Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నేటికి పదిహేను రోజులైనా వాయిదాల పర్వమే కొనసాగుతోంది తప్ప, ప్రజా సమస్యలేవీ చర్చకు నోచడం లేదు. దీనిని ప్రశ్నించిన సభ్యులు సభ నుంచి గెంటివేతకు గురవుతున్నారు. ఇప్పటికే 27మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఇంతకీ వారు చేసిన నేరమేమిటంటే... పెరుగుతున్న ధరల గురించి, ద్రవ్యోల్బణం గురించి, ఇటీవల ఆహార పదార్ధాల మీద కూడా కొత్తగా జీఎస్టీ విధించడం గురించి ఈ అత్యున్న సభలో చర్చ జరగాలని కోరడమే..! ప్రజా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించడం, పరిష్కరించడం ప్రజాప్రతినిధుల ప్రాథమిక కర్తవ్యం! కానీ, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నేరమన్నట్టుగా వారిని చట్టసభల నుంచి బయటకు పంపడమంటే అర్ధమేంటి? ప్రజా ప్రతినిధుల హక్కులను, చట్టబద్దంగా వారు చేయాల్సిన విధులను అడ్డుకోవడమే కదా! ప్రస్తుతం సాగుతున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వం ఈ వికృత క్రీడకే పాల్పడుతోంది. దేశ ప్రజలను ఊపిరాడనీయకుండా చేస్తున్న సమస్యల ప్రస్తావనకు కూడా అవకాశం లేకుండా చట్టసభల్లో తనకున్న మంద బలంతో అడ్డుకుంటోంది. పైగా సస్పెండయిన వారే సభకు అడ్డుపడుతున్నారని ఎదురు దాడి చేస్తోంది. ఈ నెల 18న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ కేంద్ర ప్రభుత్వానిది ఇదే ధోరణి!
ప్రజాజీవితాన్ని సంక్షోభంలోకి నెడుతూ, దేశ ఆర్థికవ్యవస్థను దివాలా తీయిస్తున్న అంశాలపై చర్చను కోరినంతనే, ప్రభుత్వం పార్లమెంటు నిర్వహణను సైతం ఏకపక్షంగా మార్చిన తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. మోడీ పాలనలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఈ స్థాయికి పడిపోయింది కాబట్టే జోక్యం చేసుకోవాలంటూ ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాయాల్సి వచ్చింది. 15వ రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపిన లేఖలోనే ఈ విష యాన్ని కూడా విపక్షాలు ప్రస్తావించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ముర్ము ఈ లేఖపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
అసలు మోడీ సర్కారు ప్రతిపక్షమంటేనే లెక్కలేని విధంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షం లేవనెత్తే ఏ అంశాన్నీ ఈ ప్రభుత్వం పట్టించుకునే స్థితి లేదు. తీర్మానాల అంశంలోనూ ఇదే ధోరణి. ఇప్పుడు లోక్‌సభలో, రాజ్యసభలో టీఎంసీ, డీఎంకే, టీఆర్ఎస్, టిఆర్ఎస్, సీపీఐ(ఎం) సీపీఐ ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన 27మందిని సస్పెండ్ చేసింది. ప్రత్యేకించి రాజ్యసభలో ఇంత పెద్ద సంఖ్యలో సభ్యులను సస్పెండ్ చేసి, సభా కార్యక్రమాలను నిర్వహించడం రాజ్యసభ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం! పార్లమెంటులో ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండే నిబంధనలను సైతం అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఖరారైన సభా కార్యక్రమాలను కూడా సస్పెండ్ చేసి, సభ్యుడు లేదా సభ్యులు లేవనెత్తిన అంశాలను చర్చకు పెట్టే కీలకమైన అధికారాన్ని 267వ నిబంధన సభాధ్యక్షుడికి కట్టబెట్టింది. కానీ, రాజ్యసభ ఛైర్మన్ హోదాలో వెంకయ్యనాయుడు ఒక్కసారి కూడా ఈ నిబంధన కింద చర్చకు అవకాశమే ఇవ్వలేదు. రాజ్యసభ రికార్డుల ప్రకారం ఈ నిబంధన కింద 2016 నవంబర్ 16న చివరిసారి చర్చ జరిగింది. ప్రతిపక్షం గొంతు ఈ స్థాయిలో నొక్కుతూ కూడా ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమంటూ అధికార పక్షం చేసే సవాళ్లకు అర్ధమేమిటి?
ప్రజా సమస్యల చర్చకే అవకాశం లేకుండా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పార్లమెంటు ఉనికికీ, ప్రజాస్వామ్య మనుగడకూ అత్యంత ప్రమాదకరం. ఇది అధికార పక్షం ఒక వ్యూహం ప్రకారం, తన మంద బలంతో ప్రజాస్వామ్యంపై చేస్తున్న దాడి. ఒకవైపు ఇంత అప్రజాస్వామికంగా దాడి చేస్తూ... మరోవైపు, ''సభ్యులు క్షమాపణ చెబితే వారి సస్పెన్షన్ ఎత్తివేసే అంశాన్ని ఛైర్మన్ పరిశీలిస్తారు'' అంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి ''మహాగొప్ప ఔదార్యం'' వొలకబోస్తున్నారు...! ఇంతకీ క్షమాపణ ఎవరు చెప్పాలీ, ఎందుకు చెప్పాలీ? ప్రజా సమస్యలను చట్టసభల్లో లేవనెత్తి, వాటిపై చర్చించాలని పట్టుబట్టినందుకు ప్రతిపక్ష సభ్యులు క్షమాపణ చెప్పాలని మంత్రిగారు కోరుతున్నారా?! లేక అధిక ధరలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు అసలు ప్రజా సమస్యలే కాదని ఆయన భావిస్తున్నారా? నిజానికి క్షమాపణ ఎవరు చెప్పాలి? సమస్యలను లెవనెత్తిన ప్రతిపక్షమా...? లేక మందబలంతో వారి గొంతు నులిమిన అధికార పక్షమా?