Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టు ఇప్పుడు కేంద్రం కన్ను పేదలకిచ్చే ఉచితాలపై పడింది...! ఈ ఉచితాలే దేశానికి అనర్థమన్నట్టుగా ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేస్తుండగా, బీజేపీ నాయకుడు అశ్వినీ ఉపాధ్యాయ ఈ ఆంశమై ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారు. ఇదిలా ఉండగా, గత ఎనిమిదేండ్లుగా దేశం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలపై ఏనాడూ అఖిల పక్షాన్ని పిలవని కేంద్ర ప్రభుత్వం... హఠాత్తుగా శ్రీలంక పరిణామాల సాకుతో అన్ని పార్టీలను కూర్చోబెట్టి, రాష్ట్రాల్లో పెరుగుతున్న అప్పులు, అమలవుతున్న ఉచిత పథకాలపై హెచ్చరించింది. గత నెలలో ధర్మశాలలో జరిగిన రాష్ట్రప్రభుత్వ చీఫ్ సెక్రటరీల సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన 'ప్రవచనాల'కు కొనసాగింపుగానే ఈ అఖిలపక్షంలో ఏలినవారి ఉపదేశాలు సాగడం గమనార్హం!
ఇప్పటికే పేదలకు అందుతున్న అరకొర సంక్షేమ పథకాలకు భారీగా కోతలు పడుతున్నాయి. ఇప్పుడు ఉచితానుచితాల గురించి చర్చలేపి ఏకంగా వాటిని రద్దుకే సిద్ధమయ్యారు మన ప్రభుత్వ పెద్దలు...! అయినా ఈ ప్రభుత్వాలు పెద్దలకిచ్చే ఉచితాలతో పోలిస్తే పేదలకిచ్చే ఉచితాలు ఏపాటివి? ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం మాని, అజీర్తితో ఉన్న వారికి కుక్కి కుక్కి తినిపించడాన్ని ఏమనాలి? ఇలాంటి విధానాల ఫలితమే కదా అసంఖ్యాకుల అర్థాకలి జీవితాలు? వ్యవసాయ సంక్షోభం నానాటికి తీవ్రమై కోట్లాది మంది ఆ రంగాన్ని వదిలేస్తున్నారు. యువతకు కొత్త ఉద్యోగాలు లేవు. ఉన్న అరకొర ఉపాధిలో భద్రత లేదు. ఈ పరిస్థితుల్లో, ఇప్పటికే అడ్డూ అదుపూ లేకుండా పెరిగిన ధరలతో జనం అల్లాడుతుంటే.... పెట్రోల్, డీజల్, గ్యాస్ మొదలు... ఉప్పు, పప్పు, బియ్యం, నూనెలు మొదలైన సమస్త నిత్యావసరాలకు తోడు, స్మశానంలో కర్మకాండలపై కూడా జీఎస్టీ విధించి పేదల ఉసురు తీస్తున్నారు. ఏలినవారు మోపుతున్న ఈ భారాల ముందు వీరికిచ్చే ఉచితాలు ఏపాటివి?
మరోవైపు వేళ్ళ మీద లెక్కపెట్టగలిగిన బడా కార్పొరేట్ బాబులకేమో ఈ ఏడు సంవత్సరాల మోడీ పాలనలో రూ.10లక్షల 72వేల కోట్ల రూణాలు రద్దు చేశారు. మరో 4లక్షల 50వేల కోట్ల రుణాలను రూ.లక్ష 61 వేల కోట్ల తగ్గింపుతో 'సెటిల్మెంట్' చేశారు. ఇదే డబ్బు పేదల ఉపాధికి ఖర్చు చేసివుంటే ఆకలి సూచిలో, 116 దేశాల జాబితాలో మన దేశం 101వ స్థానంలో నిలిచేదా? ఇదే సమయంలో ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతం ఆదానీ నాల్గవ స్థానానికి ఎదిగారు. 2016-20 మధ్య కాలంలో ముఖేష్ అంబానీ నికర సంపద 350శాతం పెరగగా, ఆదానీ సంపద 750శాతం పెరిగింది. ఏలినవారి 'దేశభక్తి'యుతమైన 'బృహత్తర' పథకాల వల్ల భారీగా పెరిగిన బడా బాబుల ఆస్తులకు ఇది మచ్చుకు ఓ ఉదాహరణ మాత్రమే. దేశంలోని 24శాతం మంది భారతీయులు నెలకు రూ.3,000 కంటే తక్కువ ఆదాయం పొందుతుంటే... అంబానీ, ఆదానీలు మాత్రం గంటకు రూ. 90కోట్లు పోగేసుకుంటుకున్నారు. ఇది చాలదన్నట్టు, 6లక్షల కోట్ల విలువైన ప్రభుత్వరంగ సంస్థలనూ, ఆస్తులనూ వీరికి అప్పనంగా కట్టబెట్టేందుకు 'జాతీయ నగదీకరణ' పథకానికి తెర తీసారు. ఇలా దేశ సంపదనంతా సంపన్నులకు దోచిపెడుతూ, పేదలకు ఇస్తున్న కొద్దిపాటి ఉచితాలే దేశానికి నష్టదాయకమన్నట్టు రాద్దాంతం చేయడం ఏ ప్రయోజనాల కోసం.
ఇక రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడుతున్న కేంద్రం తీరు 'గురివింద' సామెతను గుర్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ దేశం అప్పు ఒక కోటీ యాభె ౖఅయిదు లక్షల కోట్లు. ఇందులో 67ఏండ్ల పాలనా కాలంలో వివిధ ప్రభుత్వాలు చేసిన అప్పు రూ.55 లక్షల కోట్లు కాగా, కేవలం ఎనిమిదేండ్ల మోడీ పాలనలో చేసిన అప్పు రూ.100లక్షల కోట్లు. దీనిని బట్టి దేశాన్ని అప్పులపాలు చేస్తున్నది ఎవరు? రాష్ట్రాలా? కేంద్రమా? ఇంతా చేసి చివరికి ఏం సాధించారు? డాలర్‌తో పొలిస్తే రూపాయి చరిత్రలో ఎన్నడూ లేనంతగా పతనమైంది. విదేశీ మారక ద్రవ్యం హరించుకు పోయింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రెక్కలొచ్చిన గుర్రాలకంటే వేగంగా దేశం విడిచి పారిపోతున్నాయి. దేశీయ చిన్న పరిశ్రమలు వేల సంఖ్యలో మూలపడి లక్షలాది ప్రజలు ఉపాధి కోల్పోయారు. 'నయా ఉదారవాద' విధానాల్లో ఉన్న మతలబే ఇది. ఇలా దేశాన్ని అప్పుల ఊబిలో ముంచి, తమ అనుకూల పెట్టుబడిదారులకు దోచి పెడుతున్న కేంద్రం... అప్పుల పేరుతో రాష్ట్రాల అవసరాలను నియంత్రించబూనడం దేనికి సంకేతం...?