Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అప్పు చేసి పప్పు కూడు.. అప్పు స్నేహానికి ముప్పు...' తరచూ మనం వినే ఇలాంటి సామెతలు, నానుడుల చుట్టూ ఇప్పుడు ప్రపంచం మొత్తం తిరుగుతున్నది. ఇంకా చెప్పాలంటే ప్రపంచ బ్యాంకు మొదలు పల్లెల్లో ఉండే గ్రామీణ సహకార బ్యాంకుల వరకూ అప్పులివ్వటం.. వాటిని తిరిగి రాబట్టటం ద్వారానే మనుగడను సాధిస్తున్నాయి. ఇదే టాపిక్కు మీద సోమవారం కేంద్రం, వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఒక సయోధ్య కుదుర్చుకునేందుకు వీలుగా దేశ రాజధాని హస్తినలో భేటీ అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు బాండ్లు విక్రయించటాన్ని నిలిపేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న దరిమిలా... సోమవారం నాటి ఆ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలో బాండ్ల విక్రయాల వల్ల రుణాలు స్వీకరించే అవకాశాన్ని రాష్ట్రాలు కోల్పోతాయి. ఇది తాత్కాలికమే అయినా ఆర్థిక సంవత్సరం మొత్తం మీదా దాని ప్రభావం పడుతుందంటూ ఆర్థిక విశ్లేషకులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక్కడ లాజిక్కేమిటంటే... రాష్ట్రాలు ఇష్టానుసారంగా అప్పులు చేయటానికి, రుణాలు సంగ్రహించటానికి వీల్లేదంటూ కొర్రీలేస్తున్న మోడీ సర్కారు... తాను మాత్రం అడ్డూ అదుపు లేకుండా, యదేచ్ఛగా, లెక్కకు మిక్కిలిగా అప్పులు చేయటం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకూ (మోడీ అధికారంలోకి రాకముందు వరకూ) 67 ఏండ్ల కాలంలో దేశం మొత్తం అప్పులు రూ.55 లక్షల కోట్లుగా ఉంటే.. 2014 నుంచి ఇప్పటి దాకా, అంటే కేవలం ఎనిమిదేండ్ల కాలంలో రూ.97లక్షల కోట్ల మేర మనం అదనపు అప్పులు చేశాం. వెరసి భారతావని అప్పుల కుప్ప రూ.కోటి 52 లక్షల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో రూ.97లక్షల కోట్ల మేర అప్పులు చేసిన ఘనాతి ఘనమైన బీజేపీ సర్కారు... దేశానికి చేసిన మేలేమైనా ఉందా..? అంటే అదీ లేదు. మోడీ గారు చెప్పినట్టు నల్లధనం వెనక్కి రాలేదు, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు లేకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నారు. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రో ధరల వల్ల అన్ని నిత్యావసరాల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఇదే సమయంలో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న బడా బాబులు ఎగ్గొట్టిన రూ.11 లక్షల కోట్లకు లెక్కే లేదు.
ఇంతలా అప్పులు చేస్తూ, గొప్పలకు పోతూ, జనాన్ని తిప్పలు పెడుతున్న కేంద్రం... ఇప్పుడు రాష్ట్రాలకు నీతులు చెబుతుండటం దెయ్యాలు వేదాల వల్లించిన చందంగా ఉంటున్నది. రుణాలకు సంబంధించి రాష్ట్రాలు వివరాలు అందజేయాలి, అప్పులు తీర్చేందుకు ఉన్న వనరుల గురించి అవి చెప్పాలంటూ అడుగుతున్న మోడీ సర్కారు...ఇదే విషయంలో తన పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ఒక్కసారి పరిశీలించుకుంటే బెటర్. ఫిస్కల్ రెస్పాన్సిబులిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్బీఎమ్) చట్టం మేరకు రాష్ట్రాలకు జీఎస్డీపీలో 3.5శాతం మేర రుణ పరిమితి (అప్పులు చేసుకునే వెసులుబాటు) ఉండేది. కరోనా నేపథ్యంలో దాన్ని నాలుగు శాతానికి (2022-23 ఆర్థిక సంవత్సరం వరకే) పెంచిన విత్తమంత్రి నిర్మలమ్మ... అదేదో పెద్ద ఘన కార్యంలాగా చెప్పుకొంటున్నారు. వాస్తవానికి కేంద్ర పన్నుల్లోంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటాలు, జీఎస్టీ పరిహారాలు, వెనుకబడిన జిల్లాలు, ప్రాంతాలకు ఇచ్చే నిధులు, గ్రాంట్లను కేంద్రం పూర్తి స్థాయిలో, సకాలంలో విడుదల చేస్తే రాష్ట్రాలకు అసలు ఇలా అప్పులు చేయాల్సిన అగత్యమే ఉండదు కదా..? ఒకవేళ ఉన్నా... పెద్ద మొత్తంలో రుణాల కోసం వెంపర్లాడే దుస్థితి తలెత్తదు కదా..? కానీ ఆయా నిధులను విడుదల చేయటంలో కేంద్రం వైఖరి.. దున్నపోతు మీద వానపడిన చందంగా ఉంటున్నదనటంలో ఎవరికీ, ఎలాంటి సందేహమూ అక్కర్లేదు.
మరోవైపు సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్టుగా... రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ 'అన్నింటికీ అప్పులే...' అనే విధంగా వ్యవహరించటం 'బంగారు తెలంగాణ' అనే నినాదంలోని డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలతో నానాటికీ పెనవేసుకుపోతున్న 'రుణానుబంధం'... మనది ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమనే ఊకదంపుడు ఉపన్యాసాలు, పైన పటారం.. లోన లొటారంలా ఉన్నాయని చెప్పకనే చెబుతున్నది. అందువల్ల పరిమితికి మేర అప్పులు చేయటం సబబే అయినా.. ఆ తీసుకొచ్చిన అప్పుల్ని పప్పు బెల్లాల్లా కాకుండా పరిశ్రమలు, ఉపాధి, మౌలిక వసతుల కల్పన మీద ఖర్చు పెడితేనే రాష్ట్రానికి ఉపయోగం. లేదంటే ఇప్పటి అప్పు... భవిష్యత్ తరాలకు పెనుముప్పు కాకతప్పదు.