Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దశాబ్దాల పాటు ''శతాబ్దాలు మనవే'' అనుకుంటున్నాం. కాని ఆచరణే మధ్యయుగాల్లోకి పారుతోంది. రాష్ట్రపతిగా దిగిపోతూ రామ్నాథ్కోవింద్ చెప్పిన కొన్ని మాటలు వినడానికి ఉత్సాహపూరితంగా ఉండవచ్చు. కొందరికి ఉద్రేకపూరితంగా కూడా అనిపించవచ్చు. ప్రభుత్వాల విధానాలను మన రాష్ట్రపతులు ప్రభావితం చేసే అవకాశాలు తక్కువ. సర్వశ్రీ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ పుణ్యాన ''రబ్బర్ స్టాంప్'' అన్న 'కీర్తిని' మూటగట్టుకున్న పదవి అది. అయితే రామ్నాథ్కోవింద్ గారి సెండాఫ్ మాటలు ముచ్చటైన ముత్యాల మూటలే! ఆ లెక్కన ఏ రాష్ట్రపతి వీడ్కోలు మాటలు మాత్రం ముత్యాలు కావూ...?! మనదేశంలో 'ప్రజాస్వామ్యం' కోవింద్ మురిసిపోయినంత గొప్పగా లేదనేది నిష్టురసత్యం. ''బై ది పీపుల్, ఫర్ ది పీపుల్'' ఏనాడో ఆవిరైపోయింది. ''ఉత్తరప్రదేశ్‌లోని పరౌంఖ్ గ్రామం నుండి వచ్చిన ఓ సామాన్య కుటుంబీకుడినైన నేను, దేశ ప్రథమ పౌరుడిగా మీ ముందు నిలబడటమే మన ప్రజాస్వామ్యానికి గీటురాయి'' అన్నారాయన. అదే యూపీలో, ఇదే అయిదేండ్లలో జరిగిన 'అత్రాస్'ల సంగతేమిటని సామాన్య దళిత కుటుంబాలు ఆక్రోషిస్తున్నాయిసార్! ముఖ్యంగా ఈ ఐదేండ్లలోనే మన దేశ 'ప్రజాస్వామ్యం' అపహాస్యానికి, నగుబాటుకు గురైందని ఎందరో కష్టజీవులు ఆవేదన చెందుతున్నారు.
అసలీ దేశంలో ప్రశ్నే నిషేధమని మీకు తెలుసా కోవింద్ సాబ్! మీరు 'ప్రజాస్వామ్యం' గురించి ధర్మోపదేశం చేస్తున్న సందర్భంలో దేశంలో 'విపక్ష ముక్త్ భారత్' అని బీజేపీ పథకాలేస్తోందని బహుశా మీకు తెలియదనుకోవాలేమో...! కొన్ని పార్టీలను చీల్చి తమ ఖాతాలో వేసుకోడానికి బీజేపీలో కొన్ని ఉపసంఘాలేర్పాటు చేయడం, డబ్బు సంచుల దగ్గరి చుట్టం అమిత్‌షానే దానికి అధినేతగా ఉంచడం ద్వారా దేశంలో ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ఈ 'సచ్ఛీలత' దీనజనోద్ధరణ కోసం కాదని ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు, చివరికి గుజరాత్‌లోనైనా చెపుతారు. ఇటీవల ఒక సందర్భం పరిశీలిస్తే చాలు.
ఒంటికి దురదలొస్తే ఏదైనా మందేసుకోవచ్చు. అదే నోటికొస్తే? అదీ అధికారం వల్ల వచ్చిన దురదైతే? పైగా నోట్లో తీటకొయిలాకుల (దురదగొండి ఆకు) వనాలు పెంచుకున్న నేతలైతే ఇక అడ్డూ అదుపు ఏముంటుంది? ''ప్రజాస్వామ్యం'' సంగతి దేవుడెరుగు పాలితులంతా వీరికి సేవకులుగానే కనపడేటట్టున్నారు. నిత్యం ఏదో ఒక సమస్యపై పాలకులను నిలదీస్తున్న కార్మికులైతే వీరికండ్లకు తిరగబడుతున్న పొరకల్లాగా కనపడుతున్నారు. చెప్పుకింద పడుండాల్సిన బానిసలకు తోకలెందుకు లేస్తున్నారు? ఆ కొండెల్లో నుండి బుసలెందుకు వినపడుతున్నారు? ''ధిక్కారమున్ సైతునే..!'' అంటూ కార్మికులపైనా, వారి సంఘాలపైనా సర్కార్ విరుచుకుపడుతోంది.
ఇటీవల ఢిల్లీ వెళ్లి తమ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించాలని కేంద్రమంత్రిగా ఉన్న ఓ'పవర్ తిరుగుడు పువ్వు' నడిగితే ''దాన్ని ప్రయివేటీకరిస్తే మీకేంటి నష్టం?'' అని నోరు పారేసుకున్నాడు. మకుటాలు ఊడగొట్టబడ్డ తర్వాత పుట్టిన మూడవతరం వాడు ఈ యువరాజా వారు. ఈయనకు బహుశా అదే విశాఖపట్నంలో వాజ్‌పారు సర్కార్ భాజా భజంత్రీలతో హిందుస్థాన్ జింక్‌ను వెన్నపూసలా ఓ ప్రయివేటు వాడి నోటికందిస్తే అది నేడు ఆవిరైన తీరు కనపడుతున్నట్లు లేదు. సదరు ఆసామి దాని సారాన్ని పిండేసుకుని, లాభాలు జుర్రేసుకుని, దేశానికి జింక్ అవసరం ఎంతో ఉన్నా నేడు దాన్ని బంద్ పెట్టాడని తెలియదనుకోవాల్నా? లేదా 'తనువూ, మనసూ' పెట్టుబడికి గిర్వి పెట్టేసిన మెదళ్లలో మొలిచే ఆలోచనలు ఇంతకన్నా ఏముంటాయనుకోవాల్నా? ఇక్కడున్న ఉపకథ మెయిన్ కథలో అంతర్భాగమే! సింథియా వనంలో కాసిన ఈ పిందెను ఆబగా మింగేసిన బీజేపీకి 'కుటుంబపాలన' ఇక్కడ గుర్తుకు రాకపోవడం గమనార్హం!
ప్రభుత్వాల విధానపరమైన అంశాల్లో కార్మికుల, వారి సంఘాల జోక్యమేంటనేది బీజేపీ వంటి పార్టీల చొప్పదంటు ప్రశ్న. ఐదేండ్లు పాలించమన్న పాపానికి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తెగనమ్మే హక్కు వీరికెవరిచ్చారు? ఐదేండ్లుండమని ఇల్లు ఎవరికైనా కిరాయికిస్తే దాన్ని వాడు అమ్మేసుకోవచ్చా? ఆ తెగింపునేమంటాము? పర్యావరణాన్ని రక్షించాలన్న ప్రథమ పౌరుడి సలహా కనీసం బీజేపీ పాలిత ఉత్తరాఖాండ్‌లో వరుసగా వరదలొచ్చి పుణ్యక్షేత్రాలకే ముప్పు దాపురిస్తున్నా పట్టించుకున్నదెవరూ? నిజమైన భక్తులు విగత జీవులవుతున్నా పర్యావరణ విధ్వంసమే ఆ ప్రభుత్వం తక్షణ కర్తవ్యంగా పెట్టుకుందిగా?! మధ్యప్రదేశ్‌లో గిరిజనులను వారి నెలవుల నుండి బేదఖల్ చేస్తూ గుజరాతీ అస్మదీయుడికి ఇనుప ఖనిజం గనులు పందారం చేసింది మోడీ సర్కార్. అక్కడ జరిగేదీ పర్యావరణ విధ్వంసమే. 'ఆనవాయితీగా' వీడ్కోలు సందర్భంగా చెప్పే మాటలే అనుకుంటా ''విద్య, వైద్యం ప్రజలందరికి'' అందాలనే కోవింద్గారి ఆకాంక్ష! కార్పొరేట్ల భల్లూకపు పట్టులో ఉన్న మోడీ సర్కార్ ఏవి చేయట్లేదో వాటన్నింటినీ పోతూ పోతూ ఆకాంక్షిస్తే ఉపయోగమేమిటి రాష్ట్రపతి మహౌదరు?! మీ ఆకాంక్షల అధికార దండాన్ని సంతాలీ తల్లి అందుకుని ముందుకు తీసుకుపోతే ఎంత బాగుండు!