Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎనిమిది గంటలే పని చేస్తామన్నందుకు తుపాకులు నిప్పులు కక్కాయి. బాయినెట్లు నెత్తురోడాయి. నాయకులు ఉరికొయ్యలకు వేలాడారు. దీన్ని కలియుగమన్నారు. ఇది పెట్టుబడిపై తిరుగుబాటన్నారు. ''శూద్రులు స్వర్గానికి అర్హులు కారా?'' అంటూ ప్రశ్నించి కఠోర తపస్సు చేస్తున్న శంభూకుడి తల నాడు తెగిపడింది. దానిని త్రేతాయుగమన్నారు. ధర్మం నాలుగు పాదాల నడిచే, అంటే చాతుర్వర్ణ వ్యవస్థ ''విరాజిల్లుతున్న'' రామరాజ్యంలో అది కుల వ్యవస్థపై తిరుగుబాటన్నారు. యుగాలు మారినా దోపిడీ స్వభావం మారలే!
మే నెలంటే పిడికిళ్లు బిగుసుకునే రోజు. మేడే అంటే ప్రాణాల్ని తృణప్రాయంగా ఉద్యమానికి అందించిన రోజు. యంత్ర భూతాల కోరలు తోమడానికే కాదు.. తామూ ఎనిమిది గంటలే పనిచేస్తామనీ అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికులు ఉద్యమించిన రోజు. చికాగోలో రక్తం ఏరులైపారిన రోజు. అందుకే, మేడే పెట్టుబడిపై ప్రత్యక్ష వర్గయుద్ధం ప్రకటించిన రోజు! కానీ, మేడేని పురాణ గాథస్థాయికి దిగజార్చి పండుగ దినంగా జరుపుకోడానికి అలవాటుపడ్డ కార్మిక సంఘాలు నేటి భారతదేశంలో ఏమిచెప్తాయి? చట్టాలు మారకముందే, కోడ్‌లన్నీ ఉనికిలోకి రాకముందే నేడు 12గంటల పనిదినం సార్వత్రికం అయిపోయింది. సంఘటితరంగ పరిశ్రమల్లో సైతం వేల సంఖ్యలో ఉన్న కాంట్రాక్టు, క్యాజువల్ కార్మికులకు 12 గంటల పనిదినం సర్వసాధారణంగా మారింది. దీన్ని శాశ్వత కార్మికులు, వారి సంఘాలు పట్టించుకోకపోతే నెత్తురు మరిగిన పులి అక్కడితో ఆగుతుందా? ఇప్పుడు అదే జరుగుతోంది మన దేశంలో!
మేడేలో విదేశీ వాసనుందనీ, తాము దాన్ని ఆఘ్రాణించని నిఖార్సయిన దేశవాళీ తాత్విక వారసులమనీ, అందుకే విశ్వకర్మ జయంతి జరుపుతామనే వారి గురించి ఒక్కమాట. తన కొడుకును వధించి అతని వెన్నుపూసతో వజ్రాయుధం తయారుచేసి తన యజమాని అయిన ఇంద్రుడికి బహూకరించాడట విశ్వకర్మ. యజమాని కోసం పుత్రుణ్ణి బలిచ్చినవాడి జ్ఞాపకార్థం జరిపేది ఒకటైతే, కార్మికుల మూలుగులు పీల్చే యాజమాన్యాల దౌష్ట్యాన్ని ఎదిరించేది మరొకటి. మేడే ఒక సజీవ ధార. 1886 నాటి రుధిర తర్పణల జపమే కాదు, మళ్ళీ పెచ్చరిల్లుతున్న పెట్టుబడి వేటని ప్రతిఘటించే ప్రణాళికల కదంబం మేడే! ప్రభుత్వరంగమంటే మ్యూజియమ్‌లో చూసుకునే జంతు కళేబరం కాదని మోడీ సర్కార్ కర్ణభేరి పగిలేలా కార్మికవర్గం అరవాల్సిన రోజు. అదానీ జేబులు నింపే ఆత్మనిర్భర్ కాదు. దేశాన్ని తన కాళ్లపై తనను నిలబెట్టే స్వావలంబన కోసం నినదించాల్సిన రోజు.
''పవిత్ర'' భారతదేశంలో యాజమాన్యాల దోపిడీతో పాటు కుల దోపిడీ, కుల వివక్ష విస్తారంగా ఉనికిలో ఉన్నాయి. కార్మికుల ఐక్యత కోసం శ్రమిస్తూ, సాధించిన ఆ ఐక్యతతో పెట్టుబడిపై నిరంతర యుద్ధంలో నిమగమైన ఒక కార్మిక సంఘం ఇటీవల చేసిన సర్వేలో చెత్త (స్వచ్ఛ) రిక్షా కార్మికుల వాడల్లోకి హమాలీ కార్మికులు రావడానికి నిరాకరించిన ఘటన వెలుగుచూసింది. అనేక మంది మధ్య తరగతి ఉద్యోగ కుటుంబాల్లో, ముఖ్యంగా దళితేతర కుటుంబాలవారు దళిత పని మనుషులు తోమిన బాసాన్లపై పసుపునీళ్లు చల్లి ఇంట్లోకి తీసుకెల్తున్న ఘటనలు బయల్పడ్డాయి. మున్సిపల్ కార్మికులకు హైదరాబాద్ నగరంలోనే అనేక చోట్ల మంచినీళ్లివ్వని సందర్భాలు, ఇచ్చినా పైనుండి పోస్తున్న సందర్భాలు, అదీ బాత్రూంలోని నీళ్లిస్తున్న సంఘటనలు కోకొల్లలు. అధునాతన మెట్రో పాలిటన్ నగరంలో సైతం కులం అడగకుండా ఇల్లు కిరాయికి ఇవ్వకపోవడం, ఫలానా కులానికి లేదా మతానికి అసలు ఫ్లాటే అమ్మననడం జరిగిపోతూనే ఉన్నాయి. ముస్లింల, దళితుల వెలివాడలు వెలుస్తూనే ఉన్నాయి. మరో కీలకాంశం లింగవివక్ష. సమానపనికి సమాన వేతన చట్టం ఉన్నా మహిళలకు తక్కువ వేతనం యధేచ్ఛగా సాగిపోతూనే ఉంది. మార్చి 8న పెద్ద పెద్ద డైలాగులు వల్లించే పాలకులు ఈ విషయాన్ని మాత్రం పట్టించుకోరు. కార్మికశాఖ దీని గురించి ఆలోచించదు. ఈ విషయంలో కనీసం కార్మికుల చైతన్యం ఏమిటి? దాన్ని పెంచడానికి కార్మిక సంఘాల కృషి ఏమిటి? పైన పేర్కొన్న కుల, మత, లింగ వివక్షలపై కనీసం చైతన్యవంతమైన కార్మిక సంఘాలైనా గళమిప్పకపోతే, పదం కదపకపోతే భారతదేశంలో కార్మికవర్గ ఐక్యత అసాధ్యం. ఢిల్లీ రైతు ఉద్యమం దారులు పరిచింది. తెగువ, పట్టుదల, మిలిటెన్సీలతో ముందడుగు పడాలి.
నేడు మనుధర్మం రాజధర్మమైంది. ''శంభూకుల''వేట సాగుతూనే ఉంది. పెట్టుబడి పైశాచికత్వం వికటాట్టహాసం చేస్తోంది. కార్మికవర్గంసవ్యసాచులై కదనరంగంలో దూకాలి. మిత్రవర్గాలను సమాయత్తం చేయాలి.