Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యా మూల్యం చెల్లించాల్సిందే, పుతిన్ అంతు తేల్చకుండా వదలం అన్నట్లుగా ఐరోపా కమిషన్ విరుచుకుపడింది. కోట్లాది మంది నిరాశ్రయులైన వారి గురించి, వివాద పరిష్కారం గురించి ఆలోచించకుండా, ఇలా విరుచుకుపడటం సమస్యను మరింత ఎగదోయటం తప్ప మరొకటి కాదు, మరిన్ని ఆంక్షల అమలు అంత సులభం కాదని తెలిసినా తప్పదన్నట్లు కమిషన్ అధ్యక్షరాలు ఉజులా వాండర్ లెయన్ ఊగిపోతున్నారు. అమెరికా, ఐరోపా ధనిక దేశాల పంతానికి తాము బలికావాల్సి వస్తుందేమో అన్న భయం కొన్ని తూర్పు ఐరోపా దేశాల్లో వెల్లడవుతోంది.
ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో బుధవారం నాడు జరిగిన ఐరోపా పార్లమెంటు సమావేశంలో వెల్లడించిన కమిషన్ ప్రతిపాదనను సభ్యదేశాలు ఆమోదిస్తే అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఈ ప్రతిపాదన ప్రకారం ఆరునెలల్లో రష్యానుంచి ముడి చమురు దిగుమతులను, ఏడాది చివరికి చమురు ఉత్పత్తుల దిగుమతులను పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. రష్యా నుంచి వెలువడే టీవీ, రేడియో ప్రసారాలను కూడా అడ్డుకుంటారు. పొమ్మనకుండా పొగబెట్టినట్లుగా తొలుత ఒక నెల రోజుల వ్యవధిలో రష్యా నుంచి ఇంథనాన్ని సరఫరా చేసే నౌకలు, బ్రోకరేజి, బీమా, ఆర్థిక సేవలను ఐరోపా కంపెనీలు నిలిపివేస్తాయి. ఇప్పటి వరకు అమలు జరిపిన ఆంక్షలలో ఇంథనాన్ని మినహాయించారు. ప్రతిపాదిత ఆంక్షలు అమల్లోకి వస్తే రోజుకు 35లక్షల పీపాల చమురు, చమురు ఉత్పత్తులు, ఏడాదికి 155బిలియన్ ఘనపు మీటర్ల గాస్ ఐరోపాకు నిలిచిపోతుంది. ఐరోపా అవసరాల్లో 40శాతం గాస్‌ను రష్యా తీరుస్తున్నది. ఇంత మొత్తాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాలు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవటం వెంటనే జరిగేది కాదు. ఒక వేళ ఇతర వనరుల నుంచి తెచ్చుకున్నా అందుకు చెల్లించాల్సిన అదనపు మూల్యం జనం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పలేం.
కొత్త ఆంక్షల అమలు ఎంతో కష్టం అని చెబుతూనే ఏది ఏమైనా తప్పదన్నట్లు ఐరోపా కమిషన్ అధ్యక్షరాలు ఉజులా వాండర్ లెయన్ ఐరోపా పార్లమెంటులో చెప్పారు. సముద్రం ద్వారా, పైప్‌లైన్, ముడి లేదా శుద్ధి చేసినదీ ఏ రూపంలోనూ, ఏ విధంగానూ అక్కడి నుంచి దిగుమతి చేసుకోరాదని, తద్వారా రష్యాపై గరిష్టంగా వత్తిడి తేగలమన్నారు. పుతిన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు విధించిన ఆంక్షలకు తోడు ఈ కొత్త ఆంక్షలు తమనేమీ చేయలేవని రష్యా చెబుతున్నది. ఇప్పటి వరకు ఇంథనంపై ఆంక్షలు లేవు కనుక చమురు ఎగుమతులు ఆగిపోతే దానికెంత నష్టమో, దిగుమతులు నిలిపివేసే ఐరోపా దేశాలూ అంతే నష్టపోవాల్సి వస్తుంది. ప్రత్యామ్నాయ వనరులను చూసుకున్నప్పటికీ ఇంటి పక్క నుంచి తెచ్చుకొనే దానికి సుదూరంగా ఉన్న పొరుగూరు నుంచి తెచ్చుకొనే దానికి ఉన్నంత తేడా ఉంటుంది. రవాణా, ఇతర ఖర్చులు తడిచిమోపెడై వినియోగదారుల మీద భారం పెరుగుతుంది. ఐరోపా తన చమురు అవసరాల్లో 25శాతం, చమురు ఉత్పత్తి డీజిల్‌ల్లో 14శాతం రష్యానుంచి సమకూర్చుకుంటున్నది. కమిషన్ ప్రతిపాదనపట్ల సుముఖత తెలుపుతూనే అనేక దేశాలు షరతులు పెడుతున్నాయి. తమకు రెండు మూడు సంవత్సరాల పాటు మినహాయింపులు ఇవ్వాలని బల్గేరియా, హంగరీ, చెక్, స్లోవేకియా చెప్పిినట్లు, లేకపోతే వీటో చేస్తామని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.
ఇప్పటికే తన ఆయుధాలను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ ఐరోపా దేశాలను ఎగదోస్తున్న అమెరికా ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదన్నట్లుగా తన చమురు, గాస్ పట్ల వ్యవహరిస్తుంది. ఇంథన సరఫరాలు తగ్గి పోటీ లేకపోతే పశ్చిమాసియా, అమెరికా, ఆఫ్రికాలోని చమురు ఉత్పత్తి దేశాలు ధరలను పెంచి సొమ్ము చేసుకుంటాయి తప్ప ఉదారంగా ఉండవు. ఐరోపా కమిషన్ ప్రతిపాదన వెలువడగానే బ్రెంట్ రకం ముడి చమురు ధరలు గురువారంనాడు 114 డాలర్ల వరకు పెరిగాయి. రష్యా మీద ఆరవ విడత ఆంక్షలను అమలు జరపాలన్న ఐరోపా కమిషన్ నిర్ణయం అమెరికా నాయకత్వంలోని వర్తమాన ప్రపంచాధిపత్య రాజకీయాలలో నూతన అధ్యాయానికి నాంది పలికింది. ఎలాగైనా సరే తమకు లొంగని రష్యాను దెబ్బతీయాలనే కసి తప్ప అది ముందుకు తెచ్చే పర్యవసానాలు, పరిణామాల గురించి అమెరికా, ఐరోపా పెద్దలు ఆలోచించటం లేదు. దీన్ని బట్టి ఉక్రెయిన్-రష్యా వివాదాన్ని దీర్ఘకాలం కొనసాగించేందుకే పశ్చిమ దేశాలు నిర్ణయించినట్లు కనిపిస్తోంది.