Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉషోదయాలకు కాషాయాలు పులిమి, ప్రశ్నల గొంతుల్ని నులిమేస్తున్న వేళ... ఓ ఉపశమనం. మనుషుల్ని వెదురు బద్దల్లా చీల్చి ఖండఖండాలుగా విసిరేస్తున్న వేళ... ఒకింత ఊరట. ఎట్టకేలకు సుప్రీంకోర్టు రాజద్రోహ చట్టాన్ని (ఐపీసీ సెక్షన్ 124ఏ) నిలుపుదల చేసింది. వలస కాలం నాటి ఈ దుర్మార్గపు చట్టం అమలుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్వాగతించదగిన పరిణామమేగానీ... ఇది తుది తీర్పు కాదు, మధ్యంతర ఉత్తర్వు మాత్రమేనన్నది గమనార్హం. అయితే ఈ చట్టాన్ని ఓ అణచివేత సాధనంగా వినియోగిస్తున్న నేటి పాలకులకు ఇది ఓ చెంపపెట్టు. పునఃసమీక్ష పేరుతో దాటవేయజూసిన మోడీ సర్కారుకు భంగపాటు.
మొదటి నుంచీ కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడుతామని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ సర్కారు, ఈ రాజద్రోహ చట్టాన్ని మాత్రం అందలమెక్కించడం అంతుబట్టని విషయమేమీకాదు. ఈ పేరుతో ప్రజోపయోగమైన చట్టాలను మట్టుబెట్టడం, నిరంకుశ చట్టాలకు పదునుపెట్టడం ఈ ప్రభుత్వానికి ఓ విధానంగా మారిన సంగతి బహిరంగ రహస్యమే. ప్రజలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాసి, నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిన ప్రభుత్వం, రాజద్రోహ చట్టాన్ని మాత్రం రద్దు చేయ నిరాకరించడం ఇందుకొక నిదర్శనం. కనీస అసమ్మతిని కూడా సహించలేని ఏలికలకు, ప్రశ్నించే గొంతుల్నీ ప్రగతిశీల శక్తుల్నీ నిర్బంధించడానికి ఈ చట్టమొక సాధనంగా మారింది. ప్రభుత్వాన్ని విమర్శించినా, సత్యాన్ని ప్రకటించినా జైళ్లు నోళ్ళు తెరుచుకుంటున్న స్థితి దాపురించింది. ఫలితంగా కొన్ని వేల మంది ఈ దేశ పౌరులు కారాగారాలలో మగ్గుతున్నారు. ఎప్పుడో నూటాయాభై ఏండ్ల క్రితం, తమ సామ్రాజ్య సుస్థిరత కోసం, భారత స్వాతంత్య్రపోరాటాన్ని అణచడం కోసం బ్రిటిష్ పాలకులు తెచ్చిన చట్టమిది. అలాంటి చట్టాన్ని నేటి స్వతంత్ర భారతంలో కూడా ఉపయోగిస్తూ... ప్రజాస్వామ్యం, పౌరహక్కుల గొంతునులమడం ఎంత దుర్మార్గం?!
అందుకే, ''మహాత్మాగాంధీ మొదలు బాలగంగాధర తిలక్ వరకూ స్వాతంత్య్రోద్యమ యోధుల్ని నిర్బంధించడానికి నాటి బ్రిటిష్ ప్రభుత్వం వాడిన ఈ చట్టం, నేటి స్వతంత్ర భారతానికి అవసరమా'' అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చీఫ్ జస్టిస్. గత ఏప్రిల్ 27న ఈ చట్టాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటీషన్లను విచారణకు స్వీకరిస్తూ, ప్రధాన న్యాయమూర్తి సంధించిన ఈ ప్రశ్న ప్రభుత్వమే కాదు, పౌరసమాజమూ ఆలోచించదగినది. అంతేకాదు, ''ఒక చెట్టును కోయమని రంపమిస్తే, ఆ రంపంతో అడవినే కోసేస్తారా?'' అంటూ ఆయన ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఈ చట్టం దుర్వినియోగ తీవ్రతకు అద్దం పడతాయి. ఇది అత్యంత వివాదాస్పదమైన, దుర్మార్గమైన శాసనమని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి? రాజ్యాంగంలోని 19-2(ఎ), 14, 21 అధికరణలకు ఈ చట్టం వ్యతిరేకమైనదే కాదు, హానికరమైనది కూడా. పౌరుల వాక్ స్వాతంత్రానికీ, భావప్రకటనాస్వేచ్ఛకు, సమానత్వహక్కుకూ చివరికి ప్రజల జీవించేహక్కుకు కూడా ఈ చట్టం మహా ప్రమాదకరం.
ఈ నేపథ్యంలో దాఖలైన పిటీషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, ఈ చట్టాన్ని పునఃపరిశీలించమని ప్రభుత్వాన్ని కోరింది. కానీ ప్రభుత్వం ఈ చట్టాన్ని సమర్థిస్తూ మే 7న అఫిడవిట్ దాఖలు చేసింది. అంతలోనే మాట మార్చి ''యూ''టర్న్ తీసుకుంది. రాజద్రోహం నిబంధనను పునఃసమీక్షిస్తామంటూ మే 9న మరో అఫిడవిట్ దాఖలు చేసింది. సమయం గడిచేకొద్దీ నాటకం రక్తికడుతుందనడానికి ఇదో ఉదాహరణ. అందుకే మోడీ సర్కారు నిబద్దత, చిత్తశుద్ది ఏపాటిదో తెలిసినవారెవరూ ఈ మోసపూరిత నాటకాన్ని నమ్మలేదు. ఈ పునఃసమీక్ష ఏలినవారి కాలయాపనకేనన్న సందేహాలు వెల్లువెత్తాయి. బహుశా న్యాయస్థానానికీ అదే భావన కలిగిందేమో తెలియదుగానీ, పునఃసమీక్ష పూర్తయ్యేవరకూ చట్టం అమలును నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. ఇది నిస్సందేహంగా ''రాజు''గారికి పెద్ద షాకే! అయితే ఈ తీర్పు తాత్కాలికంగా నేటి అడ్డుగోలు దుర్వినియోగానికి కొంత అడ్డుపడుతుందేమోగానీ, పూర్తిగా రద్దయినప్పుడే న్యాయం జరిగినట్టు. అప్పుడు మాత్రమే దేశం ఊపిరి తీసుకుంటుంది.