Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సున్నిత' అనే పదానికున్న అర్థం, విపరిణామం చెందిందని అనిపిస్తోంది. లేదంటే పదం తిరుగుబాటు చేయక తప్పదేమో! కొందరు వ్యక్తుల పట్ల చేసే వ్యాఖ్యానాల్లో వాడే పదాల పట్ల జాగ్రత్తలు వహించాలి. లేకుంటే అపహాస్యానికి లోనవుతాయి. ముఖ్యంగా ప్రజలముందు నిలబడిన నాయకుల గురించి వర్ణన చేస్తున్నప్పుడు మెచ్చుకోళ్ళు శిఖరస్థాయికి చేరుతాయి. ఇంద్రుడు, చంద్రుడు సైతం వెలవెలబోయే పొగడ్తల పూలహారాలు నాయకమణ్యుల ముఖాలు సైతం కనపడకుండా నిండిపోతాయి. కొన్ని సభల్లో వినవచ్చే ఆ వర్ణనలు, ఉపమానాలు చూసినప్పుడు వారి గురించి బాగా తెలిసిన వాళ్లకు కడుపంతా వికారమైపోతుంది. వ్యంగ్యాత్మక విమర్శయేమోనని కూడా అనిపించి నవ్వుకోకతప్పదు మరి!
ఇదే పరిస్థితి మొన్న గృహమంత్రి అమిత్షాగారు ప్రధాని మోడీపై విసిరిన పొగడ్త విన్నా కలుగుతుంది. ఆయన ఏమని సెలవిచ్చారంటే... ''ప్రధాని మోడీ అత్యంత సున్నిత హృదయుడ''ని వర్ణించారు. 'మోడీ ఎట్-20, డ్రీమ్ మీట్ డెలివరీ' పుస్తకావిష్కరణ సందర్భంగా వారు మాట్లాడుతూ... డ్రీమ్లోకి వెళ్ళి కలవరించారో మనల్ని నిద్రలోకి వొంచారో తెలియదు కానీ, అందుకు మంచి ఉదాహరణనూ జోడించారు. ఇది విని తీరాల్సిందే! ప్రధాని కార్యాలయంలో కీలక భేటీ నిర్వహిస్తున్న సమయంలో బయటివైపు నుంచి ఓ నెమలి తన ముక్కుతో సమావేశగదికి గోడగా ఉన్న గ్లాస్ పలకను అదేపనిగా కొడుతుండటాన్ని మోడీ గమనించి, నెమలి ఆకలితో ఉందని గ్రహించి, పక్షికి ఆహారాన్ని అందించమని సిబ్బందిని పురమాయించారట. కీలక సమావేశంలోనూ పక్షి ఆకలి బాధను గురించి ఆలోచించారంటే ఆయనది ఎంతటి సున్నిత హృదయమో అర్థమవుతుందని సెలవిచ్చిన షావ్యాఖ్యానం ఎవరినీ ఆశ్చర్యపరచి వుండకపోవచ్చు. ఎందుకంటే నెమల్లకు మోడీకి ఉన్న బంధం అలాంటిది! గతంలో వాటికి ధాన్యపు గింజలు చల్లుతూ ఫొటో షూట్ చేసిన చిత్రాలు ఇంకా మదిలో తిరుగుతూనే ఉన్నాయి.
ఇదెలా ఉందంటే 'పిల్లికి ఎలుక సాక్ష్యం'లా ఉంది. ఈ సున్నిత ప్రదర్శిత హృదయం వెనుక ఉన్న విశాల కరుకుతనాన్ని ప్రజలు అనుభవపూర్వకంగా చూస్తున్నారు కదా! 'కూటిలో రాయితీయలేనివాడు, యేటిలో రాయితీస్తాడన్నాడట ఎనకట ఒకడు. అలావుంది వరస. ఈ దేశానికి ఈ ''అత్యున్నత నాయకుడు'' అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు అయింది. ఆకలిసూచీలో దేశం మరింత దిగజారింది. 89శాతం పసిపిల్లలకు సరిపడే తిండి అందటంలేదని నివేదికలు స్పష్టపరుస్తున్నాయి. కరోనాతో తల్లిదండ్రులు పోయి అనాధలైన పిల్లలు నానా బాధలు పడుతున్నా, వలస కార్మికులు ఉపాధి కోల్పోయి దారిద్య్రంతో కునారిల్లుతున్నా సున్నిత హృదయం స్పందించలేదు. ప్రత్యక్షంగా వందల కిలోమీటర్లు వలస జీవులు పాదాలు రక్తాలు కారగా నడచిపోతుంటే వారి దగ్గర టికెట్టుకు డబ్బులు వసూలు చేసిన 'సున్నిత' మనస్కుడాయన. ఈ దేశానికి అన్నంపెడుతున్న రైతులు సంవత్సరం పాటు రోడ్లపై కూర్చుని 'మా బాధలు ఆలకించండని' మొర పెట్టుకున్నా వినకపోగా, కార్లతో తొక్కించి చంపినా, ఒక్కసారికూడా అయ్యో! అని మాట పెకలని ఆయన హృదయపు 'సున్నితత్వం' ఎరుగనిదా! ఆవు మాంసం దాచాడని అన్యాయంగా ఆరోపించి, ఘోరంగా అక్లాక్ను కొట్టి చంపితే ఇసుమంతైనా చలించని 'సున్నిత' హృదయుడతడు! అంతెందుకూ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన వెలుగబెట్టిన కాలంలోనే గోద్రా సంఘటనానంతరం సామూహిక హత్యాకాండకు పురికొల్పి వేలాది మంది ప్రాణాలను బలిచేసి రక్తపుటేరులు పారించిన చేతుల తడి ఇంకా ఆరనేలేదు కదా! ఇప్పుడు దేశం మొత్తంలో మతోన్మాద విద్వేషాన్ని రెచ్చగొడుతున్న ఉన్మాదుల్ని చూసీచూడనట్టే ఉన్న మహానుభావుడి 'సున్నితత్వం' నిజంగా కనవలసిందే!
ఇంతెందుకు, కాశ్మీరీ పండిట్ల కోసం, వారి సంక్షేమం కోసం తెగ మదనపడిపోయే నాయకులు - మమ్ములనాదుకొమ్మని రోడ్డెక్కిన కాశ్మీరీ పండిట్లపై బడితపూజ చేస్తున్న దయామయుల ''సున్నిత'' హృదయాల యెడ భాషా సున్నితత్వాన్ని పాటించవలసిందే. ఇంకా ఎన్నని చెప్పాలి ఉదాహరణలు! షాగారి భక్తి భావనల వెనకాల ఏమతలబు దాగుందోగానీ సున్నితత్వం మాత్రం ఎంతో గాయపడే ఉంటది. ఈ సున్నిత హృదయాల వెనకాల ఉన్న అనాగరిక గరకుతనాలు తెలుసుకోలేకపోతే మరింత నష్టపోతూనే ఉంటాం!