Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విధ్వంసాన్ని ఆపకుండా నిర్మించడం ఎలా సాధ్యం! విపత్తులు నిలువరిస్తేనే భవిష్యత్తుకు బాట పడుతుంది. ఉన్మాదాన్ని తరిమికొట్టటమే నేటి కర్తవ్యం కావాలి. అంతే కాని ఇది వదిలేసి నిర్మాణమేదో చేపడతానని, ఇంకేదో కొత్తమార్గం చూపెడతానని ఎన్ని హీరోచిత పిలుపులిచ్చినా, తక్షణావశ్యక ఆచరణను విస్మరించడమే అవుతుంది. అప్పుడు కొత్తదారులు కాదు, నిలబడటమే కష్టమవుతుంది. మొన్న జరిగిన ప్లీనరీ సమావేశాలలో మన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్‌గారు నేడు దేశంలో విస్తరిస్తున్న ద్వేషపూరిత రాజకీయాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజల్లో విభేదాలు సృష్టిస్తోందని, ఇది దేశ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టని చాలా వాస్తవిక విషయాలను వెల్లడించారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఇన్నాళ్లకయినా ఎరుక గలిగినందులకు అభినందించాలి.
కానీ చివరన ఏమన్నారు. ఒకరిని గద్దె దించడం, మరొకరిని గద్దెనెక్కించడం ఒట్టి చెత్తపని అని కొట్టేశారు. ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని దేశం ముందుంచి, ప్రజలనే గద్దెనెక్కిస్తామని చాలా వినసొంపయిన మాటల్ని వినిపించారు. అందరం కలిసి బీజేపీని ఓడించాలన్న వామపక్షాల పిలుపు మాకు సమ్మతం కాదనీ సెలవిచ్చారు. ఇది నేలవిడిచి సాము చేయటమే అవుతుంది. రాజ్యంపై విరుచుకుపడే శత్రువును ముందుగా ఓడించకుండా, రాజ్యాభివృద్ధికీ, రక్షణ వ్యవస్థ నిర్మాణానికి ప్రణాళికలేస్తూ కూర్చుంటామా? అసలు ప్రత్యామ్నాయ విధానాలంటే ఏమిటి? ఏ వ్యవస్థలను రక్షించుకుంటే ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు పోగలుగుతాము!
గత డెబ్బయ్యేండ్లుగా స్వతంత్ర భారతదేశం కొనసాగించిన జీవన విధానానికి పూర్తి విరుద్ధంగా, మత రాజ్యంగా మార్చాలని చూస్తున్న హిందూత్వ విద్వేషం రెచ్చగొట్టబడుతున్నది. రాజ్యాంగపు విలువలు అయిన ప్రజాస్వామిక లౌకిక విధానాలు విధ్వంసానికి గురవుతున్నవి. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ హిందూత్వకు అనుకూలంగా మార్చివేసే ప్రయత్నం ఆరెస్సెస్, బీజేపీలు వేగవంతం చేస్తున్నాయి. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లు తీసుకువచ్చి మత విభజనకు పూనుకొంటున్నవి. భాష, వేషం, ఆహారం మొదలైన సాంస్కృతిక వైవిధ్యాలనూ ధ్వంసమొనరుస్తూ మునుపెన్నడూ లేని విధంగా విద్వేషాలను పెంచుతున్నవి. ప్రశ్నించినవారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నవి. చంపుతాం, చెరుపుతాం, కూల్చుతాం అంటూ బహిరంగంగానే బుల్డోజర్ రాజకీయాల్ని ఉసిగొల్పుతున్నవి. దీన్ని ముందుగా నిలువరించాలి కదా! దీనికి ప్రత్యామ్నాయం ఇంకేముంటుంది. మత సహన జీవనం, సామరస్యం, లౌకిక ప్రజాస్వామిక విధానం తప్ప.
భారతదేశ ఫెడరల్ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి, కేంద్రీకృత నియంతృత్వ విధానాలకనుగుణంగా పన్నులు (జీఎస్టీ), వ్యవసాయ, విద్యుత్, విద్య మొదలైన వ్యవస్థలపై అధికారం చేస్తూ, గవర్నర్ల వ్యవస్థతో రాష్ట్రాలను నియంత్రించే కేంద్రం చర్యలను ఎదుర్కోవటానికి, ఆ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దెదించి, ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకోవటం కంటే ప్రత్మామ్నాయం ఇప్పటికేమున్నది! ఈ దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ఉపాధి, పేదరికం, ఆకలి, రైతుల ఆత్మహత్యలు, సామాజిక వివక్షతలు, కుల దురహంకార దాడులు మొదలైనవన్నీ ఉండగా వీటిపై నుండి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు మతాన్ని, మత సంస్కృతిని విద్వేషంగా మార్చి ప్రయోగిస్తున్న బీజేపీని నిలువరించటం, ఓడించటం కన్నా ప్రధానాంశం ఏమున్నది.
ఇక ఆర్థిక విధానాలు, కార్పొరేటు శక్తులకు దోచిపెడుతున్న తీరుకు భిన్నంగా ఉదారవాద ఆర్థిక విధానాలను వ్యతిరేకించే ఎజెండా టీఆర్ఎస్ దగ్గర ఏమయినావున్నదా! పన్నుల విధానాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు రాష్ట్రాల వాటాకు వాళ్లు ఎగనామం పెట్టారు. నోట్లు రద్దు చేసి ప్రజలను కష్టాలకు గురిచేసినా, అంతెందుకు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి, వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పినా మాట్లాడలేదు. రైతులను నిర్బంధించి, చంపి, నానా ఇబ్బందులకు గురిచేసినప్పుడూ నోరెత్తలేదు. కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడూ గొంతు విప్పలేదు. ప్రభుత్వ సంస్థలను, ఆస్తులను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నా చూస్తూ ఊరకున్నారు. ఇవన్నీ ఉదారవాద ఆర్థిక విధాన దుప్ఫలితాలు. పోనీ ఇప్పుడైనా మాట్లాడటాన్ని ఆహ్వానించాలి. కానీ వాళ్ళను గద్దెదించడం మాపని కాదంటే ఎలా? మన తర్వాత అభివృద్ధి శరవేగంగా జరిగిన చైనా గురించి ప్రస్తావించారు నాయకుడు. చైనా కమ్యూనిస్టు దేశమనే విషయం స్పష్టపరుచుకోవాలి. వామపక్షాలు ఎప్పటి నుండో ప్రజల ఎజెండాతో, ప్రత్యామ్నాయ విధానాలను వినిపిస్తూనే ఉన్నాయి. నేడు ఫాసిస్టు తిరోగమన విధానం ముంచెత్తుతున్నప్పుడు దాన్ని తిప్పికొట్టటమే ప్రధాన కర్తవ్యం కావాలి. అందుకు ప్రజాస్వామిక, లౌకిక, సామాజిక శక్తులన్నీ ఐక్యంగా నిలబడి వైవిధ్యభరితమైన భారతీయ జీవనాన్ని, మత సామరస్యాన్ని, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవాలి. ఈ అవసరాన్ని గుర్తెరగాలి.