Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజు బలవంతుడే, అతని హుందాతనాన్ని, ఠీవీని, రాజసాన్ని చూసి ప్రజలకు గర్వకారణంగానూ ఉంటది. అందుకే నీరాజనాలూ అందుకుంటాడు. తన బలాన్ని, శక్తియుక్తుల్ని తమను రక్షించటం కోసం ఉపయోగిస్తాడనే నమ్మకంతో ఏ భయాలూ లేకుండా జీవిస్తారు ప్రజలు. ఇది సాధారణంగా ఘనంగా చెప్పుకునే రాజుల చరిత్ర. వారి చరిత్రను వారే చెప్పుకున్నా, వారి గురించి జనులు చెప్పుకోవాలనుకున్నా వీరత్వమూ ధీరత్వమూ ప్రధాన గుణాలుగా ప్రచారంలో ఉంటాయి. కానీ క్రూరత్వాన్ని ఏరాజూ ప్రదర్శించడు. క్రూరుడనిపించుకోవటం క్రూరునికీ ఇష్టముండదు. అందుకనే సింహాన్ని అడవికి రాజున్నారు కానీ, అత్యంత క్రూర జంతువని అనుకోలేదు మనం. సింహాన్ని శక్తివంతమైన రాజసానికి, దీక్షతకు, వీరత్వానికి, నేనున్నాననే భరోసాకు నిదర్శనంగానే పోల్చు కుంటాం కానీ, కోరలు సాచి రక్తం తాగే క్రూరత్వానికి ప్రతీకగా తీసుకోము. సారనాథ్ స్థూప శిల్పీ అలా తీర్చలేదు.
మరి మన అధిపతి నాలుగు సింహాల బౌద్ధస్థూప చిహ్నాన్ని ఎందుకలా దాడికి కోరలు సాచినట్టు మలిచాడు? అనే ఆశ్చర్యం మనకేమీ అక్కరలేదు. చిహ్నాలేవైనా, ఆకాలపు ఆలోచనలు, తాత్వికతలు, ఆశలు కూడా సంకేతించబడతాయి. ఇందులోనూ అదే జరిగింది. ఒక దాడి జరుగుతోంది. దండెత్తడమూ ఉంది. అది ఆర్థిక సాంస్కృతిక మూలాలపై ఎక్కుపెట్టబడి ఉన్నది. ప్రజాస్వామిక ఆచరణకు పూర్తి వ్యతిరేకమయిన విధ్వంస నమూనా జడలు విప్పుతూ ఉన్నది. దాన్ని ప్రతిబింబించడమే ఈ రూపురేఖల ప్రతిఫలనం. ఇప్పుడు సంకేతాలన్నీ మారతాయి, చిహ్నాలూ కొత్తరూపుదాల్చుతాయి. సంవిధానమూ మారుతుంది. అందుకే టాటా ప్రాజెక్టు వాళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నూతన పార్లమెంటు భవనంపై ప్రతిష్టించే నాలుగు సింహాలు క్రూరంగా, కోరలు చాచి దాడికి సిద్ధపడుతున్నాయి. ఈ దేశాన్ని యుద్ధభూమిగా మార్చేయాలన్న తలంపును చెప్పకనే చెబుతున్నాయి వాటి నోళ్లు. చూపుకు కోరలు చాచింది సింహాపు శిల్పాలే కావచ్చు. కానీ, అధినేత ఆత్మకు అసలైన గుర్తులు అవి. అవి 'మోడీ' ఫైడ్ గుర్తులు. ఇక మన చరిత్ర వారసత్వంగా మనకు సంక్రమించిన గుర్తులన్నీ మారతాయి. మన ఆశలకు ఆశయాలకు, విధానాలకు సంబంధించిన సూచికలూ మారనున్నవి. ఎందుకంటే మూడురంగుల జాతీయ జెండాను, అంబేద్కరు నాయకత్వాన రచించుకున్న రాజ్యాంగాన్ని ఒప్పుకోని ఆలోచనా పరంపరకు వారసులు నేటి పాలకులు కదా! ఇప్పటికే సగం కనపడకుండా చేసేశారు. మిగిలిన అవశేషాన్నీ సమూలచ్ఛేదం చేస్తారు.
మన పిచ్చి భక్తరామదాసు ''దాశరథీ కరుణా పయోనిధీ'' అని రామున్ని వేడుకుంటూ పాడుకున్నాడు. సముద్రమంత కరుణకలిగిన వాడిగా రామున్ని కీర్తించాడు. కారుణ్యతకు, శాంతికి, ధీరోదాత్తతకు, ప్రేమతత్వానికి మారుపేరుగా పూజింపబడుతున్న రాముని చిత్రాన్ని ఎలా మార్చారో గమనించారా! గుడ్లురిమిచూసే దేవున్ని ఎప్పుడైనా కన్నామా మనం! అత్యంత బలసంపన్నుడైన ఆంజనేయుడు సౌమ్యుడుగా రామునిచెంత కూర్చున్నాడనే చిత్రం మన మనస్సు పత్రంపై రికార్డు చేయబడింది కదా! మరెందుకు ఉగ్రరూపుడైన హనుమంతుడు దర్శనమిస్తున్నాడు? అంతేకాదు అధికారిక ఛత్రపతి శివాజీ చిత్రం రూపూమారిపోయి విద్వేష కోపోద్రిక్త శివాజీ చిహ్నం ప్రత్యక్షమయింది. ఇవన్నీ వేటికి సంకేతాలు! భారతీయ.. 'సహనావవతు సహనౌభునక్తు... శాంతి శాంతిహీ' అనే సంప్రదాయానికి స్వస్తిపలికి, విద్వేష మస్తుగా మారిపోయిందా! విధ్వంస రచనకు సమాయిత్తమవుతోందా రేపు? కళింగ యుద్ధానంతరం ఛిద్రమైన దేశాన్ని చూసి చలించిన అశోకునిలోని మానవ హృదయం శాంతిని ప్రబోధించింది. బౌద్ధం, ''సంఘం శరణం'' గచ్చామి అంది. 'రఘపతి రాఘవ రాజారాం, ఈశ్వర్ అల్లా తేరేనాం, సబ్కో సమ్మతి దేభగవాన్' అని పాడుకున్న జాతిపిత మార్గాన ముళ్లపొదలు లేస్తున్నాయి. ఇప్పుడు, మతం కత్తుల పొదిలోంచి రాజకీయ కుతంత్రం రంకెవేస్తోంది. అన్ని సంప్రదాయాలకూ తిలోదకాలిచ్చి, అధికారం విధ్వంస గీతాన్ని ఆలపిస్తోంది. పిడుగు పడే ముందు మేఘం గర్జన చేసినట్టు, విషం చిమ్మేముందు పాము బుసకొట్టినట్టు రాబోయే విచ్ఛిన్న ప్రయోగానికి సంకేతాలే ఈ వక్రీకరించిన చిహ్నాలు. అంత తేలికగా కొట్టిపారేసే విషయాలు కావివి. మన సంప్రదాయ పరం పరను, సహన సహజీవన విధాన వారసత్వ రూపురేఖలను తుడిచివేసే చర్యలివి. భారత జాతీయోద్యమ ఆధునిక చరిత్రకు సంబంధమేలేనివారి క్రూర తిరోగమనవాదానికి గుర్తులివి.