Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికాలో రిపబ్లికన్ పార్టీని గ్రాండ్ ఓల్డ్ పార్టీ (జీ.ఓ.పీ) అంటూంటారు. బీజేపీ అధికారంలోకొచ్చిన తర్వాత మనదేశంలోనూ కొందరు కాలమిస్టులు కాంగ్రెస్‌ని గ్రాండ్ ఓల్డ్ పార్టీ పేరుతో సంబోధిస్తున్నారు. 137ఏండ్లయిన తర్వాత గ్రాండ్ ఓల్డ్ పార్టీ అంటే పెద్ద తప్పేముంది?
ఏ పార్టీకైనా దాని గమనాన్ని బట్టే గమ్యం ఉంటుంది. ఢిల్లీ నుండి దక్షిణానికి బయల్దేరితే చివరికి కన్యాకుమారిలో హిందూమహాసముద్రం వస్తుంది తప్ప హిమాలయలూ రావు, ఎవరెస్ట్ శిఖరమూ కనపడదు. ఇంగిత జ్ఞానం ఉండే ఎవరికైనా అర్థమయ్యే విషయాలే ఇవి. స్వాతంత్య్రానంతరం భారత దేశంలో నిర్మించాలనుకుంది పెట్టుబడిదారీ విధానం. నిర్మించింది కూడా ఫక్తు పెట్టుబడిదారీ విధానమే! మేపింది పెట్టుబడిదార్లను, భూస్వాములనే! ఉదరుపూర్‌లో మేథోమధన శిబిరంలో ఒక మనీష్తివారి ''సోషలిస్టు రాజకీయాన్ని మనం వదులుకోకపోతే మనం మళ్ళీ అందలం ఎక్కలేమ''న్నాడు. కాంగ్రెస్ ఏనాడూ సోషలిజం కోసం ప్రయత్నించలేదని తెలియని అమాయకులేంకాదు ఈ బాపతు. యూపీఏ-2 కాలంలో ఇప్పుడు మోడీని అంటకాగుతున్న ముఖేష్ అంబానీకి కె.జి.బేసిన్లో తవ్విన గ్యాస్‌కు డాలర్లలో రేటు చెల్లించాలని, అదీ విదేశాల నుండి దిగుమతి చేసుకుంటే ఎంతవుతుందో ఆ లెక్కన లెక్కకట్టాలని సర్వశ్రీ ప్రణబ్‌ముఖర్జీ నాయకత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం రికమండ్ చేసింది. ఇది చాలదా కాంగ్రెస్ ఏమి నిర్మించిందో తెలుసుకోడానికి?! అసలు సంగతేమంటే మోడీతో సమానంగా పెట్టుబడికి సేవ చేస్తామని, ఒకింత ఎక్కువే సేవచేస్తామని ప్రకటించాలని వీరందరి ఆవేదనలాగుంది! బొందితో కైలాసం పోయినట్లు పెట్టుబడిసేవే పరమావధిగా మనసా, వాచా నమ్మే పార్టీ ప్రజలకి ఏ ప్రత్యామ్నాయం ''కొత్త''గా అందించగలదు?
ఎప్పటి నుంచో ఆక్స్‌ఫామ్ వంటి సంస్థలు ప్రపంచంలో అంతరాలు ఏవిధంగా పెరుగుతున్నాయో బహిర్గతం చేస్తూనే ఉన్నాయి. తాజాగా 2022లో ఐఎంఎఫ్ ప్రపంచంలో అంతరాలు 20వ శతాబ్దం నాటి స్థాయికి చేరాయని ఒక పెద్ద నివేదికే వెల్లడించింది. అన్యాపదేశంగా నయాఉదారవాద విధానాలే కారణమని అంగీకరించినట్లే కదా?! మోడీ అవలంబించే ఆర్థిక విధానం చెడ్డది, మేము అవలంబించినప్పుడు మంచిదని చిదంబరం చెప్పుకోవడం ఆశ్చర్యమే! దీన్నే తాము ''మానవత్వంతో కూడిన ఆర్థిక విధానం'' అవలంబించామని, వాజ్‌పాయి సర్కార్ ఆవిధంగా చేయలేదని 2003లో మన్మోహన్సింగ్ చెప్తే అసలీ నయా ఉదారవాదమే అమానవీయమైంద''ని ఆనాడే ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ అన్నారు. అందుకే, ప్రయాణం ఆ దిక్కుగా ప్రారంభిస్తే అక్కడికే చేరతారనే విషయం కాంగ్రెస్ పెద్దలకు అర్థం కాలేదో! అయ్యే నటిస్తున్నారో భవిష్యత్తే నిర్ణయిస్తుంది.
ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లనే డిమాండ్ పెట్టడం మంచిదే అయినా, అసలు తాము మళ్ళీ అధికారంలోకొస్తే ప్రభుత్వరంగాన్ని కాపాడతామని, డిజన్వెస్ట్మెంట్ ప్రక్రియకి కళ్ళాలు వేస్తామని చెప్పలేకపోవడం 'ఉదరుపూర్'లో బహిర్గతమైన బలహీనత! విద్య, వైద్యం వంటివి ప్రయివేటీకరించబడితే దేశ సామాన్యులు, పేదలు, అల్లాడిపోతున్నారనే వాస్తవాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించారా? చింతన్ శిబిర్ చింతంతా మళ్ళీ ఢిల్లీ సింహాసనం అధిష్టించడం ఎలా? అనే దాని చుట్టూనే తప్ప దేశంలోని కోట్లాది కష్టజీవుల కష్టాల గురించి, వాటి పరిష్కారాల గురించి, అందుకు అనుసరించే తమ విధానాల గురించి చర్చ నాస్తి!
భారత పెట్టుబడిదారుల భూస్వాముల ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ తమ ఆర్థిక విధానాల ఫలితంగా క్రమంగా ప్రజలకి దూరమైంది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో గరిష్టంగా 45.1శాతం ఓట్లు సంపాదించిన కాంగ్రెస్‌కు, 2019లో ఆ ఓట్లు19శాతానికి పడిపోయాయి. రానున్న సంవత్సరంలో మరో పది రాష్ట్రాల ఎన్నికలున్నాయి. 2024లో లోక్‌సభ ఎన్నికలున్నాయి. ఈ సందర్భంలో ఇల్లు చక్కదిద్దుకోవడం అవసరమే. కాని వారి విధానాలు ప్రజలకి ఏమేమి మేళ్ళు చేస్తాయో చెప్పడం అంతకంటే అవసరం. ఢిల్లీలోనే కేజ్రీవాల్ ఆంజనేయుడి గుడి దర్శించడం, తానూ ఆంజనేయుడి వీరభక్తుడినని చెప్పడం వంటివి చేసినా చివరికి ఉచిత మంచినీరు, విద్యుత్, విద్య, బస్తీ దావాఖానాలే ఆప్ విజయంలో కీలకపాత్ర పోషించాయి. ఇప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ ప్రభుత్వం కార్మికోద్యమాన్ని అణిచివేస్తున్నది. నిర్దిష్టంగా ప్రజలకు ఊరట కలిగించే చర్యలు ఏవిధంగా చేపట్టాలో ఆలోచిస్తేనే తిరిగి ప్రజాభిమానాన్ని చూరగొంటుంది. ''అత్యధిక మంది ప్రజల మనోభావాల కనుగుణంగా కాంగ్రెస్ నడుచుకోవా''లని కొందరు ప్రతినిధులు చెప్పారు. అంటే మళ్లీ ''సాఫ్ట్ హిందూత్వ లైన్'' తీసుకుంటారా? బీజేపీని సైద్ధాంతికంగా ఎదుర్కోవాలన్నంత వరకు ఆహ్వానించదగ్గదే. కాని పై అంశాలపై నాయకత్వం స్పష్టత ఇవ్వకపోతే 1998, 2003, 2013ల్లో జరిగిన చింతన్ శిబిరాల్లాగే 2022 కూడా నిరుపయోగంగా తేలుతుంది.