Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోహిణిలో రోళ్లు పగిలే ఎండల గురించి వినటమే తప్ప చూసిన వారు తక్కువ. కానీ ఇప్పుడు బ్రిటన్లో ఎండలకు రైలు పట్టాలు పొడిబారి రాలిపోతున్నట్లు వార్తలు. ఇప్పటి వరకు వివిధ దేశాల్లో 1700 మంది వరకు వడదెబ్బకు దుర్మరణం చెందారు. వేడికి తాళలేక లండన్ థేమ్స్ నది, ఇతర జలాశయాల్లో సేద తీరేప్రయత్నంలో ఐదుగురు దుర్మరణం చెందారు. పలు దేశాల్లో కారుచిచ్చు రేగుతోంది. తుపాను, వరద హెచ్చరికల మాదిరి వేడి గాలుల హెచ్చరికలను జారీ చేస్తున్నారు. బ్రిటన్లో రైళ్లను నిలిపివేస్తున్నారు. వేగాన్ని తగ్గించి నడిపే వాటిలో కూడా ఎక్కవద్దని సలహా ఇస్తున్నారు. ఐరోపాలోని అనేక దేశాల్లో ప్రస్తుతం వీస్తున్న వేడిగాలుల తీవ్రతకు ఇవన్నీ నిదర్శనం. వచ్చే వారంలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని ప్రపంచ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వేడిగాలుల తీవ్రత ఒక్క ఐరోపాలోనే కాదు, అమెరికా, చైనాలోని కొన్ని ప్రాంతాలకూ విస్తరిస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రకృతి ఉత్పాతాలను పసిగట్టటం, హెచ్చరించటంలో గతం కంటే మానవ పరిజ్ఞానం పెరిగినప్పటికీ నష్ట నివారణ తప్ప నిరోధించే అవకాశం లేదు. వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల వల్లనే అతివృష్టి, అనావృష్టి, తీవ్ర వేడి, అతిశీతల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వేడి తీవ్రత నమోదు చరిత్రలో బ్రిటన్ 104.36 డిగ్రీలతో (ఫారెన్ హీట్) మంగళవారంనాడు కొత్త రికార్డు నమోదైంది. స్పెయిన్, పోర్చుగల్ వంటి కొన్ని చోట్ల 117 డిగ్రీలు నమోదైంది. ఐరోపాలో చలివాతావరణానికి తగిన విధంగా రోడ్లు, రైలు మార్గాల నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు అసాధారణ ఉష్ణోగ్రతల కారణంగా అనేక చోట్ల రైలు పట్టాలు వంకర తిరగటం, పగిలిపోతున్నందున రైళ్ల వేగాన్ని తగ్గించి తరువాత పూర్తిగా నిలిపివేశారు. సాధారణ ఉష్ణ్రోగ్రతల కంటే రైలు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కనుక పట్టాలు పగులుతున్నాయి.
వాతావరణంలో కలిగిన మార్పుల కారణంగానే తరచూ వేడి గాలులు వీస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. క్రీడాకారులు తమ సహజ ప్రతిభను చూపేబదులు ప్రభుత్వాలు, కంపెనీలు ఇచ్చే కానుకలు, ఆర్థిక లబ్ది, పేరు ప్రతిష్టల కోసం ఉత్ప్రేరకాలను వాడి అగ్రస్థానంలో ఉండేందుకు ప్రయత్నించటం తెలిసిందే. ఇదే మాదిరి అధిక లాభాల కోసం ధనిక దేశాలు, కనీస అవసరాలను తీర్చేందుకు పేద, వర్థమాన దేశాల పారిశ్రామికీకరణ దారిలో వదులుతున్న కార్బన్ డై ఆక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు వాతవరణం మార్పులకు కారణమవుతున్నాయి. ఇది వర్తమాన, భవిష్యత్ మానవాళికి తీవ్ర హానికలిగిస్తున్నది. ఈ వినాశనంలో తొలుత దెబ్బతినేది పేదలు, పేద, వర్థమాన దేశాలే. ధనిక దేశాలు కబుర్లు చెప్పటం తప్ప చేస్తున్నదేమీ లేదు. 2019నాటి వివరాల ప్రకారం తలసరి 15.5టన్నుల కార్బన్డైఆక్సైడ్తో అమెరికా, 12.5తో రష్యా, 8.1తో చైనా, 6.5 టన్నులతో ఐరోపా సమాఖ్య ప్రపంచంలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. విడుదలవుతున్న మొత్తంలో ధనిక దేశాల వాటా 92శాతంగా ఉందంటే కారకులెవరన్నది స్పష్టమే. గతేడాది బ్రిటన్లోని గ్లాస్గోలో జరిగిన సిఓపి26 వాతావరణ సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారెక్కడ తమ లాభాలకు చిల్లుపెట్టే నిర్ణయాలను తీసుకుంటారో అన్న ముందుచూపుతో కాలుష్యాలకు కారణమవుతున్న ఇంథన కార్పొరేట్లకు చెందిన పైరవీకారులు రకరకాల పేర్లతో ఐదువందల మంది వచ్చారు. అధికారిక ప్రతినిధుల కంటే ఎక్కువగా ఉన్నారు. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ధనిక దేశాలు తమ కాలుషాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల వేగాన్ని చూసి నత్తలు పరహాసం చేస్తున్నాయి. చైనాలో ఇక ముందు బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి జరపరాదని ప్రభుత్వం గతేడాది నిర్ణయించింది. రష్యాతో తగాదా పెట్టుకున్న ఐరోపా దేశాలు ఇప్పుడు విద్యుత్ కోసం గాస్ బదులు బొగ్గువాడేందుకు పూనుకున్నాయి. ధనిక దేశాలు కార్బన్ క్రెడిట్ల పేరుతో వెలకట్టి తమ తప్పును ఒప్పుగా చూపేందుకు పూనుకున్నాయి. పెట్టుబడుల లేమిని ఆసరా చేసుకొని మనవంటి వర్ధమాన, పేద దేశాల్లో కాలుష్యాన్ని తగ్గించే పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని లేదా నిధులను అందచేస్తాయి. తద్వారా తగ్గే కాలుష్యాన్ని లెక్కించి తామే తగ్గించినట్లు తమ ఖాతాలో చూపేందుకు పెట్టుబడిదారీ వ్యవస్థ కొత్త పద్ధతిని ముందుకు తెచ్చింది. దీని వలన కొత్తగా కాలుష్యం పెరగకపోవచ్చు గానీ ఇప్పటికే కొనసాగుతున్నదాని సంగతేమిటి? కార్పొరేట్ల దోపిడీనే కాదు, సృష్టిస్తున్న కాలుష్యానికి కూడా వ్యతిరేకంగా పోరాడాల్సిందే!