Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజున ఇద్దరు సాహితీ ద్రష్టలగూర్చి ప్రస్తావించుకోవడం సందర్భంగానూ, అవసరంగాను ఉన్నది. ఒకరు మహాకవి గుర్రం జాషువా, మరొకరు మహారచయిత రాచకొండ విశ్వనాధశాస్త్రి (రావిశాస్త్రి). జాషువా వర్థంతి, రావిశాస్త్రి శతజయంతి సందర్భాలు అయినప్పటికీ, వారు సాహితీ సృజనను దేనిపైనైతే ఎక్కుపెట్టి రచనలు సాగించారో ఆ సమస్యలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. భారతీయ సమాజంలోని మనువాద భావజాల ఆధారిత కులవ్యవస్థ ఎంత అమానవీయంగా పడగవిప్పి సంచరిస్తోందో... ఎలుగెత్తి చెప్పి, కుల మత పీడనపై కవితా ఖడ్గాన్ని ఎత్తాడు జాషువ. శ్రమదోపిడీతో అశేష సామాన్య ప్రజలను బాధలకు, కష్టాలకు గురిచేస్తున్న వ్యవస్థ సారాన్ని తన రచనల ద్వారా బలంగా వినిపించి చైతన్యం నింపిన రచయిత రావిశాస్త్రి. ఇప్పటికీ వీరి రచనలు సమకాలీనతను చాటుకొంటునే ఉన్నాయి.
అణగారిన ప్రజల ఆర్తనాదాలను ఘంటమ్ములో నింపుకుని, నీవైనా నా ప్రశ్నలకు సమాధానములిమ్మని శివునికి నివేదించాడు. తలక్రిందుల సమాజానికి ప్రతీకగా శివునిగుడిలో క్రిందికి వ్రేలాడే గబ్బిలం ద్వారా కావ్యాన్ని వినిపించిన జాషువా నిజంగా ఈ యుగకవి. 'వేద చతుష్టయంబు ప్రభవించిన వ్యాసుని దివ్యవాణిలో మాదిగలుందురా? రుధిర మాంసములుంగల యంటరాని, వారాదిమ వాసులక్కటక్కటా! తలపోసిన నల్లగుండెలో, సూదులు మోసులెత్తును గృశోదరి! యెట్లు సహించుకొందువో!' అని వేదాలలో ఉపనిషత్తులలో ఇంకా ఎందులోవున్నారు ఈ అణగదొక్కబడినవారు? ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడు. 'కర్మసిద్ధాంతమున నోరుకట్టివేసి, స్వార్థలోలురు నా భుక్తిననుభవింత్రు, కర్మామననేేమొ, దానికి కక్షయేమొ, యీశ్వరుని చేత రుజువు చేయించవమ్మా!' అని నిగ్గదీసి దేవతను ప్రశ్నించాడు. ఇప్పుడు దళిత జనగొంతుకలు యెలుగెత్తి లేవనెత్తాల్సిన ప్రశ్నలివి! ఇది కేవలం సామాజిక అణచీవేతనే కాదు, ఆర్థికపరమైన దోపిడీ ఇందులో దాగున్న విషయాన్ని కూడా చైతన్యయుతంగా చెప్పాడు జాషువ. కర్మసిద్ధాంతాన్ని వ్యతిరేకించి, మత మౌడ్యాన్ని ఎండగట్టాడు. 'మతపిచ్చిగాని, వర్ణోన్నతిగానీ, స్వార్థచింతనము గానీ నా కృతులందుండదు' అని కుల మతాలకు కట్టుబడని విశ్వనరున్నని చెప్పిన జాషువ అడుగుజాడలో కవిలోకం నేడు మరింత పదునుగా కొనసాగాల్సి ఉన్నది.
ఇక రావిశాస్త్రి... తన కంటూ ఓ ప్రత్యేకత సంతరించుకున్న రచనలతో తెలుగు సాహితీరంగంలో ఎందరినో ప్రభావితం చేశాడు. తరతరాలుగా సమాజంలో ఉన్న కుళ్లును, దోపిడీని, తన రచనా శిల్పంతో కళ్లకుకట్టిన విప్లవ రచయిత. జేమ్స్జాయస్, లాంబ్ అండ్ డికెన్స్ ఇంకా గురజాడ, గిడుగు మొదలైనవారి ప్రభావంతో ప్రవాహంలా సాగిన రచన ఆయనది. నవలలు, కథలు ఎన్నోరాసారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాల మాండలికంలో అట్టడుగు వర్గాల సమస్యలపై అద్భుత రచనలు చేశారు. అందులో ఒక 'పిపీలికం' కథను ప్రస్తావించుకోవడం సముచిత సందర్భం. అందులో... పూర్వం ఒక అడవిలో చెట్టుకింద జీవిస్తున్న చీమకు ఒక సందేహం కలుగుతుంది. అదేమంటే 'నేనెవర్ని? ఎందుకు వచ్చాను? ఎందుకుపోతాను? అసలెందుకు పుట్టాను?' వీటికి సమాధానాలు తెలుసుకోవాలని కోరిక పుడుతుంది. మిత్రుని సలహాతో ఒక గురువు దగ్గరకు వెళుతుంది. తన కోర్కెను వెళ్లడిస్తుంది. ఆహా! మనకిక గ్రాసం దొరికినట్లేనని గురువుగారు, ప్రతిరోజు నాకో గిద్దెడు నూకలిస్తే చదువు చెబుతానంటాడు. అలాగే చేస్తుంది. ఓనమాలు, లెక్కలు బోధిస్తాడు. ఇక ఇంతే అయిపోయింది అని చెబుతాడు గురువు. అయితే నేనెవరిని స్వామి అని ప్రశ్నిస్తుంది చీమ. నువ్వు 'చీమ'వు అని చెపితే విని వెళ్లిపోతుంది. కానీ చీమంటే కళ్లా, కాళ్లా, తలా ఈ పదార్థం ఎందులో ఉంది అనే అనుమానమొచ్చి తిరిగి ఒక చతుర్వేది వద్దకు వెళ్ళి నానా శుశ్రూతలు చేసి చదువుకుంటుంది. ఈ జ్ఞానం కూడా బతుకులోని ఈతిబాధలు ఏమీ తొలగించదు. మరో మునివద్దకు వెళ్లి అడుగుతుంది. ఆ బ్రహ్మజ్ఞాని జన్మరాహిత్యం సాధించటమే మోక్షం అంటాడు. మోక్షం ఎందుకు స్వామీ అని తిరిగి ప్రశ్నిస్తే స్వామిదగ్గర జవాబులేదు. తిరిగి తన నివాసానికి వచ్చేసరికి, తన ఇంటిని ఒక బలమైన పాము ఆక్రమించి ఉంటుంది. ఎవరునీవు? మా ఇంట్లోకి వచ్చి ఆక్రమించావు అన్యాయం కదా! అని చీమ ప్రశ్నిస్తుంది. ఓసి పిచ్చిదాన నేను సుఖభోగిని, నువ్వు కష్టజీవివి. కష్టజీవులు కష్టపడాలి. సుఖభోగులు సుఖించాలి. ఇదే ప్రకృతి ధర్మం. కాదంటే కాటేసి చంపుతాం అంటుంది పాము. అప్పుడర్థమవుతుంది చీమకు, నేను కష్టజీవిని అని ఏ జ్ఞానులూ చెప్పలేదు. జరిగే అన్యాయాలను ఏ చదువూ తెలపలేదని, ఆలోచించి... తన సహచరులను ఐక్యపరచి పాముపై తిరుగుబాటు చేసి అంతమొందిస్తాయి. ఇదీ కథ. సమాజంలో ఇప్పుడు జరుగుతున్నదీ అదే కదా! కోట్లాది మంది శ్రమజీవులు రెక్కలు ముక్కలు చెసుకున్నా వారికి దక్కాల్సింది దక్కడం లేదు. శ్రమచేయనివారికి సంపద పోగుపడుతోంది. ఇక ఆలోచించి చైతన్యపడాల్సింది చీమల్లాంటి జనులేకదా! ఇలాంటి గొప్ప కథలను అందించిన రావిశాస్త్రికి శతజయంతి జేజేలు. ఈ స్పృహతో సాహితీ సృజన కొనసాగించడం నేటి రచయితల కర్తవ్యం.