Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుల, మత, భాషా, సాంస్కృతిక పరంగా వైవిధ్యభరితమైన దేశం మనది. ఇంత భిన్నత్వంలో అందరిని ఐక్యంచేసే ఏకాత్మకతే ''భారతీయత''! ''భిన్నత్వంలో ఏకత్వం'' అనే మూల సూత్రంపై ఆధారపడి, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన అనే నాలుగు స్థంభాల ఆధారంగా నిర్మితమైందే భారత రాజ్యాంగం. మనది అతి పెద్ద లిఖిత రాజ్యాంగమే కాదు, ''లౌకిక'' రాజ్యాంగం కూడా. అలాంటి రాజ్యాంగంపై బీజేపీ, ఆరెఎస్ఎస్ పరివారం నిత్యం దాడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలు భారత రాజ్యాంగానికి తక్షణం ఉన్న ప్రమాదాన్ని కండ్లకు కడుతున్నాయి.
'ముస్లింల ఓట్ల కోసమే రాజ్యాంగం కానీ.. హిందువుల ప్రయోజనాలను కాపాడటం కోసం రాజ్యాంగం లేదా..? రాజ్యాంగం మార్చే హక్కు పార్లమెంట్లో మాకు ఉంది. ''సెక్యులర్'' పదాన్ని రాజ్యాంగం నుంచి తీసేయాలంటే తీసేసే హక్కు మాకుంది' అని అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు ఉత్తర భారతం నుంచి రావడం పరిపాటి.. ఇప్పుడా జాఢ్యాన్ని అర్వింద్ దక్షిణ భారతానికి అంటించారు. ఇస్లామిక్ పాకిస్థాన్‌లాగా భారతదేశాన్ని ''హిందూ దేశం''గా ప్రకటించుకోవాలన్నది ఆరెఎస్ఎస్ స్వప్నం. అందుకనుగుణంగా వారి సిద్ధాంత కర్త సావర్కర్ ఆశించిన ''మనుస్మృతి''నే రాజ్యాంగంగా అమలులోకి తెచ్చే కుట్రే ఇది. 2019లో తిరిగి అధికారంలోకి వచ్చిన మోడీ పాలన పైనచెప్పిన పంథాలోనే నడుస్తున్నది.
రాజ్యాంగంపై కాషాయ దాడి అక్కడితోనో, అంతటితోనో ఆగదు. గతంలోనే ''లౌకిక'', ''సామ్యవాద'' మనే పదాలు రాజ్యాంగ పీఠిక నుంచి తొలగించాలని కాషాయనేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా అర్వింద్ మరో అడుగు ముందుకు వేసి హిందువులకు ప్రమాదమని భావిస్తే రాజ్యాంగం నుంచి ''సెక్యూలర్'' అన్న పదాన్ని తొలగిస్తామని, అందుకు అవసరమైన మంద బలం తమకుందని, చేసి తీరుతామని హెచ్చరిస్తున్నారు.
ముస్లింలను డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలను చేయాలనే కేసీఆర్ ఆలోచనతోనే తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలకు ఉర్దూలో పరీక్షలు నిర్వహించనున్నారని, అంటే వారి కింద హిందువులు పనిచేయాలని సదరు ఎంపీ ఆవేదన చెందుతున్నారు! నిజానికి ఉర్దూలో పరీక్షలు రాయవచ్చు అన్న సంగతి ఆయనకు తెలియక కాదు. యూపీలోనూ ఇది అమల్లో ఉంది. అంతటితో ఆగలేదు ఇంకా రెచ్చిపోయారు. అంతకంటే ఎక్కువగా తెలంగాణ ప్రజలను రెచ్చకొట్టే ప్రయత్నమూ చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి.. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి.. వాటి చుట్టూనే తిప్పుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కుటిల యత్నాలుచేేస్తున్నారు.
అంతేకాదు తెలంగాణ హిందువులకు హెచ్చరికలు కూడా చేశారీ కమల నాయకుడు. 'జైశ్రీరాం' నినాదంతో అయోధ్యలో ఆలయ నిర్మాణం అవుతోంది. మథురలోని కృష్ణ జన్మభూమి జైలు వద్ద ఉన్న మసీదును తొలగించాలనే డిమాండ్ చేస్తున్నాడీ పెద్దమనిషి. ''రాధే రాధే'' అనే నినాదం ఇప్పుడు హౌరెత్తాలి. మథురలో మసీదు తొలగించాలనే డిమాండ్ దక్షిణాది నుంచే తెర మీదకు రావాలని ఉద్భోదించారు. రామమందిర వివాదాన్ని ఎలా వాడుకున్నారో.. ఇప్పుడలా కృష్ణమందిరాన్ని వాడుకోనున్నారు. మతాలకతీతంగా అందర్ని అక్కున చేర్చుకున్న తెలంగాణను వారి మతరాజకీయాలకు బలి చేసేందుకు పూనుకుంటున్నారు. దక్కనీ ఆత్మకు ఏకాత్మగా నిలిచిన గడ్డ ఇది. దానిని చెదరకొట్టేందుకు నిన్నటిదాకా లేని ఓ కొత్త సామాజిక సమస్య మత విద్వేషం రూపంలో ముందుకు వస్తున్నది. గంగా జమున తహజీబ్‌కు కేంద్రమైన చోట సామరస్యంతో జీవిస్తున్న మనుషుల మధ్య మత చిచ్చును రగిలించే కుయుక్తులు వేగం పుంజుకున్నాయి.
దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నదన్నది వాస్తవం. రాజ్యాంగం మార్పు అయినట్లయితే మన సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యానికి బీటలు వారి సమైక్యత దెబ్బతింటుంది. మానవ మనుగడే ప్రమాదకరంగా మారిపోతుంది. ఇటువంటి ఆలోచనను విరమించుకుంటే మంచిది. ''ఎంతో కష్టపడి సాధించిన ఈ హక్కులను చేతనైతే ముందుకు తీసుకుని వెళ్ళండి లేదా అక్కడే వదిలి వేయండి, అంతేకానీ వెనుకకు మాత్రం లాగవద్దు'' అన్న బాబా సాహెబ్ మాటలును ప్రతి భారతీయుడు గుర్తు చేసుకోవాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడమే మన బాధ్యత. ఆ మార్గం లో ఎదురయ్యే దుష్టశక్తులను ఎదుర్కోవడమే తప్ప, మరో మార్గమే లేదు.