Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా ప్రజా ప్రతినిధుల సభ(కాంగ్రెస్) స్పీకర్ నాన్సీ పెలోసీ. ఆ దేశ అధికార వ్యవస్థ వరుసలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల తరువాత స్పీకర్ ఉంటారు. ఏప్రిల్ నెలలో ఆసియా టూర్‌ను నాన్సీకి కరోనా కారణం చూపి రద్దు చేశారు. ఇప్పుడు మరోసారి సదరు అంశాన్ని తెరమీదకు తెచ్చి దానిలో భాగంగా తైవాన్ వెళతారంటూ ఖరారుగానీ సందర్శన, దాని పర్యవసానాల గురించి పెద్ద చర్చకు తెరలేపారు. తైవాన్ పర్యటన జరిపేదీ లేనిదీ అధికారికంగా స్పష్టం చేయకుండా కొద్ది రోజులుగా అమెరికా దోబూచులాడుతోంది. దీన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులెవరూ లేరు. శషభిషలకు తావులేకుండా అమెరికా ఎత్తుగడ ఏదైనప్పటికీ తమ అనుమతి లేకుండా తైవాన్‌లో గనుక అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతామన్నట్లుగా చైనా తీవ్ర హెచ్చరిక చేసింది.
తైవాన్ దీవి చైనాలోని తిరుగుబాటు రాష్ట్రం, 1948 నుంచి విడిగా ఉంటున్నది. అది కూడా ప్రధాన భూభాగంలో అంతర్భాగమని, ఒకే చైనాగా గుర్తిస్తూ అమెరికా ఈ మేరకు ఒప్పందాలపై సంతకాలు కూడా చేసింది. ఐక్యరాజ్యసమితిలో, మరోచోట ఎక్కడా దీని గురించి ఎలాంటి వివాదాలు కూడా లేవు. కానీ, ఇప్పుడు ఈ ఒప్పందాల స్ఫూర్తికి విరుద్ధంగా అమెరికా, జపాన్ తదితర దేశాలు రాజకీయాలు చేస్తున్నాయి. తైవాన్ పౌరులను ఒప్పించిన తరువాతే తప్ప బలవంతంగా విలీనం చేయకూడదంటూ తైవాన్‌లోని విలీనవ్యతిరేక శక్తులను రెచ్చగొడు తున్నాయి. అక్కడి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆయుధాలు అందిస్తున్నాయి. స్వాతంత్య్ర ప్రకటనలు చేయిస్తున్నాయి. దీనిలో భాగంగానే నాన్సీ పెలోసి తైవాన్ పర్యటనకు తెరలేపారు.
ఎవరైనా తైవాన్‌లో విహార యాత్రలు చేయవచ్చు. పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ దాన్ని ఒక సార్వభౌమత్వ దేశంగానూ, అక్కడ అధికారంలో ఉన్నవారిని పాలకులుగానూ గుర్తించి సంబంధాలు పెట్టుకుంటామంటే, అధికారిక పర్యటనలు చేస్తామంటే మాత్రం చైనా అంగీకరించదు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ నిబంధనల మేరకు చైనా అంగీకారం, అనుమతి లేకుండా అధికారికంగా ఎవరు తైవాన్‌లో అడుగుపెట్టినా అది చైనా సార్వభౌమత్వాన్ని ధిక్కరించినట్లే అవుతుంది. పెలోసి పర్యటనతో తనకేమీ సంబంధం లేనట్లు, తెలియదన్నట్లు అధ్యక్షుడు జో బైడెన్, అధికార యంత్రాంగం ప్రపంచాన్ని నమ్మింప చూస్తున్నది. పెలోసీ తైవాన్ పర్యటన మంచి ఆలోచన కాదని మిలిటరీ భావించినట్లు అధ్యక్షుడు జో బైడెన్ చెప్పినట్లు అధ్యక్ష భవనం ప్రకటన పేర్కొన్నది తప్ప, బైడెన్ వైఖరి ఏమిటన్నది చెప్పలేదు. బైడెన్ చెప్పిందానికి అర్థం ఏమిటో తనకు తెలియదనీ, బహుశా తాను ప్రయాణించే విమానాన్ని కూల్చివేయటం లేదా అలాంటిదే ఏమైనా జరగవచ్చునని మిలిటరీ భయపడుతోందేమో నాకు తెలియదని పెలోసీ కూడా గతవారంలో విలేకర్లతో అన్నారు. స్పీకర్‌కు మేం చెప్పాల్సింది చెప్పాం, ఒకే చైనా అన్న వైఖరిలో ఎలాంటి మార్పులేదని, వెళ్ల దలచుకుంటే ప్రభుత్వం నివారించలేదని అధికార యంత్రాంగం ప్రపంచం చెవిలో పువ్వు పెట్ట చూసింది. జో బైడెన్ ఇప్పుడు ఇంటా బయటా విశ్వసనీయత సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఉక్రెయిన్ సంక్షోభం నుంచి నాటో కూటమి పరువును కాపాడాల్సిన, అమెరికాలో నవంబరులో జరిగే ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీని గట్టెక్కించాల్సిన బాధ్యత బైడెన్‌దే. సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్ అన్నట్లుగా బైడెన్ వ్యూహకర్తలు తైవాన్ సమస్యను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. వత్తిడి ద్వారా రష్యాకు చైనాను దూరం చేయటం, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు, వీటన్నింటిని చూపి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు పొందటం వంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి.
తైవాన్, హాంకాంగ్, టిబెట్, షింజియాంగ్ రాష్ట్రంలో మానవహక్కుల గురించి అమెరికా సంధిస్తున్న అస్త్రాలేవీ పని చేసేవి కాదు. ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా తమ ప్రయోజనాలకు హానికలిగే వాటిని వేటినీ సహించేది లేదని చైనా పదే పదే స్పష్టం చేస్తోంది. హాంకాంగ్, మకావు దీవుల విలీన సమయంలో 50 సంవత్సరాల పాటు(2048 వరకు) అక్కడి యధాతధ స్థితిని కొనసాగనిస్తామని, ఒకే దేశం-రెండు వ్యవస్థలన్న తన వైఖరిని చైనా ఎప్పుడో స్పష్టం చేసింది. వాటి మాదిరే అదుపులో ఉన్నంత వరకు తైవాన్ అంశంలో కూడా చైనా అప్పటి వరకు తొందరపడే ధోరణిలో లేదు. ఈ లోగా అమెరికా కూటమి దేశాలు దుస్సాహసానికి పాల్పడి తెగేదాకా లాగితే పరిణామాలు వేరుగా ఉంటాయి. విచక్షణను ఉపయోగించి వెనక్కు తగ్గితే పెలోసీ పర్యటన వివాదం టీకప్పులో తుపానులా ముగుస్తుంది.