Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏలినవారి కోపతాపాలకు ''ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్'' ఓ సాధనంగా తయారైంది. గతంలో అధికార పక్షాలు ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికీ, తమ ప్రాబల్యం నిలుపుకోవడానికీ డబ్బు, పదవులను ఎరగా వాడేవి. ఇప్పుడీ పాలకపక్షం వాటికి అదనంగా ఈడీని కొరడాగా వాడుతోంది. మొత్తానికి ప్రత్యర్థి ప్రభుత్వాలను అస్థిరపరచాలన్నా, తమ సొంత పార్టీని విస్తృతపరచాలన్నా ఉపయోగపడేలా ఈడీని ఒక తిరుగులేని సాధనంగా తీర్చిదిద్దారు మోడీజీ. ఫలితంగా రాజ్యాంగబద్ధమైన ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాస్తా, ఏలినవారి జేబు సంస్థగా మారిపోయింది. నేడు పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులంతా కలిసికట్టుగా ''ఈడీ డౌన్‌డౌన్'' అని నినదించాల్సి వచ్చిందంటే మోడీసర్కార్ ఈడీ వాడకం ఏస్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ''ఈడీ అంటే మోడీ - మోడీ అంటే ఈడీ'' అన్న చందంగా సాగుతున్న ఈ వ్యవహారం, చివరికి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు, విమర్శించే బాధ్యతలకు అవకాశమే లేకుండా చేస్తోంది.
నిజానికి ఇది మోడీ కొత్తగా కనిపెట్టిన అస్త్రమేమీ కాదుగానీ, ఇంత దూకుడుగా దుర్వినియోగం చేసినవారు ఇంతకుముందెవరూ లేరు. ప్రస్తుతం ఈడీ డైరెక్టర్‌గా ఉన్న సంజరుకుమార్ మిశ్రా పూర్తిగా తమ అనుకూలుడు కావడంతో, సుప్రీంకోర్టు అభ్యంతరాలను కూడా లెక్కచేయకుండా ఆర్డినెన్స్ జారీ చేసి మరీ ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. అంతేనా, మనీలాండరింగ్ నిరోధక చట్టానికి ఆర్థికబిల్లు రూపంలో సవరణలు చేస్తూ ఈడీకి అపరిమితమైన, ఏకపక్షమైన అధికారాలను కట్టబెట్టారు. పార్లమెంటరీ ప్రక్రియను పక్కనబెట్టి, తాను చేయదలచుకున్న చట్టసవరణలకు ఆర్థికబిల్లులను దొడ్డిదారిగా ఎంచుకోవడం ఈ ప్రభుత్వానికి చెల్లినంతగా మరే ప్రభుత్వానికీ చెల్లలేదు. ఈ మనీలాండరింగ్ చట్టసవరణకు కూడా ఈ ప్రభుత్వం ఆ దొడ్డిదారినే అనుసరించింది. దీనిని సవాలు చేస్తూ అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. ప్రతిపక్షాలూ, ప్రజాస్వామిక సంస్థలతో పాటు పౌరసమాజం నుండి కూడా 240పైగా పిటీషన్లు రావడం విశేషం.
వీటన్నింటినీ సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం పరిశీలించాల్సి ఉంది. కానీ ఇంతలోనే జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ సి.టి.రవికుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పు అభ్యంతరాలన్నింటినీ విస్తృత ధర్మాసనం పరిశీలిస్తుందని చెపుతూనే, ఈ సవరణ ద్వారా ఈడీకి లభించిన అధికారాలన్నింటినీ సమర్థించింది. పార్లమెంటరీ ప్రక్రియలో కాకుండా ఆర్థికబిల్లు ద్వారా తెచ్చిన ఈ సవరణలు చెల్లుతాయో లేదో విస్తృత ధర్మాసనం తేల్చిచెప్పకముందే, కనీసం పరిశీలించకముందే ఈ త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువడటం గమనార్హం. అందుకే 17 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా ఈ తీర్పుపట్ల అభ్యంతరం తెలిపాయి. రేపు విస్తృత ధర్మాసనం ఈ సవరణలేవీ చెల్లవంటే ఈ తీర్పు రద్దవుతుందని గుర్తుచేశాయి. తీర్పును సమీక్షించాలని న్యాయస్థానాన్ని కోరాయి.
ఎందుకంటే... ఇంకా చెల్లుతాయో లేదో తేలని ఈ సవరణల ద్వారా దర్యాప్తు సంస్థలకు దఖలు పరచబడిన అధికారాలు అత్యంత నిరంకుశమైనవి. అవి ఇప్పటికే దురుద్దేశపూర్వకంగా, దుర్మార్గంగా ఏలినవారి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. నీచమైన రాజకీయ ప్రతీకారాలకూ, ప్రజాస్వామ్యానికి కీలకమైన ప్రతిపక్షాల నిర్మూలనకూ సాధనాలుగా ఉపయోగించ బడుతున్నాయి. ఇప్పుడీ తీర్పు ద్వారా ఇవి మరింత తీవ్రమవుతాయనీ ప్రతిపక్షాల్లోనూ, పౌర సమాజంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏ తప్పు చేయనప్పుడు ఎందుకీ ఆందోళనంటూ అధికారపక్షం చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఎవరికీ అభ్యంతరం లేదుగానీ, ఈ దాడులన్నీ దోషులపై గాకుండా, ప్రశ్నించే శక్తులపై సాగుతుండటమే అభ్యంతరకరం. ''ఎవరు ఎక్కడ గట్టిగా మాట్లాడినా ఈడీ మీ ఇంటి తలుపు తడుతుంది'' అంటూ పాలకపార్టీ నేతలు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు కదా..! ఇవి దేనికి సూచికలు? కొందరు ఎంతటి దోషులైనా పాలకపక్షంలో చేరినంతనే కేసులన్నీ కంచికి చేరి 'పునీతులు' అవుతుండగా, మరికొందరు దోషమేమీ లేకుండానే ప్రశ్నించిన కారణానికి నేరస్తులుగా వేదింపులకు గురవుతున్నారు కదా..! ఇవి దేనికి సంకేతాలు? నాడు యూపీఏ కాలంలో 112 ఈడీ సోదాలు జరిగితే, నేడు ఈ ఎన్డీఏ హయాంలో ఈ ఎనిమిదేండ్లలోనే మూడువేలకు పైగా ఈడీ దాడులు జరిగాయి. కానీ ఇందులో దోషులుగా తేలింది కేవలం 23మంది మాత్రమే. దీనిని బట్టి ఈడీ వాడకం దేనికి సాగుతున్నట్టూ..?! కనుక ఇప్పటికైనా సర్వోన్నత న్యాయస్థానం ఈ వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలి.