Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త ఆర్థిక సంవత్సరం తొలి మాసంలో భారత వస్తూత్పత్తి రంగంలో ముఖ్యంగా వినియోగ వస్తువుల తయారీలో ఎలాంటి పురోగతి లేదని తాజా సర్వే వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థ నేడు ఎదుర్కొంటున్న వాస్తవిక పరిస్థితికి ఈ సర్వే దర్పణం పడుతున్నది. ఆర్థిక మాంద్యం, ఆ పై, కోవిడ్ మహమ్మారి విరుచుకుపడడంతో ఛిద్రమైన ప్రజల జీవితాలు కొత్త ఆర్థిక సంవత్సరంలోనైనా మెరుగుపడతాయని ఆశించినవారికి ఈ తొలి సంకేతాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒక పక్క విపరీతంగా పెరిగిపోతున్న ధరలు, మరో పక్క పడిపోతున్న నిజ వేతనాలు, అంతులేని నిరుద్యోగం ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎస్ అండ్ పి గ్లోబల్ ఇండియా మ్యానుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ) సర్వే వెల్లడించిన అంశాల్లో ప్రధాన మైనది వినియోగ వస్తువుల తయారీ రంగం ఇప్పటికీ నేల చూపులు చూడడం. బిజినెస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌లో కొంత మెరుగుదల ఉన్నప్పటికీ స్థూలంగా చూసినప్పుడు ఇప్పటికీ చాలా కంపెనీలు ముఖ్యంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు కష్టాల్లో కొట్టు మిట్టాడుతూనే ఉన్నాయి. వాటి ఉత్పత్తి కార్య కలాపాలు మామూలు సామర్ధ్య స్థాయికి చేరుకోడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది.
ఉత్పత్తి సామర్థ్యం పెరగకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడవు. ఉత్పత్తి పెరగాలంటే మార్కెట్లో సరకులకు గిరాకీ పెరగాలి. మార్కెట్లో వినియోగ వస్తువులకు గిరాకీ పెరగాలంటే ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పెరగాలి. అదే ఇప్పుడు లోపించింది. దీనికి అధిక ద్రవ్యోల్బణం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, నిజ వేతనాలు పడిపోవడం ముఖ్య కారణాలు. ఓ ఆర్థిక వేత్త చమత్కరించినట్లుగా ద్రవ్యోల్బణం అనేది చట్టంతో నిమిత్తం లేకుండా ప్రజలపై సాగించే పన్నుల దాడి. దీని ప్రభావం ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది. ప్రత్యేకించి పేదలు, మహిళలపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగితే ఆ భారాన్ని కంపెనీలు భరించవు. వాటిని వినియోగదారులపైకే నెట్టివేస్తాయి. ఇలా అన్ని వైపుల నుంచి మోపుతున్న భారాల నుంచి ప్రజలకు ఊరట కలిగించడానికి బదులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు, యూజర్ ఛార్జీలు, సెస్సులు, సర్‌చార్జీలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీలను పెంచుతూ వారి నడ్డి విరుస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత నలబై రోజుల్లో 14సార్లు పెంచింది. ఉక్రెయిన్ సంక్షోభాన్ని సాకుగా చూపి వంట నూనెలు, ఆహార వస్తువుల ధరలు మండుతున్నాయి. గత పన్నెండు నెలలుగా 10శాతంగా కొనసాగుతున్న టోకుధరల సూచి 2022 మార్చిలో 14.5శాతానికి చేరుకుంది. ధరల పెరుగుదల పాపం రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నట్టు ప్రధాని మాట్లాడుతున్నారు. ఇంతకన్నా బాధ్యతారాహిత్యం ఏముటుంది? మరో వైపు పారిశ్రామిక మాంద్యం నుంచి బయటపడేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కోవిడ్ సమయంలో ప్రకటించిన 21లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ప్రజలకు ఇచ్చింది ఒక శాతం మాత్రమే. తక్కినదంతా ఈ ప్రభుత్వం కార్పొరేట్లకే దోచిపెట్టింది. ఎంఎస్ఎంఇలకు ఇచ్చిందీ అత్యల్పమే. ఇటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాల ప్రభావం జీడీపీపై కూడా పడింది. ఈ ఆర్థిక సంవత్సరం 9శాతం దాకా ఉండొచ్చనుకున్న జీడీపీ అంచనాలు తలకిందులయ్యే పరిస్థితి నెలకొంది. ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్‌లు మన జీడీపీ 7.5శాతానికి మించకపోవచ్చని అంచనా వేశాయి. కోవిడ్ మహమ్మారికి ముందున్న స్థితికి మన ఆర్థిక వ్యవస్థ తిరిగి చేరుకోడానికి మరో పది సంవత్సరాలు పట్టవచ్చని చెప్పాయి.
ఈ పరిస్థితి మారాలన్నా, ప్రజల కష్టాలు తొలగాలన్నా ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను తిప్పికొట్టడమొక్కటే మార్గం. ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను మరింత ఉధృతం చేసేందుకు కార్మికవర్గం సంఘటితం కావాలి. వీరి మధ్య ఐక్యతను దెబ్బ తీసేందుకు సంఫ్‌ు పరివార్ మూకలు బీజేపీ ప్రభుత్వాల అండతో యథేచ్ఛగా విద్వేషపు దాడులకు దిగుతున్నాయి. దేశ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్పొరేట్-మతతత్వ కూటమికి వ్యతిరేకంగా ఉద్యమించాలి.