Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కన్ను తెరిస్తే జననం... కన్ను మూస్తే మరణం... మధ్యలో ఉన్నదే జీవితం...' అన్నారో కవి. మన ఘనత వహించిన 56 ఇంచుల మోడీ సర్కార్ ఇప్పుడు అదే పదాల్ని కొంచెం మార్చుకుని కన్ను తెరిస్తే జీఎస్టీ... కన్ను మూస్తే జీఎస్టీ... మధ్యలోనున్న జీవితమంతా వదలకుండా జీఎస్టీయే జీఎస్టీ అంటూ చక్కగా జనం జీవితాలతో ఆడిపాడేసుకుంటున్నది. 'ఒకే దేశం- ఒకే పన్ను' అంటూ తమకే సాధ్యమైన ఓ టక్కు టమారా నినాదం రూపంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వస్తు సేవల పన్ను (జీఎస్టీ)... బిడ్డ పుట్టుక కోసం వెళ్లాల్సిన ఆస్పత్రుల నుంచి చస్తే మనిషిని కాలబెట్టాల్సిన శ్మశానం వరకూ అన్ని సమయాలు, సందర్భాల్లోనూ విధిగా చెల్లించాల్సి రావటమనేది నిజంగా మన దౌర్భాగ్యమే. విశ్వగురు అంటూ 'భక్తులు' అనునిత్యం జపిస్తున్న నరేంద్ర మోడీ ఏలుబడిలో పాలకులు పన్నుల పేరిట జనాన్ని ఏ రకంగా, ఎన్ని విధాలుగా దోచుకుతింటున్నారనే దానికి ఇవి ప్రత్యక్ష ఉదాహరణలు. బీజేపీ నినాదాల్లోని డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్న నగ సత్యాలు.
కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల కాదేదీ కవితకు అనర్హమన్నట్టు మన విత్తమంత్రి నిర్మలా సీతారామన్... బియ్యం, గోధుమలు, అప్పడాలు, పెరుగు ప్యాకెట్టు, లస్సీ, మజ్జిగ, ఆఖరికి బుడతలు పెన్సిల్‌ను చెక్కేందుకు వాడే షార్ప్‌నర్‌తో సహా దేన్నీ వదలకుండా బాదుడు బాది వదిలి పెట్టేశారు. పెంచిన జీఎస్టీ ఈనెల 18 నుంచి అమల్లోకి రావటంతో జనం జేబులు గుల్లవుతున్నాయి. గతనెల 28, 29 తేదీల్లో నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో... 'లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం ప్రీ ప్యాకేజ్డ్, ప్రీ లేబుల్డ్ రిటైల్ ప్యాక్‌లు, ప్రీ ప్యాక్డ్, ప్రీ లేబుల్డ్ పెరుగు, లస్సీ, మజ్జిగలపై ఐదు శాతం చొప్పున వస్తు సేవల పన్ను చెల్లించాలి...' అంటూ సూత్రీకరించి దేశం మీదికి వదిలారు. ఎల్ఈడీ బల్బులు, ఇంకులు, కత్తులు, బ్లేడ్లు, ప్రింటింగ్, రైటింగ్‌లకు వాడే పరికరాలతోపాటు చెక్కులను జారీ చేసేందుకు బ్యాంకులు వాడే రుసుములపై కూడా 18శాతం జీఎస్టీని చెల్లించాలంటూ హకూం జారీ చేశారు. దారుణమేమంటే అనారోగ్యం పాలై చావు బతుకుల మధ్యనున్న రోగి... ప్రాణాలు కాపాడుకునేందుకు ఆస్పత్రికి వెళితే... అక్కడ రూ.ఐదు వేల కంటే ఎక్కువ ఖరీదున్న గదుల్లో ఉండాల్సి వస్తే ఐదుశాతం జీఎస్టీని అతడు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తూ ఆ రోగి మరణిస్తే... అతడి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించే బొందలగడ్డలో సైతం 18శాతం జీఎస్టీ (ఇది ప్రత్యక్షంగా బాధితులు కట్టాల్సిన అవసరం లేదు. కానీ శ్మశానాన్ని నిర్వహించే కాంట్రాక్టర్లు కట్టాలి. అంతిమంగా ఆ గుత్తేదార్లు మరణించిన వారి కుటుంబీల నుంచే దాన్ని వసూలు చేస్తారు) చెల్లించాలనే దిక్కుమాలిన రూల్‌ను ప్రవేశపెట్టింది మన 'ఆత్మనిర్భర్ సర్కార్'.
నిజానికి జీఎస్టీ రూపంలో వేసిన ఈ భారాలు జనం ఆదాయ వ్యయాలను, సంబంధిత అంచనాలను, పొదుపు చర్యలను తారుమారు చేస్తున్నాయి. వాస్తవానికి కోవిడ్‌తో రెండేండ్లపాటు చాలీచాలని ఆదాయాలు, వేతన కోతలు, కొలువులు ఊడి రోడ్డున పడటాలు, వీటికితోడు అనేకానేక ఆరోగ్య సమస్యలతో ప్రజలు చచ్చిబతికిన వేళ వారిని ఆదుకోవాల్సిన బీజేపీ సర్కార్... ఇటీవల నూతన పార్లమెంటు భవనం మీద మోడీజీ ఆవిష్కరించిన సింహాల్లా కోరలు చాచింది. తనను ఎన్నుకున్న జనాలను శత్రువులుగా చూస్తూ యద్ధోన్మాదాన్ని ప్రకటించింది. ఫలితమే పెట్రోల్, డీజిల్ ధరలు, వంటగ్యాస్ వడ్డనలు. ఈ క్రమంలో సరుకు రవాణా చార్జీలు విపరీతంగా పెరగటంతో నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటాయి. పేదలు, సామాన్యులకు పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయి. ఇవి ప్రతీనెలా మన ఇంట్లో వేసుకునే బడ్జెట్‌ను తల్లకిందులు చేస్తున్నాయి. దీంతో తలకాయ కిందికి కాళ్లు పైకి పెట్టి ఆలోచించినా ఖర్చులు అడ్జెస్ట్ కాని దుస్థితి. పెట్రో ఉత్పత్తుల ధరల వల్ల సామాన్యుడి ఎర్రబస్సు చార్జీలు సైతం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగి 'అమ్మో... ప్రయాణాలు వద్దురా బాబోరు...' అనేట్టు చేస్తున్నాయి. అదే కరోనాను సాకుగా చూపి సందట్లో సడేమియాగా వృద్ధులు, జర్నలిస్టులు, ఇతర కొన్ని తరగతులకు రైళ్లలో ఇచ్చే సబ్సిడీలు, రాయితీలను కేంద్రం కట్ చేసి పారేసింది. దీంటో ఇటు బస్సెక్కలేక, అటు రైలుకూ పోలేక సామాన్యుడు నలిగిపోతున్నాడు.
జీఎస్టీ భారాలతో బెంబేలెత్తుతున్న జనం పరిస్థితి మున్ముందు మరింత దుర్భరంగా మారటం ఖాయం. ఇప్పుడున్న రోజువారీ ఖర్చులు మరింతగా పెరగటం తథ్యం. అందువల్ల మోడీ సర్కార్ అనుసరిస్తున్న ఈ దివాళాకోరు ఆర్థిక విధానాలను ప్రజలంతా సంఘటితంగా ప్రతిఘటించాలి. ఇప్పటికే పార్లమెంటులో ప్రతిపక్షాలు ఈ అంశంపై గళమెత్తాయి. సభ లోపలా బయటా జీఎస్టీపై పోరాడతామని ఆయా పార్టీలు ప్రకటించాయి. అలా పోరాడే శక్తులకు ప్రజలు అండగా నిలబడాలి. అలా నిలబడే క్రమంలో 'చిన్న దుకాణాలు అమ్మే వస్తువులపై జీఎస్టీని విధించబోం...' అంటూ ప్రకటించిన కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి.