Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆత్మానుభవం అయితేనే గానీ తత్వం బోధపడదన్నాడు గిరీశం. మనసారు 'శివతాండవం' చూస్తే అది నిజమేననిపిస్తోంది. కాని చరిత్ర చూస్తేనే...! పెద్దనోట్ల రద్దును, జీఎస్ట్టీని, 370 అధికరణం రద్దును ఎదురేగి స్వాగతించిన టీఆర్ఎస్ అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు నేడు అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్న తీరు దేశంలోని ప్రజాస్వామిక శక్తులకు కొత్త ఆశలు రేపుతున్నది. ''మీరు బీజేపీపై చేస్తున్న యుద్ధం నిజమైనదేనా?'' అని గతంలో విలేకర్లు ప్రశ్నిస్తే ''మీకు నమ్మకం కలగాలంటే మేము బాంబులు పట్టుకుని పార్లమెంటుకు వెళ్ళాలా?'' అని ఒక ఎంపీగారు వ్యంగ్యోక్తుల్తో ఎదురుదాడి చేశారు. అలాంటి పార్టీ అధ్యక్షులవారు మొన్న శనివారం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై పార్లమెంటులో ఏవిధంగా కౌంటర్ ఇవ్వాలో తమ పార్లమెంటు సభ్యులకు దిశానిర్దేశం చేయడం ఆ ఆశల చిగురింపునకు మూలకారణం.
బియ్యం కొనుగోళ్లతో మొదలైన వైరం చిలికి చిలికి రాష్ట్రపతి అభ్యర్థి కోసం అన్నీ తానై నిర్వహణాభారం మీదేసుకునేవరకు జడివానై సీరియస్‌గా కొనసాగుతోంది. ఇది టీకప్పులో తుఫానుగా ముగియ కుంటేచాలు. విద్యుత్ బిల్లు వంటివి సమాఖ్య స్ఫూర్తికి పాతరేస్తాయని కేసీఆర్ బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. ''మీది మీటర్ల పార్టీ, మాది నీళ్లిచ్చే పార్టీ'' అంటూ బీజేపీని ఎద్దేవా చేస్తున్నారు. శనివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో అణాపైసల్తో సహా రాష్ట్రానికి రాబట్టాల్సిన నిధుల లెక్కలుచెప్పి జంగ్ సైరన్ ఊదారు.
రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయాలు ఇన్నీ అన్నీ కావు. నిర్ద్వంద్వంగా వాటిపై పోరాడాల్సిందే. కీలకంగా విభజన చట్టంలోని హామీలు బీజేపీ తుంగలో తొక్కింది. ఈ ఎనిమిదేండ్లలో వీటిపై నిర్దిష్టంగా పోరు జరిగివుంటే అసలీ రాష్ట్రంలో బీజేపీకి కాలుమోపే సందే దొరికుండేదే కాదు. అసలీ విషయాలు రాష్ట్రంలో చర్చనీయాంశాలై ఉంటే అనేక విధానపరమైన అంశాలు ముందుకొస్తాయి. ఆ చర్చ బహుశా అటువైపు వారికే కాదు, ఇటువైపు వారికి కూడా ఇబ్బంది కలిగించిదేమో! అందుకే జరగలేదేమో! ఉదాహరణకు బయ్యారం ఉక్కు కర్మాగారం విషయమే తీసు కుందాం... వై.ఎస్. కాలంలో వేల టన్నుల ముడి ఇనుము తవ్వుకు పోయారు. ఇప్పుడెందుకు తవ్వరు? స్టీల్‌ప్లాంట్ ఎందుకు శాంక్షన్ చేయరు? ఉన్న ప్లాంట్లనే ప్రయివేటైజ్ చేసి తీరుతామనే మోడీ సర్కార్ కొత్తప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తుందా? అవసరమైతే వైజాగ్ వెళ్లి విశాఖ ఉక్కు రక్షణ ఉద్యమంలో పాల్గొంటామన్న చిన్నసారు బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ కావాలని పెద్దపోరు చేసుంటే మోడీ సర్కార్ గొంతులో పచ్చివెలక్కాయ పడుండేదికాదా?! విశాఖలో అంత పెద్దపోరు సాగుతున్నా మోడీ వెనక్కి తగ్గలేదంటే ఏ లక్ష్మీ మిట్టల్కైనా చేతిలో చెయ్యేసి బాస చేశారో, జిందాల్ కిస్తామన్నారో లేదా సుందోపసుందుల్లాంటి 'సొంతూరు' అస్మదీయులు కమైనా రాసిచ్చారో తెలీదు కానీ మూలవిరాట్ తల అడ్డం తిప్పేసరికి ప్రమధగణాలన్నీ ప్రయివేటైజేషన్ జిందాబాద్ అనడం చూస్తున్నాం కదా! కొత్త స్టీల్ ప్లాంట్ కోసం బీజేపీ నేతల్ని ఒప్పించడం సాధ్యం కానప్పుడు నొప్పించి సాధించడానికి ఎంత పెద్ద ఉద్యమం జరగాలిక్కడీ! కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సరిగ్గా ఇటువంటిదే! కపూర్తలా, వారణాసి తదితర చోట్ల, ఉన్న కోచ్ ఫ్యాక్టరీలను, వర్క్షాపులనే 2019లో మళ్లీ ఎన్నికైన తర్వాత మొదటి వందరోజుల్లోనే ప్రయివేటు గద్దలకు నైవేద్యం పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు మోడీసాబ్. అంత తేలిగ్గా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అందుతుందా మనకు? ఇక బియ్యం పంచాయతీ తీరనేలేదు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన 50లక్షల టన్నుల ధాన్యం ఎఫ్‌సీఐ కొనుగోలు చేయకపోతే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినదా? టీఆర్ఎస్ను లొంగదీసుకునేందుకు లక్షలాది రైతుల్ని బలితీసుకోవడం బీజేపీకి న్యాయమనిపిస్తోందా?
నిజంగానే ఉద్యమ పార్టీకి, ఉద్యమ పార్టీనని పదేపదే చెప్పుకునే పార్టీకి ప్రజలన్నా, ప్రజా ఉద్యమాలన్నా ఈసడింపుండటం కూడదు. తాము నడిపిందే ఉద్యమం, ప్రజలు చేసేదేదైనా ప్రజాద్రోహమనుకోవడం ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు సైతం 10-15 తేదీల మధ్య జీతాలివ్వడమేంటని ప్రశ్నిస్తే... ''ఒకటో తేదీనే వేతనాలివ్వాలని రాజ్యాంగంలో ఉందా?'' అంటూ వెటకారంగా ప్రశ్నించడం ఏమిన్యాయం? తమకొచ్చిన ఇబ్బందులు చెప్పొచ్చు. కారణాలు వివరించవచ్చు. ఆ వేళ్ళన్నీ కేంద్రం వైపే చూపుతాయి కదా! మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? పాలకులు నమ్రత కోల్పోతే పాలన అస్తవ్యస్థమవుతుంది. ముఖ్యంగా బీజేపీ విధానాలపై పోరాడేటప్పుడు ఎందర్నో కాదు, అందర్నీ కలుపుకుంటూ ముందుకు సాగాలి. కొంతకాలం 'విన్నపాలు వినవలే!' నంటూ తమలపాకులతో వసంతాలాడినా మోడీసర్కార్ తలుపుచెక్కల్తోనే సమాధానం చెప్పింది. ప్రకటనలతో సరిపుచ్చే కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ఆచరణే మీ గీటురాయి!