Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మా ఊరి మిరియాలు తాటికాయంతున్నాయంటూ'' మన రాష్ట్రంలో మంత్రులు, ఇతర నేతలు వాటిని 'అమ్ముకునే' పనిలో ఉన్నారు. ఒక అమాత్యుడేమో తమ అధినేతను 'జాతిపిత' అని ఆకాశానికెత్తితే, మరొక అమాత్యశేఖరుడు కార్మికులందర్నీ ధనవంతుల్ని చేయడమే కేసీఆర్ లక్ష్యం అంటాడు. ఇవన్నీ గులాబీ దళపతి కరుణా కటాక్ష వీక్షణాల కోసం పడే పడిగాపుల పర్యవసానం కావచ్చు. వాళ్ల నాయకుడు, వాళ్ల భజన, వాళ్లిష్టం అని సరిపెట్టుకుందామని అనుకున్నా సంకీర్తనల పర్వం అక్కడితో ముగియలేదు. రాష్ట్రంలో కార్మికులంతా సంతోషంగా ఉన్నారట! యువతకు కావల్సినంత పనిదొరుకుతోందట! ఇతర రాష్ట్రాల కార్మికులంతా ఇక్కడకొచ్చి పని దొరకబట్టుకుంటున్నారట! కార్మికులందర్నీ ధనవంతులను చేయడం కేసీఆర్ ఆలోచనట! విన్నవాళ్లు నోటితో నవ్వరనే విషయం వీరి గమనంలో లేకపోవడం మన ప్రారబ్దం!
రాష్ట్రంలో సమ్మెలు లేవు, ఉద్యమాల్లేవు, శ్మశాన ప్రశాంతత ఉందని మన నేతల తలపోత! 2022లో పెద్దగా రాష్ట్ర వ్యాపిత పోరాటాలు జరగని మాట నిజమే అయినా, అవి కార్మికుల కడుపు నిండి కాదు, సరళీకృత ఆర్థిక విధానాలు పదునుతేలాయి. పెట్టుబడి పైచేయి సాధించిందనే విషయం కార్మికులకు స్పష్టమవుతూనే ఉంది. జాబ్ మార్కెట్లో తన చుట్టూ ఉన్న నిరుద్యోగ సైన్యమూ కండ్లెదుటే ఉంది. ఈ నేపథ్యంలో ఉన్న ఉపాధిని కాపాడుకుంటూ తమ డిమాండ్లు సాధించుకోవాలనే దృష్టి కొందర్లో కనపడుతోంది. కాని ఉపాధికే భంగమేర్పడినప్పుడు కార్మికులు తెగించి పోరాడుతున్న పరిస్థితి స్పష్టంగా ఉంది. ఉద్యోగాలు పోయిన ఫీల్డు అసిస్టెంట్లు దాదాపు రెండు సంవత్సరాలు చేసిన పోరాటం ఈ మంత్రి పుంగవులకు కనపడలేదా? ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రిగారు వీరందర్నీ పనిలోకి తీసుకుంటామన్నారు. పాలాభిషేకాలు జరిగిపోయాయి. రెండు నెలలు గడిచిపోయినా వీరు రోడ్లపైనే ఉన్నారు. వీరి మనసుల్లో సంతోషం ఎక్కడినుంచి నింపుతారు మంత్రి వర్యా?! ప్రకటన చేశారు, జీఓ మరిచారు. 'తాళము వేసితిని, గొళ్లెము మరిచితిని' అన్నట్లు లేదా?! మధ్యాహ్న భోజన కార్మికులు 2009 నుండి వెయ్యి రూపాయల వేతనంతో బతుకు లీడుస్తున్నారు. వారి వేతనం రెండువేలు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు జీవోనే విడుదల చేయలేదు. రాష్ట్రంలో సుమారు 80వేల మంది పార్ట్‌టైమ్ కంటింజెంట్ ఉద్యోగులు 30ఏండ్ల నుండి రూ.1650లతో పనిచేస్తున్నారు. వారి మొహాల్లో సంతోషం కనపడుతుందా మంత్రి గారూ? రాష్ట్రంలో కోటిమందికి పైగా షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు పెంచి ఉంటే ఒక్కో కార్మికుడికి వేతనం కొంత సంతృప్తిగా ఉండేది కదా! షాప్ యాక్ట్ జీఓ 116 2007 నుంచి సవరించబడలేదు. ప్రతి ఐదేండ్లకొకసారి సవరిస్తే ఒక సేల్స్ మెన్ కేటగిరికి నాడు రూ.4520 ఉన్న వేతనం 2012కి రూ.6,952, 2017కి రూ.9,390, 2022కి రూ.11,572లు అయివుండేది. ఇది కేవలం వీడీఏని బేసిక్‌లో కలిపితే వచ్చినదే. అదనంగా 15శాతం పెంపుదల ఇస్తే కనీసం బేసిక్ రూ.17,072లు దాటి వస్తుంది. కార్మికుల్ని సంతోషంగా ఉంచడం అంటే ఇది మంత్రిగారూ! రాష్ట్రంలోలో గూగుల్, అమెజాన్లు వచ్చాయని చెప్పుకునే నేతలు మూతబడే ఫ్యాక్టరీల గురించి ఏమంటారు? వాటిలో ఉండే కొలువుల సంగతేమిటి? స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎంవియాక్ట్ సవరణ చట్టం వల్లనే మన టీఎస్ఆర్టీసీ ఇబ్బందుల పాలువుతున్నది. జిమ్మిక్కులు ఆపి కేంద్ర తెచ్చిన ఈ సవరణపై మన రాష్ట్రం ప్రభుత్వం యుద్ధం చేస్తుందా? చేయదా? తేల్చుకోవాలి. లేకుంటే ఆర్టీసీ కార్మికులు కడగండ్ల పాలవుతారు. దాదాపు అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాధాన్యతలను నిర్ణయించుకోవాలి. కేంద్రంపై యుద్ధానికి సిద్ధమవ్వాలి.
సరళీకృత ఆర్థిక విధానాలు ముదిరి పాకానపడ్డాయి. దాన్లో భాగమే వనరులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో బందీ అవుతున్నాయి. వివిధ స్కీమ్‌ల్లో పనిచేసే కార్మికులకిచ్చే మొత్తం క్రమంగా మోడీ సర్కార్ కోతపెడుతోంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల్లో బహిర్గతం చేయకుండా, చేసి కేంద్రంతో పోరాడకుండా రాష్ట్రాభివృద్ధి అసాధ్యం. కార్మికులు సంతోషంగా ఉండాలంటే ఇది తప్పనిసరి. యువతకు రాష్ట్రంలో పుష్కళంగా ఉద్యోగాలు దొరుకుతున్నాయని డబ్బా వాయించే మంత్రులు సర్వశ్రీ జూనియర్గారు గ్రామీణ ఉపాధిలాగే పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని మోడీ సర్కార్‌కు ఎందుకు విజ్ఞప్తి చేశారో!?
2022 మే ఒకటికే సమ్మెల్లేవు రాష్ట్రంలో అని పొంగిపోవద్దు అమాత్యా! కార్మికులు సంతోషంగా లేరు. కష్టాలను బాధలను దిగమింగుకుని వెళ్లదీస్తున్నారు. అది తుపాను ముందరి ప్రశాంతతే! మోడీ సర్కార్ చేస్తున్న ప్రయివేటీకరణ, వేతనాల్లో కోత, కాంట్రాక్టు క్యాజువల్ కార్మికుల పెరుగుదల ఇవన్నీ వెరసి ఎప్పుడో భగ్గుమని మండుతాయి. జరపైలం సార్లూ...!