Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏ మాటల వెనుక ఎలాంటి అర్థాలు దాగున్నాయో తెలియనంతకాలం జనం మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉంటారు...' అని హితోపదేశం చేశారు ఒక మహానుభావుడు. రాజకీయాలకు, అందునా వర్తమాన రాజకీయాలకు ఈ హితోక్తిని అన్వయించి చూస్తే... అనేకానేక వాస్తవాలు, అంతకుమించిన నగ సత్యాలూ మనకు బోధపడుతుంటాయి. తాజాగా మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశ మైంది. కేసీఆర్ కుటుంబంపై యుద్ధం చేయటానికి, అరాచక పాలనను అంతమొందించటానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతోపాటు కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ నష్టపోయిందనీ, రేవంత్‌కు పీసీసీ పీఠం కట్టబెట్టటాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇదే సమయంలో మునుగోడులో మూడున్నరేండ్లుగా అభివృద్ధి జరగలేదనీ, ఉప ఎన్నికలు వస్తేనే అది సాధ్యమవు తుందంటూ ఆయన కొత్త సూత్రాన్ని కనిపెట్టి జనం మీదికి వదిలారు. అయితే టీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా తాను త్వరలోనే బీజేపీలో చేరతానని ప్రకటించటమే ఇక్కడ అసలు సిసలు ట్విస్ట్.
ఈ దేశానికి, రాష్ట్రానికి ప్రజా ప్రతినిధుల రాజీనామాలేం కొత్త కాదు. ఆ వెంటనే నిర్వహించిన ఉప ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించిన వారూ అనేక మంది ఉన్నారు. కాకపోతే ఎవరి కోసం, ఎవరి ప్రయోజాలను ఆశించి రాజీనామాలు సమర్పించారనేది, తద్వారా వారు ఏం సాధించారనేది ప్రస్తావనార్హం. ఈ కోవలో చెప్పుకోవాల్సింది 1960వ దశకంలో 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు...' నినాదంతో పుట్టిన పోరాటం. యువత ఆకాంక్షల నుంచి ఉద్భవించిన ఈ నినాదం యావత్ తెలుగు ప్రజలందర్నీ ఏకం చేసి ఒక మహోజ్వల ఘట్టానికి తెరతీసింది. ఆనాడు వామపక్షాలకు చెందిన మొత్తం 67 మంది శాసనసభ్యులు, ఏడుగురు లోక్‌సభ సభ్యులు తమ పదవులను తృణ ప్రాయంగా భావించి విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాజీనామాలు సమర్పించారు. అది తెలుగు వారి గురడెల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రాజీనామాల చరిత్ర. అటు తర్వాత అనేక సందర్భాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీనామాలిచ్చిన వారినీ చూశాం. ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌పై కేసీఆర్‌తోపాటు ఆయన పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పలుమార్లు రాజీనామా చేసిన సందర్భాలు ఇప్పటి తరానికీ విదితమే.
ఇందుకు భిన్నంగా నిన్న ఈటల రాజేందర్, నేడు రాజగోపాలరెడ్డి తతంగాలు కొనసాగుతున్నాయి. మరోవైపు తాను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి నిధులు రావట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అంటూ ఈ మునుగోడు ఎమ్మెల్యే చెప్పటం వింతల్లో వింత. గతంలో వామపక్షాల తరపున అసెంబ్లీలో ఒక్కరుగానే ఉండి గళమెత్తి గద్దెనెక్కిన పార్టీలను గడగడలాడించిన ఓంకార్, సున్నం రాజయ్య, జూలకంటి రంగారెడ్డి లాంటి వారి పోరాట పటిమను ఇక్కడ మనం మననం చేసుకుంటే ఆయన వాదనలోని పస ఇట్టే తేలిపోతుంది. వాస్తవానికి తనకు పీసీసీ అధ్యక్ష పదవి, సీఎల్పీ లీడర్ పదవి ఇవ్వలేదనే కారణంతో రాజగోపాల్‌రెడ్డి గత మూడున్నరేండ్లుగా అసంతృప్తితో రగిలిపోతున్నారనేది ఆయన నియోజకవర్గంతోపాటు తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. అటు శాసనసభా సమావేశాల్లోనూ, ఇటు బయటా ఆయన మాటల్లో ఈ అసంతృప్తి తొంగి చూసేది. ఇది ఆయనకు, ఆయన పార్టీకి సంబంధించిన వ్యవహారం. కానీ ఆ పేరిట నిర్దిష్టమైన కారణమేదీ లేకుండా ఆయన తన పదవికి రాజీనామా ఎందుకు చేశారో..? తద్వారా ఒక ఉప ఎన్నికకు, కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసేందుకు ఆయన కారణమవుతున్నారు. ఇవన్నీ మనకు పైకి కనిపించే విషయాలు. మీడియాలో, సోషల్ మీడియాలో అనునిత్యం నానుతున్న కథనాలు. కానీ ఇక్కడే ఓ 'చరద్రగుప్త...' రహస్యం దాగుందనేది ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. చత్తీస్‌ఘడ్‌లో ఓ భారీ ఓపెన్ కాస్ట్ మైనింగ్ టెండర్... రాజగోపాలరెడ్డికే దక్కేలా కేంద్రంలోని బీజేపీ మార్గం సుగమం చేసిందనే వార్తలు ప్రస్తుతం గుప్పుమనటమే ఇందుకు కారణం. ప్రధాని మోడీ తన ప్రియాతి ప్రియమైన మిత్రుడు అదానీకి కాదని ఈయనకే ఆ టెండరు దక్కేట్టు చూశారనే గుసగుసలు సైతం వినబడుతుండటం మరో విస్మయకర అంశం. దేశాన్ని గంపగుత్తగా కార్పొరేట్, ప్రయివేట్ వారికి అప్పజెప్పటం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్ని కూల్చేందుకు వీలుగా ఎమ్మెల్యేలను నిలువునా కొనేయటం ఆ పార్టీకి ఆనవాయితీగా మారిన సంగతి మనకెరుకే. ఈ క్రమంలో ఇప్పటిదాకా అధికార టీఆర్ఎస్లోని 'షిండే...'లపై దృష్టి పెడుతున్నామంటూ చెప్పిన రాష్ట్ర కాషాయ పెద్ద తలకాయలు... ఇప్పుడు కేవలం గులాబీయే కాదు.. హస్తం పార్టీపైనా గురిపెట్టి, తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం తేటతెల్లమవుతున్నది. ఈ క్రమంలో ఇలాంటి అంశాలను నిశితంగా పరిశీలించి చూస్తే... ఏ ప్రయోజనాలనాశించి రాజగోపాల్ రాజీనామా చేశారన్నది ఇట్టే తెలిసిపోతున్నది. పైగా తాను ఏ అభివృద్ధి కోసమైతే రాజీనామా చేశానని అంటున్నారో... ఆ అభివృద్ధి నిరోధక, మతతత్వ పార్టీలో చేరటం వల్ల తెలంగాణ సమాజానికి కోమటిరెడ్డి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారనేది ఓ భేతాళ ప్రశ్న. 'ఇక్కడ సొంత లాభము కొంత మానుకు కాదు...', సొంత లాభమే అన్నింటికంటే మిన్న.