Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచమంతా ఆకలితో అల్లాడుతోంది. అత్యంత ఆధునిక సమాజమని చెప్పుకుంటున్న ఈ కాలంలో కూడా అన్నార్తుల ఆక్రందనలను జయించలేకపోతోంది. నేటి ప్రజాస్వామ్య యుగంలో ఏ ఒక్క పేగూ ఆకలితో కాలిపోకుండా కాపాడుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత. కానీ ''ఘనమైన'' మన ప్రభుత్వాలు అది విస్మరించిన ఫలితంగా, నేడు సగానికిపైగా ప్రపంచం ఆర్థాకలితో అలమటిస్తోంది. ఆహార సంక్షోభంపై తాజాగా వెలువడిన ప్రపంచ నివేదిక (జీఆర్ఎఫ్సీ) ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ఎఫ్ఏఓ (ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ), ఈయూ (ఐరోపా సమాఖ్య)లు సంయుక్తంగా విడుదల చేసిన ఈ నివేదిక, ఈ అవనిపై ఆకలికేకలకు అద్దం పడుతోంది.
మితిమీరిన సంపద కేంద్రీకరణ, ఆయా దేశాల్లో నెలకొన్న ఘర్షణలు, ప్రకృతి ఉత్పాతాలే ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తుండగా, కోవిడ్ మహమ్మారి తెచ్చిపెట్టిన కష్టాలు ఈ ఆకలిని మరింత తీవ్రం చేసాయి. దీని నుండి తేరుకోకుండానే రష్యా, ఉక్రెయిన్ల యుద్ధం రూపంలో మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. ఫలితంగా ఈ క్షుద్బాధలు ఇంకా ఉధృతమవనున్నాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 40కోట్ల మందికి అవసరమైన ఆహారాన్ని ఉక్రెయిన్ ఉత్పత్తి చేస్తున్నది. ప్రపంచంలో 50శాతం పొద్దుతిరుగుడు నూనె, 13శాతం మొక్కజొన్నలు, 10శాతం ధాన్యాలు అక్కడి నుండే సరఫరా అవుతాయి. కానీ యుద్ధం కారణంగా 30శాతం ఉక్రెయిన్ భూముల్లో పంటలు నిలిచిపోయాయి. మరోవైపు నల్లసముద్రంలోని నౌకాశ్రయాల నుంచి కూడా సరుకుల రవాణాఆగిపోయింది. ఫలితంగా వంట నూనెల ధరలు మంటలై మండుతుండగా, గోధుమల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇది పరిస్థితుల్ని మరింత దారుణంగా మారుస్తుందనడంలో సందేహంలేదుగానీ, పెట్టుబడికి బానిసలైన ప్రభుత్వాలకు ఇదేం పట్టకపోవడం అంతకుమించిన దారుణం.
ఈ జీఆర్ఎఫ్సీ నివేదిక ప్రకారం ఇప్పటికే 39దేశాలు గత ఆరేండ్లుగా వరుసగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ జనాభాలో అత్యధికులు పేదరికం, అర్థాకలితో అలమటిస్తున్నారు. 53 దేశాల్లో 19.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. కేవలం ఇధియోపియా, దక్షిణ సుడాన్, దక్షిణ మడగాస్కర్, యెమెన్లలోనే 57 లక్షలమంది భయంకరమైన క్షుద్బాధలు అనుభవిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా గతేడాది ప్రపంచంలోని ఈ అన్నార్తుల సంఖ్య అదనంగా మరో నాలుగు కోట్లు పెరిగింది. ఇప్పుడు పులిమీద పుట్రలా రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు పరిస్థితులను మరింత జటిలం చేస్తున్నాయి. ప్రపంచ దేశాలు వెంటనే తేరుకుని తగిన చర్యలు తీసుకోకుంటే సగం ప్రపంచం ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంటుందని నివేదిక హెచ్చరిస్తోంది.
ఈ ఆకలి మహమ్మారి మన దేశంలోనూ కోరలు చాస్తుండటం విస్మరించలేని నిజం. కానీ, భారతదేశం ప్రపంచానికే ఆహారం అందించేందుకు సిద్ధంగా ఉందని ఇటీవల ప్రధాని ప్రకటించారు. ప్రకటనయితే బాగానే ఉందిగానీ, ప్రపంచ ఆకలి సూచీలో మన స్థానం 116లో 101వ దని ఆయన మరిచిపోవడమే బాధాకరం. ప్రపంచంలో తీవ్రమైన ఆకలి రాజ్యాలు 31 ఉండగా, అందులో భారత్ కూడా ఒకటని ఈ ఆకలి సూచీ కుండబద్దలుకొట్టింది. భారత ప్రజల రోజువారీ ఆహారంలో 70శాతం తగ్గిందని ఆక్స్ఫామ్ నివేదికలు సైతం స్పష్టం చేసాయి. ఇక ప్రస్తుతం పెట్రోల్ ధరలు, నిత్యావసరాలు భగ్గుమంటుండగా, అసంఖ్యాకులైన సామాన్యులు విలవిలాడుతున్నారు. ఇలా పట్టెడన్నం కోసం పరితపించే అభాగ్యుల సంఖ్య ప్రపంచమంతా పెరిగిపోతుండటం నేటి మహావిషాదం. సమాజ పరిణామంలోనే అత్యున్నత దశగా చెప్పుకుంటున్న ఈ ఆధునిక కాలంలో కూడా, ఈ ఆకలి ఇంకా అధిగమించలేని సమస్యగా మిగిలిపోవడానికి ఎవరిని నిందించాలి?
''ఈ మట్టిలో పుట్టిన ప్రతి మనిషికీ ఆహార లభ్యత కనీస హక్కు'' అంటారు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్. మరి నేటికీ పిడికెడు మెతుకులకు నోచని బతుకులు కోకొల్లలు..! ఎందుకు...? నిజానికి ప్రపంచంలో ఇప్పటికే ఉత్పత్తి అయి చలామణిలో ఉన్న సంపద కొన్ని వేల ట్రిలియన్ డాలర్లు ఉంటుంది. అది ప్రపంచ జనాభా అంతా కాలుమీదకాలేసుకుని తిన్నా కొన్ని వందల సంవత్సరాలకు సరిపోతుంది. ఈ సంపద రోజు రోజుకూ పెరిగినంత వేగంగా జనాభా పెరగటం అసాధ్యం. అసలు ఉన్న సంపదను వాడుకోకుండానే అది ఏటా ఉత్పత్తి చేసే సంపదే ప్రపంచ జనాభాకు కడుపునిండా అన్నం పెడుతుంది. మరి ఇంత సంపద ఉంది కదా..! ఇంకా ఆకలి ఎందుకుంది..? ఇప్పుడు ప్రపంచం ఆకలి తీర్చగలిగేది ఈ ప్రశ్నకు సమాధానం మాత్రమే.