Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమకు పరిణామంలో కొన్ని రోజులు మిగిలాయి. అందులో అమ్మకూ ఓ రోజు స్థిరపడింది. ఒక రోజుయినా అమ్మను తలచుకోవటానికి మిగిలినందుకు సంతోషించుదామా! 364 రోజులూ ప్రేమ విస్మరణకు దిగులుపడదామా! వీటన్నిటి చర్చకు ఇప్పుడు తావేలేదు. అమ్మలందరూ తమ జీవితపు చివరి పేజీలను తిరగేసే పనిలో నిమగమయ్యే ఉన్నారు. తమ తమ పిల్లల భవిష్యత్తు పట్ల నిత్య బెంగతో నిష్క్రమిస్తున్నారు. పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నట్టుగానే అమ్మలకు, నాన్నలకు వృద్ధాశ్రమాలు విరివిగా పెరుగుతున్నాయి. లేదంటే వీధుల్లో నివాసాలేర్పడుతున్న తరుణంలో అమ్మ ప్రేమకు జోహార్లు, అమ్మలగన్న అమ్మలకు జేజేలు.
నిజంగా అమ్మ అనే మాట ఎంతో తీయనైనది. ప్రేమకు ప్రతిరూపమైనది. 'ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం! ఎవరు పాడగలరు అమ్మ అను అనురాగం కన్న తీయని రాగం! అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకీ, అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి' అని సినీగీత రచయిత వర్ణించాడు. ఇలా అమ్మను పొగిడే, గొప్పతనాన్ని కీర్తించే గీతాలు ఎన్నో ఉన్నాయి. మన భౌతిక శరీరానికి ఏ చిన్న గాయమైనా, నొప్పి కలిగినా, మనసుకు నొప్పికలిగినా 'అమ్మా' అనే శబ్దాన్నే పలుకుతాము. అమ్మే ఆదుకునే సహాయి. ఎందుకంటే పుట్టుక నుండి మోసి, పుట్టింతర్వాత సకల సేవలూ చేసే శ్రమకజీవి అమ్మ. ఏ ఫలాన్ని ఆశించకుండా ఇచ్చే శ్రమనే అమ్మ. కుటుంబ వ్యవస్థలో అధికారిక సేవకురాలు అమ్మ. విశ్రాంతిలేని శ్రమ జీవి ఆమె. అందుకే ఆమె మీద చాలా వరకు ప్రకటించేది జాలి మాత్రమే, ప్రేమ కాదు. ఎందుకంటే గెయిన్డ్ పీపుల్ వద్దనే అవసరమైనంత జాలి, దయలుంటాయి. పోగొట్టుకున్న వాళ్లది 'ప్రేమ'గా పిలువబడుతుంది. కుటుంబ సంబంధాలలో ప్రేమ అనే భావనలో పడి కోల్పోతున్న జీవితమెంతో అమ్మలది. అమ్మలాలిస్తుంది. పాలిస్తుంది. మనిషిగా నిలబెడుతుంది. చాకిరీకి యజమానురాలై జీవితాంత స్వేదం ధారపోస్తుంది. పిల్లల పెంకంతోనే ఆగిపోదు ఆమె శ్రమ. పిల్లల పిల్లలకి కూడా అమ్మలే సేవలు చేయాలి. ఇప్పుడు పిల్లలందరూ విదేశాల్లో డాలరు సంపాదనల్లో మునిగిపోయి ఉన్నారు. వారికి పిల్లల్ని కనే తీరికకూడా చాలా కష్టం మరి! కన్నాక ఇక్కడి ప్రేమగల అమ్మలకి ఫ్లైటు టికెట్లు బుక్కయిపోతాయి. అరవైయేండ్లు దాటాక కూడా అమ్మ ప్రేమఉద్యోగం విరమణ లేకుండా పొడిగించబడుతూనే ఉంటుంది. ఇక ఉద్యోగం విరమణ అనివార్యం కాగానే, మంచం ఆశ్రయమివ్వగానే, సొంత పిల్లల 'అమ్మా' అనే పిలుపు కోసం ఎదురు చూస్తూ అలా మూలుగుతూ ఉండాల్సిందే.
ఎందుకిలా పరిణమిస్తోంది. ఒక అమ్మపట్లనే కాదు, కుటుంబ సంబంధాలలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వస్తు వినిమయదారీ తత్వంలో మనిషిని ముంచేసాక అన్నీ వినిమయ విలువలే మనసును ఆక్రమిస్తాయి. అమ్మను చూడటానికి, మాట్లాడటానికి, ప్రేమతో పలకరించటానికి బదులుగా కొన్ని డాలర్లు ఖర్చు చేస్తే చాలనే మార్కెట్ సంప్రదాయం మానవ సంబంధాల్లోకి వచ్చింది. అందుకే చావును కూడా వీడియో దర్శనం చేసుకుని మనసుకు తృప్తినందిస్తున్నారు విదేశాల్లోని పిల్లలు. అంటే ప్రతిదీ డబ్బుతో కొనేదిగా, అనుభవించేదిగా, తృప్తిపడేదిగా మారిపోయింది. అందులో ప్రేమ కూడా. దీనికి కారణం ప్రపంచంలో పెట్టుబడి సృష్టిస్తోన్న సాంస్కృతిక హీన భావజాలం. అందుకే అనుబంధాలన్న ఆర్థిక వ్యవహారాలైపోతున్నాయి.
చాలా వరకు అమ్మలు భౌతికవాదులు. ఎందుకంటే వాళ్లు ఆచరణయుత జీవితాన్ని సాగిస్తారు. కేవలం భావాలలో విహరించరు. పిల్లల మనస్తత్వాలు మారుతున్న విషయం వాళ్లకే బాగాతెలుసు. కానీ క్షమాగుణం కలిగిన మానవీయలు. అమ్మల్లో ప్రేమా అనురాగలతో పాటే విప్లవ భావాలూ మెండుగానే ఉంటాయి. మనం చేయవలసిన కర్తవ్యాన్ని బోధిస్తారు కూడా. అలా తమ పిల్లలను వీరులుగా, ధీరులుగా తయారుచేసిన అమ్మల చరిత్ర చాలా ఉంది. మాక్సింగోర్కీ సృష్టించిన 'అమ్మ' నవలలోని అమ్మ పాత్ర ప్రపంచానికంతటికీ ఆదర్శమైనిలిచింది. ఈ సమాజానికి అలాంటి అమ్మల అవసరం నేడున్నది. అమ్మ మనసులాంటిది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అమ్మ మనసంటే బాధ్యత వహించగలగటమే. కర్తవ్య నిర్వహణే. అమ్మంటే కన్నీళ్లను తుడిచేకొంగు స్పర్శ. బాధను హత్తుకునే ఓదార్పు ఆలింగనం. దారీతెన్నూలేని చోట చేరదీసే నిండైన ఒడి అమ్మ. అలాంటి అమ్మలను కూడా నిరాశ్రయులను, అనాధలను చేస్తున్న సమాజ దుష్టత్వాన్ని అమ్మ మనసుతోనే పారద్రోలగలము, తరిమివేయగలము. అమ్మలను కాపాడుకోవాలి. మానవీయ సంబంధాలను నిలబెట్టుకోవాలి. ఒక్కరోజును కేటాయించికాదు. రెండు మాటలు పేర్చి కాదు. గుండెనిండా బాధ్యతతో. ప్రేమలు నిత్యం పండించుకోవాలి.