Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమ్యాకాశాల్లో ఎక్కడ ఉన్నా ఉక్రెయినుకు అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి కోసం మిత్ర దేశాలు సర్వప్రయత్నాలు చేస్తాయని అమెరికా రక్షణమంత్రి లాయడ్ ఆస్టిన్ చెప్పాడు. మంగళవారంనాడు జర్మనీలోని రామ్‌స్టెయిన్‌లో ఉన్న అమెరికా వైమానిక కేంద్రంలో నాటో, జపాన్, ఇజ్రాయల్ వంటి దాని మిత్ర దేశాల విదేశాంగ మంత్రులు, అధికారుల సమావేశం జరిగింది. వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లపై దాడుల సందర్భంగా చెప్పిన పచ్చి అబద్దాల కొనసాగింపుగా రష్యాతో జరుపుతున్న పోరులో ఉక్రెయిన్ విజయం సాధించబోతున్నదని ఆస్టిన్ సెలవిచ్చాడు. రష్యాకు వ్యతిరేకంగా పశ్చిమదేశాల ఎత్తుగడలకు ఐరాస వేదికల మీద మద్దతు తెలిపేదేశాల సంఖ్య మార్చి రెండు -ఏప్రిల్ ఏడవ తేదీల మధ్య 141 నుంచి 93కు తగ్గింది. ఈ నేపథ్యంలో తమ శిబిరంలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, వివాదాన్ని మరింతగా పొడిగించేందుకు అమెరికా పావులు కదుపుతున్నది. ఆయుధాలు అందించటం గురించి మీనమేషాలు లెక్కించేందుకు సమయం లేదని, రానున్న కొద్ది వారాలు కీలకంగా మారనున్నందున వెంటనే కదలాలని కూడా తొందరపెట్టాడు. ప్రతి నెలా దీని గురించి సమీక్షా సమావేశం జరుగుతుందని ఆస్టిన్ చెప్పటాన్ని బట్టి నెలల తరబడి వివాదాన్ని కొనసాగించేందుకు పూనుకున్నట్లు స్పష్టం అవుతున్నది. ఈ వివాదంలో అమెరికా అసలు రూపం మరింత బయటపడుతున్నది.
గత రెండునెలలుగా ఉక్రెయినుకు నాటో కూటమి ఐదు బిలియన్ డాలర్ల విలువగల ఆయుధాలు అందించగా దానిలో అమెరికా వాటా 3.7బి.డాలర్లుంది. ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలు, ఆస్తులను ఫణంగా పెట్టి ఆయుధవ్యాపారుల రక్తదాహాన్ని తీర్చటం తప్ప ఇది మరొకటి కాదు. తూర్పు ఐరోపా దేశాలలో ఇప్పటికీ పూర్వపు సోవియట్ ఆయుధాలే ఉన్నాయి. అందువలన మిగతా దేశాలన్నీ తమ వద్ద ఉన్న వాటన్నింటిని ఉక్రెయినుకు తరలిస్తే వాటి బదులు సదరు దేశాలకు తమ ఆధునిక ఆయుధాలను అందచేస్తామని అమెరికా ప్రతిపాదించింది. తాము రూపొందించిన అధునాతన క్షిపణులు, ఆయుధాలు పరిశోధనా కేంద్రాల వెలుపల ఎలాంటి విధ్వంసకాండ జరుపుతాయో నిర్థారించుకొనేందుకు అమెరికా గత యుద్ధాలను ఉపయోగించుకుంది. జపాన్‌పై అణుబాంబులతో అందుకు నాంది పలికింది. ఇప్పుడు ఉక్రెయిన్‌లో మరొక కొత్త అంకానికి తెరలేపింది. తూర్పు ఐరోపా దేశాల వద్ద ఉన్న పూర్వపు సోవియట్ ఆయుధాలను ఉక్రెయిన్‌కు తరలిస్తే ఆ ఖాళీని తన వాటితో నింపాలని చూస్తున్నది. అవకాశాలను పరిశీలించేందుకు ఇప్పటికే అమెరికా ఆయుధకంపెనీల ప్రతినిధులు తూర్పు ఐరోపాలో వాలారు. ఇది అమెరికాకు మరింత లాభం.
ఇప్పటి వరకు అమెరికా పన్నిన ఎత్తుగడలో భాగంగా ఐరోపా దేశాలన్నీ రష్యా మీద కత్తిగట్టటంలో ఒక్కటిగా ఉన్నాయి. తదుపరి దశలో జరిగే పరిణామాలు, అమెరికా దూరాలోచనలను బహుశా పసిగట్టే నాటో, ఇతర అనేక దేశాల్లో ఈ సంక్షోభం-పర్యవసానాల గురించి మధనం ప్రారంభమైంది. వాటిలో చీలిక వస్తే ఏమిటన్న ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందేమో అన్న గుబులు అమెరికాలోనూ తలెత్తిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. బహుశా ఈ కారణంగానే రష్యా ఇంథన దిగుమతులపై తదుపరి ఆంక్షలను విధించటం గాకుండా దౌత్యం మీద కేంద్రీకరిస్తామని, చమురు కొనుగోలు చేసే దేశాలు స్వచ్ఛందంగా విరమించుకొనేట్లు చూస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అమెరికా సెనెట్ విదేశీ సంబంధాల కమిటీతో చెప్పారు. మన దిగుమతుల్లో రష్యా చమురువాటా రెండుశాతమే అయినా కొనుగోలు ఆపేది లేదని మన దేశం తీసుకున్న వైఖరితో పాటు, రష్యా ఇంథన దిగుమతుల మీదనే ప్రధానంగా ఆధారపడే ఐరోపా దేశాలను కూడా గమనంలో ఉంచుకొనే సామ దాన భేద దండోపాయాలకు అమెరికా దిగింది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పర్యటనలో ఆస్టిన్ చేసిన వ్యాఖ్యలు లక్ష్యాన్ని వెల్లడించాయి. కోట్ల మంది ఉక్రేనియన్ల జీవితాలు అతలాకుతలమైనా, ప్రపంచవ్యాపితంగా ప్రభావం పడుతున్నా దానికి పట్టదు. ఉక్రెయిన్ మీద మాదిరి మరోదాడి జరపలేనంతగా రష్యాను బలహీనపరచటమే తమ లక్ష్యమని ఆస్టిన్ చెప్పాడు. అందుకోసం అమెరికా ఎంతకైనా తెగించేందుకు పూనుకుంది.