Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రారాజునంటూ విర్రవీగిన ధుర్యోధనుడు ప్రాణాలు కాపాడుకొనేందుకు మడుగులో దాగినట్టుగా ఉంది. శ్రీలంకలో ఒక వెలుగు వెలిగిన మహింద రాజపక్స పరిస్థితి. అక్కడ తలెత్తిన ఆర్థిక సంక్షోభం రాజకీయ కల్లోలానికి దారి తీసి, ప్రధాని పదవికి రాజీనామా చేసి, పారిపోయి ట్రింకోమలి నౌకా కేంద్రంలో దాక్కొని ప్రాణాలు కాపాడుకోవాల్సి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. సింహళ హృదయ సామ్రాట్టుగా నీరాజనాలందుకున్న మహింద చివరికి ఆ సింహళీయుల ఆగ్రహానికే గురయ్యాడు. హింసాకాండకు పాల్పడేవారిని కనిపిస్తే కాల్చివేస్తామంటూ భద్రతాదళాలు ఒక వైపు వీధుల్లోకి వస్తే... మరోవైపు రాజపక్స, అతని మద్దతుదారులు కనిపిస్తే చంపేస్తామంటూ ఆగ్రహౌదగ్రులైన జనం తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వార్తలు రావటం అక్కడి పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది. ప్రధానిగా మహిందే కాదు, అధ్యక్షుడిగా ఉన్న సోదరుడు గొటబయ రాజపక్స, మొత్తం ప్రభుత్వమే దిగిపోవాలని జనం కోరుతున్నారు. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియని నివురు గప్పిన నిప్పులా లంక ఉంది. ప్రత్నామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావటం లేదు. గొటబయ కూడా గద్దె దిగి జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమా, తక్షణమే ఎన్నికలు జరపటమా ఏం జరుగుతుందో తెలియదు.
యాభై బిలియన్ డాలర్ల విదేశీ అప్పులు, ఈ ఏడాది తీర్చాల్సిన నాలుగు బిలియన్ డాలర్ల కిస్తీల చెల్లింపుల సమస్యకు తోడు, నిత్యావసరమైన ఆహారం, చమురు వంటి వాటిని దిగుమతి చేసుకొనేందుకు చేతిలో ఒక్క డాలరు కూడా లేని స్ధితిలో కొద్ది నెలలుగా శ్రీలంక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఈ స్థితిలో సంక్షోభాన్ని అధిగమించటానికి తీసుకుంటున్న చర్యలను వివరించి జనానికి విశ్వాసం కలిగించటంలో రాజకీయ నాయకత్వం విఫలమైంది. రాజపక్స కుటుంబం తమ చేతి నుంచి అధికారం జారకుండా చూసుకొనేందుకు చూపిన శ్రద్దను జనాగ్రహాన్ని తీర్చటం పట్ల ప్రదర్శించలేకపోయింది. ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించలేని పాలకులు గద్దె దిగాలన్న ప్రజల డిమాండ్ సమర్థనీయమే. దాన్ని మన్నించకపోగా అందుకోసం ఆందోళన చేస్తున్న వారి మీద మహింద రాజపక్స తన మద్దతుదారులను ఉసికొల్పి దాడులు చేయించేందుకు తెగించాడు. ఇది పరిస్థితి మరింత దిగజారటానికి దారితీసింది. ఎంపీలతో సహా అధికారపక్ష మద్దతుదారులను జనాలు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో జనంపై కాల్పులు జరిపిన ఒక ఎంపీ పారిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చివరికి జనం ప్రధాని మహింద రాజపక్స అధికారిక నివాసంపైకి దాడికి దిగటంతో, భద్రతా దళాలు దొడ్డిదారిన మహింద కుటుంబాన్ని తప్పించి సురక్షిత ప్రాంతానికి తరలించాయి. ఈ సందర్భంగా జరిగిన హింసాకాండలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా 220 మంది గాయపడినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆందోళనకారులు అనేక ఇండ్లు, వాహనాలను దగ్దం చేశారు.
శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి భారత ప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్రాలు, సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రభుత్వాలు పాఠాలు తీసుకోవాలని కొందరు చెప్పిన అంశం తెలిసిందే. వినదగునెవ్వరు చెప్పిన అన్నట్లు దాన్ని తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ లంకనుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో జాతి దురహంకారం, మైనారిటీలు మెజారిటీ జనాలకు లోబడి ఉండాల్సిందే అన్న ఉన్మాదం ఎలాంటి పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుందో కూడా గ్రహించాలి. సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా, ప్రధానిగా, ప్రతిపక్ష నేతగా పని చేసిన 76ఏండ్ల రాజపక్స శ్రీలంకలో సింహళ మెజారిటీ, జాతి దురహంకారాన్ని రెచ్చగొట్టటం, పెంచి పోషించటంలో ప్రధాన పాత్రధారి. తీవ్రవాద తమిళ టైగర్లను అణచివేసిన హీరోగా జనాల నీరాజనాలు అందుకున్నాడు. అధికారాన్ని తన కుటుంబ వ్యవహారంగా మార్చివేశాడు, అవినీతి అక్రమాలకు తెరలేపి అభాసుపాలయ్యాడు. పలు కారణాలతో జనం మత, మెజారిటీ దురహంకారాలకు లోనై వాటిని ఆలంబనగా చేసుకున్న రాజకీయశక్తులను కొంతకాలం పాటు అభిమానించవచ్చు, నెత్తికెత్తుకోవచ్చు. కానీ అది ఎల్లకాలం కొనసాగుతుందని భావిస్తే కుదరదని లంక పరిణామాలు స్పష్టం చేశాయి. సామాన్యజన ఆర్థిక, జీవన పరిస్థితులు దుర్భరంగా మారినపుడు ఉన్మాదాన్ని రెచ్చగొట్టిన శక్తులు అదే జనాగ్రహానికి లోనుకాకతప్పదని రాజపక్స ఉదంతం వెల్లడించింది. మన దేశంలోని హిందూ ''హృదయ సామ్రాట్టు''లకు ఇది అర్థం అవుతుందా!