Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్రివర్ణ పతాకం అనగానే... ఆ మూడు రంగులను చూడగానే మనకు దేశం దృశ్యమానవుతుంది. మూడురంగుల జెండా ఎగరగానే నిలబడి సెల్యూట్ చేసి, జాతీయగీతాన్ని ఆలపించి దేశం మీద అచంచల ప్రేమను, భక్తిని ప్రదర్శిస్తాము. దేశాలకు సంకేతంగా జెండాలను ఏర్పాటు చేసుకోవడం ఎప్పటినుండో కొనసాగుతున్నది. అయినా ఆధునికంగా పదిహేను, పదహారోశతాబ్దం నుండి ఒకజాతికి, దేశానికి సంకేతంగా జెండా నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. మనదేశంలో కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమ సందర్భంగా జాతీయజెండా రూపకల్పన జరిగింది.
జెండా అంటే ఏదో ఒక గుడ్డముక్క కాదు, కోట్లాది మంది ప్రజల గుండెచప్పుడుకు గుర్తు. జెండాలో దేశం ప్రతిబింబిస్తుంది. దేశమంటే ప్రకృతి సిద్దమైన భూభాగమూ అందులో నివసించే ప్రజా సమూహము. వారి విశ్వాసం, ధైర్యం, సార్వభౌమత్వం సమున్నతంగా నిలిచివుందన్న దానికి గుర్తుగా జెండా ఎగురవేస్తాము. జెండారంగులు, వాటిలోవుండే చిహ్నాలు, ఆ దేశపు ఆశయాలను, లక్ష్యాలను, ఆలోచనలను వ్యక్తపరుస్తాయి. జెండాను గౌరవించటమంటే దేశం మొత్తంలోని ప్రజల శక్తిని గౌరవించడమే. ఇప్పుడెందుకు జెండా గురించి చెప్పుకోవాలంటే, ఈనెల 20న మన జాతీయ జెండా నిబంధనలను ప్రభుత్వం మార్చివేసింది. 75ఏండ్ల స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఇరువైకోట్ల ఇండ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎవరికివారు ఎగురవేయాలని ఆదేశించింది. జెండా కోసం అంత క్రితం ఖాదీవస్త్రాన్నే వాడేవారు. ఇప్పుడు సిల్కు, పాలిస్టర్, సింథటిక్, యంత్రాలతో తయారైన ప్లాస్టిక్తోనూ తయారుచేయవచ్చని సవరణ తీసుకువచ్చారు. ఇన్నికోట్ల జెండాల అవసరాన్ని బట్టి, చైనా మొదలైన ఇతరదేశాల నుండి మన జాతీయజెండాలను దిగుమతి చేసుకోవటానికి పూనుకున్నారు. అంటే దేశానికి, దేశభక్తికి సంకేతమైన జెండాను కూడా మనకు మనం తయారుచేసుకునే స్థితిలో మనం లేము. డెబ్భయి అయిదేండ్ల స్వాతంత్య్ర ఉత్సవాలకు విదేశీయులు మనకు జెండాలను సమకూరుస్తారన్న మాట!
మన తెలుగువాడైన పింగళి వెంకయ్య 1921లో ఒక జెండాను తయారుచేసి గాంధీగారికి ఇచ్చాడు. అది అనేక మార్పులకులోనై మూడురంగులతో 2:3 కొలతలతో మధ్యలో భారతదేశ స్వావలంబనకు గుర్తుగా నూలువడికే రాట్నాన్ని చిత్రించి - ఖాదీవస్త్రంతో తయారుచేసుకున్నాము. 1931లో అధికారికంగా జాతీయోద్యమం మన త్రివర్ణ పతాకాన్ని ప్రకటించింది. ఇక స్వాతంత్య్రం వచ్చాక 1947 జూలైలో రాజ్యాంగ అసెంబ్లీ చరకా బదులుగా అశోకుని ధర్మచక్రాన్ని స్వీకరించింది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించి ఆదుకోవడం, స్వావలంబనను సాధించడమనే లక్ష్యాలతో ఖాదీవస్త్రంతోనే జెండాను తయారుచేయాలని నాటి జాతీయోద్యమ నాయకులు భావించారు. అందుకనే ఆ నిబంధనను అనుసరించాము. కానీ ఇప్పుడా జాతీయోద్యమ వారసత్వం. అధికారంలో లేకపోవటంతో లక్ష్యాలు, చిహ్నాలు అనేక సవరణలకు లోనవుతున్నవి.
ఈ సవరణను, నిర్ణయాన్ని కర్నాటక ఖాదీ గ్రామోదయ సంయుక్త సంఘము తీవ్రంగా ఖండించింది. దేశవ్యాపిత నిరసనకు పిలుపునిచ్చింది. ఎందుకంటే... బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ పతాకాన్ని తయారు చేయాల్సిన పద్ధతిని, ప్రత్యేక లక్షణాలను నిర్దేశించి, జెండాలు తయారుచేయడానికి ఖాదీ అభివృద్ధి పరిశ్రమల కమిషన్కు హక్కును దఖలుపరచింది. ఈ కమిషన్ ఇతర స్థానిక గ్రూపులకు తయారీని అప్పగిస్తుంది. 2009 నాటికి పతాకం ఏకైక తయారీదారుగా కర్నాటక ఖాదీ సంయుక్త సంఘం ఉంది. ఇప్పుడీ సవరణతో దేశీయ గ్రామీణ ఖాదీ పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతింటాయి. పరిశ్రమలు దెబ్బతినడమంటే మన చేనేత వృత్తిదారులు దివాళా తీయటమే. ఇది అమృతోత్సవాల వేళ ప్రభుత్వం దేశీయులకిచ్చే బహుమతి. మాటల్లో స్వదేశీభక్తి, చేతల్లో విదేశీ అనురక్తి అర్థం చేసుకోవటానికి మనకెంత కాలం పడుతుందో మరి! దేశీయ సంపదను, సంస్థలను వేలంవేస్తూ అమ్మేస్తున్న ఘనులకు ఇదేమంత పెద్ద విషయంగా తోచదు కానీ, ఇది భరతజాతి ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. దేశభక్తి భావాన్ని పరీక్షకు నిలిపే విషయం. ఈ దేశ ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడే సాధికారతను సాధించడానికి మూడు పాతికల కాలంలో పాలనాధీశులు ఏమిచేశారో ఉత్సవాల్లో సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైంది. గుండెపై తుపాకీ గుండ్లు వర్షిస్తున్నా ఎత్తిన జెండాను దించని స్వాంత్య్ర సమరయోధుల జ్ఞాపకాలకూ, నేటి కార్పొరేటు సేవకులకూ తేడాను గమనించాల్సిన సమయమూ ఇదే. జాతి చిహ్నాలనే కాదు, జాతి స్వభావాన్ని మార్చే బేహారుల పట్ల జాగ్రత్తవహిస్తేనే మన పతాకమూ పరిరక్షించబడుతుంది, జాతి భవిష్యత్తూ నిలబడుతుంది.