Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ చలన చిత్రోత్సవ విభాగం ఇటీవల ప్రకటించిన 68వ జాతీయ పురస్కారాల్లో అత్యధిక భాగం దక్షిణాది సినిమాకు దక్కాయి. తమిళ సినిమాకు పది, మలయాళానికి తొమ్మిది, తెలుగుకు నాలుగు, కన్నడకు రెండు అవార్డులు లభించాయి. ఇటీవలి కాలంలో ఇతివృత్తపరంగా, నిర్మాణపరంగా తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలు చేస్తున్న ప్రయోగాలకు, ప్రయత్నాలకు ఇది మంచి గుర్తింపు. సంపన్నులకే పరిమితమైన విమాన ప్రయాణాన్ని సామాన్యులకూ సాధ్యం చేసిన గోపీనాథ్ నిజజీవిత కథకు వెండితెర రూపం 'సూరారై పోట్రు'. దర్శకురాలు సుధ కొంగర రూపొందించిన ఈ చిత్రం తెలుగులో 'ఆకాశమే హద్దుగా...' వచ్చి ప్రేక్షకాదరణ పొందింది. ఏదైనా కొత్త ఆలోచన చేసినప్పుడు, అది అప్పటికే ఉన్న వ్యాపార, వ్యవహార, సాంప్ర దాయ పునాదులను కదిలించే ప్రయత్నం అయినప్పుడు - లెక్కలేనన్ని అవమానాలూ, ఆటంకాలూ ఎదురవుతాయి. నష్టాలూ కష్టాలూ వరసబెట్టి భయపెడతాయి. ఆ నిరుత్సాహ నిలువరింతలను ఎదిరించి ఎదురీదితేనే విజయమనే గమ్యాన్ని చేరగలుగుతాం. 'సూరారై పోట్రు' ఈ ఇతివత్తం ఆధారంగా అత్యంతగా ఆకర్షణీయంగా, ఆద్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కింది. కధానాయకుడిగా సూర్య అత్యంత సహజంగా నటించి, ఈ సినిమాకు ప్రాణం పోశాడు. భర్తకు చేదోడు వాదోడుగా నిలిచే భార్య పాత్రలో అపర్ణా బాల మురళి అద్భుతంగా నటించి, రాణించింది. ఈ ఇద్దరికీ జాతీయ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి పురస్కారాలు రావడం ప్రత్యేక విశేషం. ఒకే సినిమాలోని నటీనటులకు ఒకేసారి ఇలా ఉత్తమ నట పురస్కారాలు రావడం చాలా అరుదైన సంగతి!
సామాజిక ప్రయోజనం ఉన్న జైభీమ్ వంటి చిత్రాల్లో నటించటం, నిర్మించటం, సామాజిక సేవలో పాల్గొనడం, వివిధ వర్తమాన పరిణామాలపై స్పందించటం ద్వారా సూర్య ప్రత్యేక గుర్తింపు పొందాడు. సినీ నటులకూ సామాజిక బాధ్యత ఉందని తన మాటల ద్వారా, చేతల ద్వారా తరచూ చాటిచెబుతాడు. సూరారై పోట్రులో మొక్కవోని లక్ష్యం, ధైర్యం ఉన్న కథా నాయకుడి పాత్రలో జీవించి, మెప్పించి... హిందీ నటుడు అజరు దేవ్గన్తో కలిసి ఉత్తమ నటుడుగా నిలిచాడు.
ప్రేమా పెళ్లి వ్యవహారాల్లో కులవివక్ష, ఆర్థిక వివక్ష మాత్రమే కాదుబీ రంగు వివక్షా ఉంటుంది అనే ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న తెలుగు సినిమా కలర్ ఫొటో. అంతగా గుర్తింపులేని నటీనటులతో, తక్కువ బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా తెలుగులో ఉత్తమ చిత్రంగా ఎంపికవడం చిన్న సినిమాకు దక్కిన గౌరవం. సంగీతం, నృత్యం ప్రధాన అంశాలుగా తెరకెక్కిన తెలుగు చిత్రం 'నాట్యం' రెండు పురస్కారాలను పొందింది. 'అల వైకుంఠపురంలో ...' తమన్ సంగీతానికి గుర్తింపు దక్కింది. మాలయాళ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియమ్' కోసం జానపద రీతి గీతం పాడిన సామాన్యురాలు సంజయమ్మకు ఉత్తమ నేపథ్య గాయని అవార్డు లభించింది.
ఇటీవల బాలీవుడ్ సినిమాల్లో మితవాద శక్తులు ప్రవేశించి, తప్పుడు భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. చరిత్రను వక్రగతి పట్టించి, అవాస్తవ అంశాలకు చిత్రపటం కడుతున్నాయి. అందుకు భిన్నంగా దక్షిణాది నుంచి ముఖ్యంగా తమిళ, మలయాళ సినీ రంగాల నుంచి చర్చించదగిన వర్తమాన, సామాజిక అంశాలను ఇతివృత్తంగా చేసుకొని సినిమాలు వస్తున్నాయి. ఓటీటీ వచ్చాక కొత్త కొత్త కథలతో, కొత్త నటులతో అన్ని భాషల్లోనూ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మక కథలకు, సామాజిక ఇతివృత్తాలకు గుర్తింపునిస్తే... అలాంటి ప్రయత్నాలు మరిన్ని జరుగుతాయి. కోట్లు వెచ్చించి నిర్మించే సినిమాలకు ప్రేక్షకాదరణే అత్యంత అవసరమైన ఆర్థిక ఆలంబన. పురస్కారాలు అనేవి నటీనటులకు, దర్శకులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక గౌరవాన్ని, గుర్తింపునూ అందిస్తాయి. ప్రేక్షకులను ఉత్తమ వీక్షణాభిరుచి వైపు మళ్లించటానికి కొంతవరకూ దోహదపడతాయి. సినిమా అత్యంత ఆధునికతను సంతరించుకున్న కళారూపం. కోట్ల ఖర్చు, విస్తారమైన కార్యకలాపాల రీత్యా వాణిజ్యపరమైన అంశం అయినప్పటికీ- అది సమాజంపై చూపే ప్రభావం చాలా విస్తారమైనది. ఆ రీత్యా ఆదరణకు అవసరమైన హంగులూ రంగులూ సమకూర్చుకుంటూనే- సినిమా ప్రజాజీవితానికి పట్టం కట్టాలి. అలాంటి మంచి సినిమాలకు ప్రేక్షకాదరణతో పాటు ప్రభుత్వం పురస్కార మాలలతో ఉత్సాహ ప్రోత్సాహాలను అందించాలి.