ఏ స్థాయిలో ఉంటే, ఆ సమాజపు అత్యున్నత వ్యక్తీకరణ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. పత్రికలు కూడా అంతే. సమాజంలో రెండు పొరల మధ్య ఉండే తేడాను ప్రగతిశీలంగా తగ్గించుకుంటూ పోగలగడమే పురోగమనం. కానీ, విచక్షణ వివేకం కాక వేలంవెర్రిగా మూకసాంస్కతిక ప్రధానవేదికగా సమాజానికి తానే విలువల ప్రతినిధిని అని ప్రకటించు కుంటుంది. దానికి తోడు నేటి మీడియా క్రమంగా ఆదర్శాలను వదిలి, యథాతథవాద, మూకస్వామ్య, హింసాత్మక వ్యక్తీకరణల ఆకర్షణలోకి వేగంగా పతనమవుతున్నది. అందులో భాగంగానే మూకదాడులకు వాయిద్య సహకారం అందిస్తున్నది. ఢిల్లీలో కేవలం మందబలం ఆధారంగా ప్రస్తుతం అనధికారికంగా అమలవుతున్న నిషేధాలను మీడియా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోవడం సరికాదు. నిజానిజాలేమిటో ప్రజల ముందుంచాలి. ఇవి అనధికారికమైనవేనని తేల్చి చెప్పాలి. మీడియా ఆ బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి. మూకస్వామ్యాపు చేటు శత్రువులకే కాదు. మిత్రులకు చేటే.