Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంటలను కొనుగోలు చేయాల్సిన కేంద్రం తన బాధ్యత నుంచి క్రమక్రమంగా తప్పుకుంటున్నది. ఉప్పుడు బియ్యం కొనేది లేదంటూ అది మొండికేసింది. ఈ క్రమంలో ధాన్యం కొనుగోళ్ల బాధ్యతను భుజానేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం... సరైన సమయంలో చాలినన్ని కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఈ అంశంలో విపరీతమైన తాత్సారం.. నిర్లక్ష్యం చోటు చేసుకోవటంతో అన్నదాతకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆరుగాలం శ్రమించిన అతడు మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోవటంతో అరిగోస పడుతున్నాడు. ఈ మొత్తం ప్రక్రియలో కేంద్రానిది బాధ్యతారాహిత్యమైతే... రాష్ట్ర ప్రభుత్వానిది ముందుచూపు లేనితనం.
వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ ధాన్యం కొనుగోళ్ల బాధ్యతను భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) నిర్వర్తించింది. అయితే ఆయన సీఎం అయ్యాక... ఎఫ్సీఐ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించటం లేదనీ, అందువల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని భావించారు. ఆ క్రమంలో కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా, సులభంగా, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సాగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను తన భుజానేసుకుంది. అప్పటి నుంచి ఐకేపీ కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా కొనుగోళ్లు ప్రారంభ మయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అదే ప్రక్రియ కొనసాగింది. ప్రస్తుత యాసంగిలో మొత్తం 6,812 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించిన టీఆర్ఎస్ సర్కార్... ఇప్పటి వరకూ అందులో సగం కూడా ఏర్పాటు చేయలేదు. ఇటీవల రైతు సంఘాల నేతల క్షేత్రస్థాయి పర్యటనలో తేలిన వాస్తవమిది. మరోవైపు అకాల వర్షాలొచ్చినప్పుడు ధాన్యం తడవకుండా చూసేందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు కూడా మృగ్యమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి వేగంగా స్పందించి, అంతే వేగంగా చాలినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటం, ఫలితంగా వేగంగా సాగాల్సిన ధాన్యం సేకరణ మందకొడిగా సాగటం... వెరసి ధాన్యాన్ని కల్లపు నీళ్లలోనూ, రైతును నష్టాల్లోనూ నట్టేటా ముంచాయి. తగినన్ని టార్పాలిన్లను అందించటంలో కూడా సర్కార్ విఫలమైందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 15 కోట్ల గోనె సంచులు అవసరమైన చోట... ఈ రోజుకి కూడా ఏడు కోట్ల సంచులు అందించలేకపోవటం ముమ్మాటికి సర్కారు వైఫల్యమే. అలాంటప్పుడు ధాన్యం సేకరణ వేగంగా, సజావుగా ఎలా సాగుతుందనేది ఇప్పుడు మనందరి ముందున్న ప్రశ్న.
ఇది ప్రకృతి వల్ల, సర్కారు ఉదాశీనత వల్ల అన్నదాతకు కలిగిన నష్టమైతే... కొనుగోలు కేంద్రాలు, మధ్య దళారుల దందా వల్ల మరో రకంగా అన్నదాత నష్టపోతున్న వైనం విస్మయ పరస్తున్నది. ధాన్యాన్ని అమ్మేంత వరకు అతడికి బాధ్యత ఉంటుంది. ఈ క్రమంలో క్వింటాల్ ధాన్యానికి... మట్టి పెళ్లలు, వంకర గింజలు, తాలు పేరిట ఏడు కిలోల వరకూ తరుగు తీయటం ఆనవాయితీ. ఆ విధంగా తీసినా కూడా మద్దతు ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నది నిబంధన. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని అనేక మార్కెట్లలో ఆయా నిబంధనలకు తూట్లు పొడుస్తూ 40 కేజీల బస్తాకు కూడా రెండు కిలోల మేర తరుగు తీయటం విస్తుగొలిపే అంశం. ఇప్పుడు మొత్తం వరి కోతలన్నీ యంత్రాల ద్వారానే కొనసాగుతున్న క్రమంలో మట్టిపెళ్లలు, తాలనే ఊసే ఉండదు. కానీ అవి లేకపోయినా దళారులు తరుగు తీస్తుండటమనేది అన్నదాతను మోసం చేయటం కాక మరేమిటి...? దీంతోపాటు కొనుగోళ్లు పూర్తయిన వెంటనే రెండు మూడు రోజుల్లోగా రైతులకు బిల్లులు చెల్లిస్తే... వారు అప్పులు తీర్చుకోవటానికి, మళ్లీ పంటకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు సమకూర్చుకోవటానికీ ఆస్కారముంటుంది. కానీ ఇక్కడ కూడా విపరీతమైన జాప్యం చోటు చేసుకుంటుండటంతో రైతులు దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. ఆలస్యంగా చెల్లించే బిల్లుల్లో కూడా మళ్లీ ఐదు శాతం తరుగు పేరుతో తగ్గిస్తున్నారంటే... దీన్ని దోపిడీకి పరాకాష్ట అనక తప్పటం లేదు.
ఈ క్రమంలో ఇప్పటికైనా సర్కారు వారు... గతంలో ప్రకటించినట్టు చాలినన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. తద్వారా ధాన్యం సేకరణను వీలైనంతగా వేగిర పరచాలి. తడిసిన వడ్లను కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలి. పిడుగుపాటుకు గురై మరణించిన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియోనిచ్చి ఆదుకోవాలి. అప్పుడే అన్నదాత అకాల వర్షాలు మిగిల్చిన నష్టం నుంచి గట్టెక్కగలడు. లేదంటే అతడికి మళ్లీ తిప్పలు తప్పవు.