Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన గురుకులాలు నేడు ''పేరు గొప్ప.. ఊరు దిబ్బ'' అన్నట్టుగా తయారయ్యాయి. గురుకుల విద్యాలయాలు ప్రారంభించి ఆరేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ సొంత భవనాలు లేవు. విద్యార్థులకు అవసరమైన కనీస వసతులైనా కల్పించలేదు. 80శాతం పైన పేదల పిల్లలే చదువుకునే గురుకులాల్లో నాణ్యమైన తిండి లేక విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. తరచూ ఫుడ్ పాయిజన్లకు తోడు.. మంచినీళ్లు కూడా కలుషితం కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. నాసిరకం, కలుషితమైన ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థులు అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం శూన్యం. దీంతో కొంత మంది తింటే కడుపు నొప్పి వస్తోందని తక్కువ తింటున్నారు. మరికొందరు అన్నం తినడం మానేస్తూ బయట చిరుతిండ్లు తింటున్నారు. ఫలితంగా విద్యార్థులకు తీవ్ర గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తున్నాయి. గురుకులాల్లో నాణ్యమైన వస్తువులు, తాజా కూరగాయలు వినియోగించడం లేదు. మిషన్ భగీరథ నీటిని సప్లై చేస్తున్నట్టు చెబుతున్నా, అనేక చోట్ల ఆ నీళ్లు అందడం లేదు. భగీరథ పైప్ లైన్లు పగిలి వాటర్ కంటామినేట్ అవుతోంది. బోర్ వెల్స్ దగ్గర కూడా సరైన క్లీనింగ్ లేకపోవడంతో తాగే నీరు కలుషితం అవుతున్నది. ఈ కారణంగా ఈ ఏడాదిలోనే ఇప్పటి దాకా 615 గ్యాస్ట్రిక్ సంబంధిత కేసులు నమోదయ్యాయని గురుకుల ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ స్పష్టం చేస్తున్నది.
గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారం అందిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వ పెద్దలు... అస్వస్థతతో ఆసుపత్రుల పాలవుతున్న విద్యార్థుల క్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ అనేక గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతుండటం గమనార్హం. చిన్నచిన్న గదులలో 30 నుంచి 40 మంది విద్యార్థులను ఉంచితే ఎంత నరకయాతన? పైగా స్లాబు పెచ్చులు ఎప్పుడు ఊడిపడతాయోనన్న భయం! ఇక మరుగుదొడ్లు, మూత్రశాలల పరిస్థితి చెప్పనవసరం లేదు. అధ్వాన్నంగా పడి ఉంటున్న వాటిని ఉపయోగిస్తే... పలు రకాల జబ్బులు రావటం ఖాయం. మరోవైపు విపరీతంగా పడుతున్న వానలతో వారి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఈ పరిస్థితిని చూస్తుంటే గురుకులాల్లో నాణ్యమైన చదువే కాదు, నాణ్యమైన భోజనం కూడా ఉత్తమాటే అని తెలిపోతోంది. ముక్కిపోయిన బియ్యం, కుళ్లిపోయిన కూరగాయలతో మొక్కుబడిగా చేసిన వంట, విద్యార్థుల పాలిట నరకమవుతోంది. మొన్నటికి మొన్న బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్‌తో వందలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. రెండు రోజుల కింద అదే ట్రిపుల్ ఐటీ విద్యార్థి జీర్ణకోశ వ్యాధితోనే మృతి చెందాడు. ఉన్నత వర్గాలు చదువుకునే ఇలాంటి చోట కూడా పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ప్రభుత్వ పెద్దలు పాఠాలు నెర్చు కోవడం లేదు సరి కదా ఎదురుదాడికి దిగుతున్నారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నిండా రెండు నెలలు కాలేదు. రోజురోజుకు పెరుగుతున్న వసతి గృహాల్లో కలుషిత ఆహార కేసులు మాత్రం కలవరపెడుతున్నాయి. అయినా ప్రభుత్వానికి కానీ, సంబంధిత అధికారులకు కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ పరిణామాలు విద్యార్థులతోపాటు, తల్లిదండ్రులను కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలా మౌలిక వసతుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి దీర్ఘకాలిక లక్ష్యాలంటూ లేకపోవటమే ప్రధాన కారణం. ప్రభుత్వానికి చిత్తశుద్ధే ఉంటే... రాష్ట్రం లోని విద్యార్థుల సంఖ్య, వారి డిమాండ్‌కు అనుగుణంగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించటం, శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయులు, సిబ్బందిని నియమించటం, నిర్వహణ కోసం నిధులు కేటాయించి, వాటిని నిర్ణీత సమయంలో ఖర్చు చేసి ఉండేవారు. కానీ కనుచూపు మేరలో ఆ పరిస్థితి కానడటం లేదు. అందువల్ల ఇప్పటికైనా భావి భారత పౌరుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సర్కారు ... గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణకు ఒక సమగ్ర విధానాన్ని, స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలి. వాటి అమలు కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలి. అప్పుడే అవన్నీ బాగుపడతాయి. వసతి గృహాలకు ఎప్పటికప్పుడు సన్న బియ్యం పంపిణీ చేయడం, నిల్వ చేయకుండా తాజా కూరగాయలు, నాణ్యమైన వస్తువులు పంపిణీ చేయడం, ఫుడ్ సేఫ్టీ అధికారులు, హెల్త్ సూఫర్‌వైజర్లు తనిఖీ చేసి ఆహారాన్ని పరీక్షించడం చేస్తే ఫలితాలుంటాయి. అప్పుడే గురుకులాల లక్ష్యం నేరవేరతుంది. ఈ సమస్యలన్నీ ఇలా ఉండగానే, పేదవారికి, అణగారిన ప్రజలకూ విద్యను దూరం చేసే ప్రక్రియ నూతన విద్యా విధానంతో దేశంలో విస్తరిస్తోంది. రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయంతో పాటు విద్యను కూడా కేంద్ర ప్రభుత్వం ఆక్రమించుకున్న ఫలితమిది.