Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గజం మిథ్య, పలాయనం మిథ్య' అనే శంకరాచార్యుల వారి ఫేమస్ కొటేషన్ బహుశా తెలియని వారుండరు. అద్వైత సృష్టికర్త ఏనుగులు రావడమూ మిథ్యే, తాను పలాయనం చిత్తగించడమూ మిథ్యే! అని తన కొంటె శిష్యుడి 'నోరు మూయించిన' సందర్భం అది! మనిషి నెత్తురు మరిగిన పులి తాను రోజూ గడ్డిపరకలే గతుకుతున్నానంటే నమ్మడానికి రాష్ట్ర ప్రజానీకం చెవిలో పూలు పెట్టుకుని లేరనే విషయం పెద్దసారుకి ఎవరైనా చెవిలోనైనా ముచ్చటించి పుణ్యం కట్టుకోవాలి!
వివిధ ప్రభుత్వ సంస్థల్లో జరిగే లోటుపాట్లను గుర్తించి, బహిర్గతం చేసి ప్రజల ముందుంచడం పత్రికల బాధ్యత. అది మరిచి భజనకి, సంకీర్తనకి భారతీయ మీడియా అలవాటు పడ్డదని అంతర్జాతీయంగా ఉన్న విమర్శ. గత సంవత్సరం డిసెంబర్లో ఒక పుస్తకా విష్కరణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ''వ్యక్తుల, సంస్థల సామూహిక వైఫల్యాలను మీడియా ఎత్తిచూపాల''న్నారు. టీఎస్ ఆర్టీసీలో జరుగుతున్న ''సామూహిక వైఫల్యాలనే'' నవ తెలంగాణ పేర్కొంది. నవతెలంగాణ బ్లాక్మెయిలింగు వార్తలు ప్రచురించదు. ధనాఢ్యవర్గాల కొమ్ము కాయదు. చెలం చెప్పినట్లు ''కాలికింద నలిగిన చీమల కాళ్లు విరిగిన చప్పుడు, నీళ్లు లేక ఎండి ఎండుతున్న గడ్డిపోచ ఆర్తనాదాన్ని వినిపించడ''మే నవతెలంగాణ లక్ష్యం.
బానిస సమాజం అంతరించి వేల సంవత్సరాలైంది. ఆధునిక కార్మికవర్గం మనదేశంలో గత ఆరేడు దశాబ్దాలుగా అనేక హక్కులనుభవించింది. ఇప్పుడు కాల చక్రాన్ని వెనక్కి తిప్పగలమని, కార్మికులను మళ్లీ బానిస యుగంలోకి తీసికెళ్లగలమని, వారిని ఆధునిక బానిసలుగా చేయగలమని భావిస్తే సాధ్యమయ్యే పనేనా?! 2019 డిసెంబర్లో రెండేండ్ల వరకు యూనియన్లంటిని సామూహికంగా ఉట్టి మీద చట్టిలో పెట్టి బిరడా బిగించారు మన ముఖ్యమంత్రి వర్యులు. వెల్ఫేర్ కౌన్సిళ్లే ఊత కర్రలన్నారు. డిపోలో సంక్షేమ మండలి, రీజయన్లో ఒక మండలి, రాష్ట్రస్థాయిలో బోర్డ్ అన్నారు. ''కాపురం చేసే కళ కాలి గోళ్లనాడే తెలుస్తుంద''నట్లు రాష్ట్ర స్థాయి సమీక్షలేనాడూ జరగలేదు. రీజియన్ స్థాయిలోనూ తూతూ మంత్రమైంది! జరిగేవి డిపో స్థాయిలోనే! ఏ డిపో మేనేజర్లయినా ఎన్ని సమస్యలపై చర్చ చేశారు? ఎన్ని పరిష్కరించారనే విషయాన్ని చెప్పగలరా? జలుబు చేసిన కార్మికుడికి ముక్కుతుడుచుకునే గుడ్డ ఉందా? లేదా? అనే సమస్యలు కాదు... 2017లో జరగాల్సిన వేతన ఒప్పందం, 2021లో జరగాల్సిన వేతన ఒప్పందం జరగలేదు. ఆరు డి.ఎ.లు పెండింగులో ఉన్నాయి. ఇవన్నీ కార్మికుల సంక్షేమం కాదా? సంక్షేమ మండళ్లలో ఇది చర్చించరా? ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈ.డి.ఎల్.ఐ)కింద కేంద్రం 2019లో కేంద్రం పెంచిన మొత్తానికి సంబంధించి ఇప్పటి వరకు టీఎస్ ఆర్టీసీ ఆమోదించలేదు. దీనికింద వందల్లో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది కార్మికుల సంక్షేమం కిందికి రాదా? దేశమంతా ఆమోదించిన ''సంక్షేమం'' ఈ.పి.ఎఫ్. దాని కింద రూ.1400కోట్లు, సీ.సీ.ఎస్. డబ్బు అసలు, వడ్డీ కలిపి రూ.995కోట్లు, ఎస్ఆర్బీఎస్ డబ్బు రూ.400కోట్లు మేనేజ్మెంట్ వాడుకుంది. ఎందరో కార్మికుల ఇళ్ళళ్లో పెళ్లిళ్ళు ఆగిపోయి నానా అవస్థా పడుతున్నారు. ఇదంతా ఎక్కడ చర్చించాలి? ఆర్టీసీ చరిత్రలో మొదటిసారి సర్క్యులర్ లేకుండా డి.ఎ. అమలు, అదీ ఒక పిసరు ''గిల్లుకుని'' అమలుచేస్తున్నారు. దీని గురించి మాట్లాడటం కార్మికుల సంక్షేమం కిందికి రాదా?
ఎండిగారు ట్విటర్లో పోస్ట్ చేసేదాన్ని ఉద్యోగులంతా రీట్వీట్ చేయ్యాలట! ఎలాన్మస్క్కి క్యాంపెయినర్లా ఆర్టీసీ కార్మికులు? నవతెలంగాణ బహిర్గతం చేసిన వార్తలో కీలకమైన అంశమొకటి ఎం.డి.గారు సౌకర్యవంతంగా వదిలేసారు. 2019లో టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన బుక్లెట్ ప్రకారం 5135 బస్సులను స్క్రాప్ చేయాలి. వాటిని ఎందుకు చేయలేదో వివరిస్తారా? మైలేజి అయిపోయిన డొక్కు బస్సులిచ్చి కె.ఎం.పి.ఎల్. తెమ్మంటే ఎవరైనా తేగలరా? కడుపు మండుతున్న కార్మికులు వినూత్న రూపాల్లో నిరసనలకు దిగుతారు. ప్రెషర్ కుక్కర్ బ్లాస్ట్ కాకముందే ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుంటే మంచిది. 'దాదాపు' నగంగా ఒక బాధితుడు డి.ఎం.గారి ముందు నిలబడ్డాడు. ఆ ఫొటో నవతెలంగాణ ప్రచురించింది. పశ్చిమదేశాల్లో నిరసనగా నగంగా నిలబడి ఆందోళన చేస్తారాకార్మికులు. వాళ్ళని 'స్ట్రిప్సీస్' అంటారు. ఆస్థితి తెలంగాణలో రాకుండా చూడగలరని సవినయంగా విజ్ఞప్తి.
''జగమే మాయ''అని అధికారులు చెప్తే వినడానికి యాభైవేల మంది కార్మికులు దేవదాసులు కారు. అన్నీ తెలుసుకుంటున్న, అనుభవిస్తున్న చైతన్యవంతమైన కార్మికులు! రాష్ట్ర కార్మికోద్యమం ఆర్టీసీ కార్మికులను ఒంటరిగా వదిలేయదు. ఒక ఎర్రజెండా పార్టీ ఇప్పటికే కదిలింది. అది దండు కాకముందే ప్రభుత్వం మేల్కొంటే మంచిది.