Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మతిభ్రష్టుడైన జైర్ బోల్సనారో ఎన్నికల సర్వేల్లో వెనుకబడటంతో దేశం నియంతృత్వంవైపు మళ్లుతుందని భయపడుతున్న బ్రెజిలియన్లు'' అంటూ గార్డియన్ పత్రిక ఆగస్టు తొమ్మిదిన రాసిన విశ్లేషణ బ్రెజిల్ తరుణ ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ముప్పును వెల్లడిస్తున్నది. పోర్చుగీసు నుంచి స్వాతంత్య్రం పొంది 200 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా సెప్టెంబరు ఏడున ప్రదర్శనలు జరపాలంటూ మద్దతుదార్లకు బోల్సనారో ఇచ్చిన పిలుపు వెనుక ప్రజస్వామ్యంపై దాడికి కుట్ర ఉందని ప్రతిపక్షాలు భయపడుతున్నట్లు ఆ పత్రిక పేర్కొన్నది. ఎన్నికల ఫలితాలను గుర్తించేదిలేదని ప్రకటించిన డోనాల్డ్ ట్రంప్, పార్లమెంటు భవనంపైకి తన మద్దతుదార్లను దాడికి ఉసిగొల్పిన మాదిరే బోల్సనారో వైఖరి ఉందన్నది స్పష్టం. అక్టోబరు రెండవ తేదీన జరిగే ఎన్నికల్లో వామపక్ష నేత, మాజీ అధ్యక్షుడు లూలా చేతిలో మట్టి కరవనున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో గెలిచిన బోల్సనారో గత నాలుగేండ్ల విధానాలు ప్రజావ్యతిరేకమైనవే కాదు, నియంతలను ఆరాధించిన తీరుతెన్నులు తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి.
1964లో మిలిటరీ నియంతలు అధికారాన్ని హస్తగతం చేసుకొని 1985వరకు జనాన్ని అణచివేశారు. వ్యతిరేకించిన వారిని చిత్రహింసలపాలు చేశారు, విప్లవకారులను కాల్చి చంపారు. అనేక మందిని గల్లంతు చేశారు. ఇప్పటికీ ఆచూకీ లేదు. కవులు, కళాకారులు అనేక మంది దేశం విడిచి వెళ్లారు. ఎక్కడ చూసినా విచారం, భయం, హింసాకాండ ప్రభుత్వ విధానంగా ఉంది అలాంటి రోజులు తిరిగి రాకూడదంటూ మాజీ మంత్రి 83 సంవత్సరాల లాయర్ జోస్ కార్లోస్ దియాస్ ప్రజాభిప్రాయ సేకరణకు నడుం కట్టారు. 1977 ఆగస్టులో తనతో కలసి వచ్చే లాయర్లను కూడగట్టి ఎందరో రాజకీయ ఖైదీల తరఫున వాదించటమే కాదు, చారిత్మ్రాక నియంతృత్వ వ్యతిరేక ఉద్యమాన్ని మలుపు తిప్పిన ''బ్రెజిల్ పౌరులకు లేఖ''ను దియాస్ విడుదల చేశారు. సరిగ్గా 45సంవత్సరాల నాడు సావోపాలో నగరంలో ఎక్కడైతే లేఖను విడుదల చేశారో తిరిగి అక్కడే ఆగస్టు నాలుగవ తేదీ ఆయనే ''2022 ఉద్ఘోషణ'' పేరుతో ఒక పత్రాన్ని రూపొందించి ఏకీభవించేవారు ముందుకు రావాలని ఇచ్చిన పిలుపుకు స్పందించి ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది లక్షల మంది సంతకాలు చేశారు.వారిలో న్యాయవాదులు, పారిశ్రామికవేత్తల వంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు. తన జీవితంలో ఒక నియంతృత్వాన్ని చూశానని మరొకదానికింద బతకాలనుకోవటం లేదని దియాస్ ప్రకటించారు. గతం మాదిరి చిత్రహింసలకు, నియంతృత్వానికి దేశంలో చోటు లేదన్నాడు. కుట్రకు బోల్సనారో తెరలేపుతున్నాడంటూ ట్రంప్ నిర్వాకాన్ని ఉటంకించారు.
మిలిటరీ పాలనలో చిత్రహింసలకు పేరుమోసిన ఒకడి భార్యను అధ్యక్ష భవనానికి ఆహ్వానించి ఒక జాతీయ వీరుడి సతి వంటూ బోల్సనారో ఆకాశానికి ఎత్తాడు. హంగరీ నియంత విక్టర్ ఓర్బాన్ను తన సోదరుడంటూ కీర్తించాడు. ట్రంప్ మద్దతుదార్లు అమెరికా పార్లమెంటు మీద దాడి చేస్తున్నపుడు బోల్సనారో కుమారుడు అక్కడే ఉండి అనేక మందిని కలుసుకొని మద్దతు తెలిపాడు. కరోనా పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించి లక్షలాది మందికి కారకుడైనందుకు జైలు పాలు కావచ్చని వార్తలు వస్తున్న నేపధ్యంలో ముగ్గురు నలుగురు పెద్దలు నన్ను జైలుకు పంపే నిర్ణేతలా అంటూ సుప్రీం కోర్టు నుద్దేశించి నోరుపారవేసుకున్నాడు. అంతే కాదు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో ప్రజాతీర్పును తారుమారు చేయవచ్చంటూ ఎదురుదాడికి దిగటమే కాదు అవసరమైతే బైబిల్లో పేర్కొన్నట్లుగా ఆయుధాలు పట్టండంటూ బోల్సనారో పిలుపునిచ్చాడు. సెప్టెంబరు ఏడవ తేదీన మిలిటరీతో పాటు తన మద్దతుదారులు ప్రదర్శనల్లో పాల్గొనాలని ఇచ్చిన పిలుపు వెనుక ఆ ప్రదర్శనపై దాడులు చేయించి వామపక్ష పార్టీలపై నెట్టే కుట్రకు తెరతీసినట్లు కూడా చెబుతున్నారు. అనేక మంది ప్రముఖులు ఈ కుట్ర గురించి ఇప్పటికే హెచ్చరించారు. అధికారంలో ఉండి స్వేచ్చకోసం జనాలు తుపాకులు పట్టాలని పిలుపు ఇవ్వటం ప్రమాదకర సంకేతమని చెప్పారు. ప్రజలను అప్రమత్తం గావించేందుకు దేశమంతటా ''2022 ఉద్ఘోషణ'' పత్రాన్ని చదివి వినిపించాలని, ప్రదర్శనలు జరపాలని కూడా వివిధ సంస్థలు పూనుకున్నాయి. ఎలాంటి కుట్రలు జరగకపోతే ఎన్నికలు సక్రమంగా జరిగితే బ్రెజిల్లో మరోసారి వామపక్షం అధికారానికి రానుంది. బోల్సనారో కుట్రలను విఫలం చేసేందుకు అప్రమత్తమైన శక్తులు అవసరమైతే మరోసారి ఆయుధాలు పట్టేందుకు సిద్దమని కూడా చెబుతుండటం అక్కడి పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నది.