Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయ సూచికల్లో ఏడాదికేడాది దిగజారుతూ వస్తున్న భారత్ స్థానం స్త్రీ, పురుష సమానత్వం విషయంలోనూ అట్టడుగుకు పోవడం అత్యంత బాధాకరం. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) ఎంపిక చేసిన 146 దేశాల్లో స్త్రీ, పురుషుల మధ్య అంతరాలపై అధ్యయనం చేసి బుధవారం ప్రకటించిన వార్షిక నివేదిక-2022లో భారత్ 135వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 156 దేశాల్లో 140వ స్థానంలో ఉండేది. అంటే ఇంతకుముందు మన దేశం కంటె దిగువన 16 దేశాలుండగా ఈ ఏడాది 11 మాత్రమే ఉన్నాయి. అంతర్జాతీయ సూచికలు సాపేక్ష ప్రాతిపదికపై నిర్ణయిస్తారు. కాబట్టి భారత్ పరిస్థితి దిగజారినట్టే! అంతేగాక మన ఇరుగు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్ కూడా మనకన్నా మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ 71, నేపాల్ 96వ ర్యాంకుల్లో నిలవడం గమనార్హం. మన కంటె దిగువన పాకిస్థాన్, కాంగో, ఆఫ్ఘనిస్తాన్ వంటి సంక్షుభిత దేశాలున్నాయి. ఈ సూచికల నాలుగు ప్రాతిపదికల్లో ఒకటైన ఆరోగ్యం, మనుగడ అంశంలో భారత్ 146వ స్థానంలో అంటే చిట్టచివరన ఉంది. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలు అంశంలో 143వ స్థానంలో ఉంది. కాగా విద్యా సముపార్జన అంశంలో 107వ స్థానంలోనూ రాజకీయ సాధికారత అంశంలో 48వ స్థానంలో ఉంది. ప్రజల దైనందిన జీవనానికి ముఖ్యమైనవి, మానవాభివద్ధి సూచికల్లో ప్రధానమైనవీ అయిన మొదటి మూడు అంశాల్లో సుమారు 66 కోట్ల మహిళా జనాభాగల భారత్ దయనీయమైన స్థానంలో ఉందన్నమాట.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న లింగ వ్యత్యాసాన్ని పూడ్చటానికి మరో 132 ఏళ్లు పడుతుందని డబ్ల్యుఇఎఫ్ పేర్కొనడంలోనే ఈ సమస్య ఎంత తీవ్రమైనదో విదితమవు తుంది. శ్రామిక శక్తిలో పెరుగుతున్న లింగ వ్యత్యాసం, జీవన వ్యయ సంక్షోభం మహిళలను తీవ్రంగా దెబ్బ తీస్తుందని ఈ నివేదిక చేసిన హెచ్చరిక భారత పాలకులకు కనువిప్పు కావాలి. 2021 నుంచి పురుషులు, మహిళలకు ఇద్దరికీ కార్మిక శక్తి భాగస్వామ్యం తగ్గిపోయిందని నివేదిక తెలిపింది. కనుక ఉపాధిపై ముఖ్యంగా మహిళా ఉపాధి కల్పనపై శ్రద్ధ పెట్టాలి. మహిళా శాసన సభ్యులు, సీనియర్ అధికారులు, మేనేజర్లలో మహిళల వాటా 14.6 శాతం నుంచి 17.6 శాతానికి పెరగడం, వత్తి, సాంకేతిక ఉద్యోగాల్లో కూడా 29.2 శాతం నుంచి 32.9 శాతానికి పెరగడం సానుకూల పరిణామమే అయినా ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పురోగమనంతో పోల్చితే ఇది చాలదు. స్త్రీ, పురుష అంతరాలు అతి తక్కువగా ఉన్న దేశంగా ఐస్లాండ్ తన నంబర్ వన్ ర్యాంక్‌ను తిరిగి నిలబెట్టుకోవడంలో ఈ అంశాలు కీలకమన్న విషయం గుర్తించాలి.
నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక, మరీ ముఖ్యంగా రెండోసారి గద్దెనెక్కిన అనంతరం వెలువడిన అంతర్జాతీయ నివేదికల్లో భారత్ ర్యాంకింగ్ దిగజారుతూనే ఉంది. ఐక్యరాజ్య సమితి పరిధిలోని యునిసెఫ్, మానవ హక్కుల సంస్థ, ఇంకొన్ని సంస్థలు విడుదల చేసే నివేదికల్లో, ఆకలి సూచీ వంటి వాటన్నిటిలోనూ భారత్ స్థానం అట్టడుగునే! దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు దోహదపడే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి ప్రపంచబ్యాంకు ఇచ్చే ర్యాంకింగ్ మాత్రమే ఇందుకు మినహాయింపు. గడచిన మూడు దశాబ్దాలుగా దేశంలో అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల మూలంగానే పేదరికం పెరగడం, ఆదాయ అంతరాలు పెచ్చరిల్లడం వంటివి జరుగుతున్నాయన్నది వాస్తవం. మోడీ సర్కారు ఆ విధానాలను మరింత వేగవంతంగా అమలు చేయడంవల్లనే భారత్ అంతర్జాతీయ ర్యాంకింగ్ అంతకంతకూ దిగజారుతోంది. దేశ విదేశీ కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలను వేగంగా అమలు చేయాలంటే వాటిని జనం ప్రతిఘటించకుండా ప్రజల ఐక్యతను దెబ్బ తీసేందుకు బిజెపి మత వైషమ్యాలను రెచ్చగొడుతోంది. అంతర్జాతీయంగా గౌరవప్రదమైన ర్యాంకింగ్‌లో భారత్ ఉండాలంటే నయా ఉదారవాద విధానాలు పోవాలి. ఈ కార్పొరేట్ మతతత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు సాగాలి. విధానపరమైన మార్పును సాధించాలి. అదే పరిష్కారం.